Friday, August 14, 2020

 స్వాతంత్య్ర ద‌ర్శ‌నులు


1947, ఆగ‌స్టు 14 సాయంత్రం...
జ‌ర‌గ‌బోతున్న‌ది తెలిసినా... అంద‌రి మ‌న‌సుల్లోనూ ఒకటే ఉత్కంఠ‌..
వాయుదేవుడు సైతం గాలి బిగ‌ప‌ట్టి బిగించుకుని కూర్చున్నాడు.
నెమ్మ‌దిగా చీక‌టి ప‌డుతోంది..
అమావాస్య రాత్ర‌లు కావ‌టంతో చంద్రుడు క‌నిపించీ క‌నిపించ‌కుండా ఉన్నాడు.
భార‌తీయులంతా న‌రాలు తెగే ఉత్కంఠ‌తో నిరీక్షిస్తున్నారు.
వృద్ధుల నుంచి పిల్ల‌ల దాకా అంద‌రూ శిలాప్ర‌తిమ‌ల్లా కూర్చున్నారు ఇంటింటా..
ప‌ల్లెప‌ల్లెలు, వాడ‌వాడ‌లు, ప‌ట్ట‌ణాలు.. అంతా నిశ్శ‌బ్దం.
మూగ‌జీవాలు సైతం ప‌చ్చి గ‌డ్డి కూడా ముట్ట‌కుండా మౌనంగా చెవులు రిక్కించాయి..
పూల‌చెట్లు పూల‌ను విక‌సింపచేయాలా.. ముకుళించుకోవాలా అని మొగ్గ‌గానే ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుదామా అని ఎదురుచూస్తోంది భార‌త‌జాతి.
స‌మ‌యం రానే వ‌చ్చింది.
అర్ధ‌రాత్రి అందరూ నిద్రిస్తూ ఉంటార‌నుకున్నా‌రేమో ఆంగ్లేయులు.
స‌రిగ్గా ఆగ‌స్టు 14 రాత్రి 12.00 గంట‌ల స‌మ‌యం ఆగ‌స్టు 15లోకి ప్ర‌వేశిస్తున్న త‌రుణంలో ప్ర‌క‌టించింది బ్రిటిష్ ప్ర‌భుత్వం..
భార‌త‌దేశం విడిచి వెళ్లిపోతున్నాం అని.
అంత‌వ‌ర‌కు గుండుసూది ప‌డితే విన‌ప‌డేంత నిశ్శ‌బ్దంగా ఉంది వాతావ‌ర‌ణం.
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణం పిల్ల‌లంతా త‌ప్ప‌ట్ల‌తో కేరింత‌లు కొట్టారు.
పెద్ద‌లంతా ఆనంద‌బాష్పాలు విడుస్తూ, ఒక‌రినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు.
స‌ముద్ర‌తీర వాసులు అర్ధ‌రాత్రే అక్క‌డ‌కు చేరి, ఆ రోజు సూర్యోద‌యం ఎంత కొత్త‌గా ఉంటుందో వీక్షించాల‌నుకున్నారు.
సూర్యుడు ఇలా పైకి వ‌స్తున్నాడో లేదు, అంద‌రూ సంతోషంతో ఆయ‌న‌కు న‌మ‌స్క‌రించి, ప‌రిప‌రివిధాల ప్ర‌స్తుతించారు.
ఇంత‌కాలం జ‌రిగిన అన్ని న్యాయాన్యాయాల‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన ఆదిత్యుడు ప్ర‌కాశ‌వంతంగా ఉద‌యించాడు.
స్త్రీలంతా గాంధీగారి ప‌టానికి హార‌తులిచ్చి పాలాభిషేకం చేశారు.
వీధి వాకిళ్ల‌ను రంగ‌వ‌ల్లుల‌తో అలంక‌రించారు. గుమ్మాల‌కు మామిడి తోర‌ణాలు క‌ట్టారు.
త‌లంటు పోసుకుని. నూత‌న వ‌స్త్రాలు ధ‌రించారు.
పిండి వంట‌లు త‌యారుచేసి, ఇరుగుపొరుగుల‌కు అందించుకున్నారు.
స్వ‌చ్ఛ‌మైన‌, క‌ల్మ‌షం లేని మ‌న‌సుల‌తో అంద‌రూ స‌మావేశ‌మై, స్వాతంత్ర్యం కోసం జైళ్ల‌కు వెళ్లి, న‌ర‌క బాధ‌లు అనుభ‌వించిన‌వారి గురించి త‌ల‌చుకుంటూ, కంట త‌డి పెట్టారు. వారి త్యాగ‌ఫ‌ల‌మే క‌దా, ఈ నాటి మ‌న స్వేచ్ఛ‌కు కార‌ణం అనుకుంటూ దేశ‌నాయ‌కుల‌ను స్మ‌రించుకుని, వారికి పూజ‌లు జ‌రిపారు.
ఈ సంఘ‌ట‌న జ‌రిగి నేటికి 73 సంవ‌త్స‌రాలు గ‌డిచి, 74 వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశించాం.
ఇప్ప‌టికీ ఆ జ్ఞాప‌కాల త‌డి గుండెను ఆర్త్రం చేస్తుంది అంటున్నారు .. 95 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఉన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి, వ‌యొలిన్ విద్వాంసుడు అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి.
నాటి స్వాతంత్ర్య వేడుక‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించిన‌వారు వీరు. నాటి విష‌యాల‌ను నేటికీ ఇంకా మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నాయి అంటున్న వీరితో సాక్షి సంభాషించింది. ఆ వివ‌రాలు..
----------

అన్న‌వ‌రపు రామ‌స్వామి (95), ప్ర‌ముఖ వ‌యొలిన్ విద్వాంసుడు, విజ‌య‌వాడ నుంచి...
1947, ఆగ‌స్టు 15, చాలా విశేష‌మైన రోజు. భార‌త‌జాతి దాస్య శృంఖలాలు తెంచుకున్న రోజు. ఎంతోమంది ప్రాణ‌త్యాగం చేయ‌టం వ‌ల్ల మ‌న‌కు ఈ సంతోష‌క‌ర‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చిన‌రోజు. మాకు పెద్ద పండుగ‌. ఈ పండుగ‌కు ప్ర‌ధాన కార‌కులు గాంధీగారేన‌ని అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చేనాటికి నా వ‌య‌సు 22 సంవ‌త్స‌రాలు. ఆ రోజున ఇంటింటా ఎవ‌రికి తోచిన వేడుక‌లు వారు చేసుకున్నారు. అప్ప‌ట్లో మీడియా ఇంత ఎక్కువ‌గా లేదు. అందువ‌ల్ల ఎక్క‌డి విష‌యాలు అక్క‌డే ఉండిపోయేవి. అంద‌రూ ఒకేచోట చేరే అవ‌కాశ‌మే లేదు.
ఆ రోజు గుంటూరులో మ‌హావిద్వాంసులైన మ‌హాద్రి వెంక‌ట‌ప్ప‌య్య‌శాస్త్ర్రి గారి క‌చేరీ ఏర్పాటు చేశారు. మేం అప్ప‌టికి పారుప‌ల్లి రామ‌కృష్న‌య్య పంతులుగారి ద‌గ్గ‌ర గురుకుల విద్యాభ్యాసం చేస్తున్నాం. మేమంతా ఆ క‌చేరీకి హాజ‌ర‌య్యాం. ఆ రోజు అక్క‌డకు వ‌చ్చిన‌వారిలో .. ఎవ‌రి ముఖాల‌లో చూసినా ఆనంద‌మే వెల్లివిరిసింది. అంద‌రూ వారి వారి ఇళ్ల‌లో జెండాలు ఎగ‌రేసుకున్నారు. ఆ రోజుల్లో దుకాణాలు బాగా దూరంగా ఉండ‌టం వ‌ల్ల ఏమైనా కొనుక్కుందామ‌న్నా కుదిరేది కాదు. షాపులు కూడా ఎక్కువ‌గా ఉండేవి కాదు.
అప్ప‌ట్లో విజ‌య‌వాడ‌లో ఆకాశ‌వాణి కేంద్రం ఇంకా రాలేదు. మీడియా ఇంత ఎక్కువ‌గా లేక ఏ స‌మాచార‌మూ బ‌య‌ట‌కు రాలేదు. మ‌ద్రాసు నుంచి ఆంధ్ర‌ప‌త్రిక మాత్ర‌మే వ‌చ్చేది. ఆ పత్రిక వ‌చ్చిన త‌ర‌వాతే స‌మాచారం తెలిసేది. అవి అతి విలువైన రోజులు. ప్ర‌తి విష‌యానికీ విలువ ఇచ్చేవారు. అప్ప‌టి మాటల్లో ఒక జీవం, ప‌విత్ర‌త ఉండేవి. ప్ర‌తి వారి మాట‌కు విలువ ఉండేది. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టే ఉండేది. వారే మ‌న దేశానికి స్వాతంత్ర్యం తీసుకువ‌చ్చారు.
జాన‌ప‌ద క‌ళాకారులు..

ఒక పేట‌లో ఉన్న‌వారంతా ఒక‌చోట చేరి సంబ‌రంగా వేడుక‌లు చేసుకున్నారు. బుడ‌బుక్క‌ల వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఇల్లిల్లూ తిరుగుతూ స్వాతంత్ర్యం గురించి అందంగా మాట‌లు చెప్పారు. పిల్ల‌లంతా ఒక చోట చేరి ప‌ద్యాలు, పాట‌లు పాడారు. ప‌నిపాట‌లు చేసుకునేవారంతా ఒక మాస్టారుని నియోగించుకుని, ముందురోజు రాత్రి సాధ‌న చేసి, స్వాతంత్ర్యం వ‌చ్చింద‌ని ప్ర‌క‌ట‌న తెలిసిన వెంట‌నే డ‌ప్పులు వాయించారు. నాట‌కాలు వేశారు. వారిలో నిష్క‌ల్మ‌ష‌మైన గౌర‌వం, ప్రేమ ఉండేవి. ఎవ‌రికి వారే హ‌మ్మ‌య్య స్వ‌తంత్ర్యం వ‌చ్చింది అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటా గాంధీగారి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేశారు. క‌వులంతా క‌విత్వం రాసి, గేయంలా పాడారు. మాకొద్దీ తెల్ల‌దొర‌త‌న‌ము పాట‌ను అందరూ బృందాలుగా గానం చేశారు. ఆ నాటి వారి గురించి నేను చెప్పేది ఒక్క‌టే మాట‌, స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సుతో పండుగ‌లా జ‌రుపుకున్నారు. వీధివీధిలో బ్యాన‌ర్లు, జెండాలు క‌ట్టారు. క‌ల్మ‌షం లేని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు... అంటూ నాటి సంఘ‌ట‌న‌లు గుర్తు ఉన్నంత‌వ‌ర‌కు వివ‌రించారు.

అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి ప‌రిచ‌యం
తొమ్మిదిన్న‌ర ద‌శాబ్దాల వ‌య‌సు ఉన్న అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి విజ‌య‌వాడ‌లో నివ‌సిస్తున్నారు. ఆకాశ‌వాణి విజ‌య‌వాడ‌ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి అంటే 1948, డిసెంబ‌రు 1వ తేదీ నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ప‌నిచేశారు. ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు పారుప‌ల్లి రామ‌కృష్ణ‌య్య పంతులుగారి ద‌గ్గ‌ర గురుకుల వాసం చేసి సంగీతం అభ్య‌సించారు. నేటికీ సంగీత కార్య‌క్ర‌మం అంటే ఎంతో ఉత్సాహంగా ముందుకు వ‌స్తారు. గంట‌సేపు క‌చేరీ కూడా చేస్తున్నారు.
-------------------------------


శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి (95) ర‌చ‌యిత్రి (ప్ర‌ముఖ ర‌చ‌యిత బుచ్చిబాబు స‌తీమ‌ణి) బెంగ‌ళూరు నుంచి
మ‌న ఇళ్ల‌లో ద‌స‌రా దీపావ‌ళి పండుగ‌లు జ‌రుపుకున్న‌ట్లుగా ఈ పండుగ జ‌రుపుకున్నాం. బుచ్చిబాబుగారికి ఇలా చేయ‌టం చాలా ఇష్టం. మా ఇంటిల్లిపాదీ ఉదయాన్నే త‌లంట్లు పోసుకుని, కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోర‌ణాలు క‌ట్టాం. గ‌డ‌ప‌ల‌కుప‌సుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా క‌ళ‌క‌ళ‌లాడింది. రోజూఉండే ఇల్లే అయినా, ఆ రోజు ఎంతో కొత్త‌గా అనిపించింది. అప్ప‌డు నాకు 22 సంవ‌త్స‌రాల వ‌య‌సు. ర‌క‌ర‌కాల మిఠాయిలు త‌యారుచేశాం. ఇంటికి వ‌చ్చిన‌వారంద‌రికీ నిండుగా భోజ‌నం పెట్టాం. అప్ప‌డు మేం హైద‌రాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగుర‌వేయ‌టానికి హైద‌రాబాద్ ఆకాశ‌వాణి కార్యాల‌యానికి వెళ్లాం. అప్ప‌టికి ఇంకా డెక్క‌న్ రెడియోగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు ప‌ట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖ‌ద్ద‌రు పైజ‌మా, లాల్చీ క‌ట్టుకున్నారు. పైన వేసుకోవ‌టానికి ముందుగానే జోథ్‌పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మ‌ద్రాసు నుంచి సినీన‌టులు పుష్ప‌వ‌ల్లి, భానుమ‌తి గార‌లు వ‌చ్చారు. జైలు  నుంచి విడుద‌లైన వారిలో కొంద‌రు ఆకాశ‌వాణి ద్వారా ప్ర‌త్య‌క్షంగా త‌మ అనుభ‌వాలు పంచుకున్నారు.
ఎస్‌. ఎన్‌. మూర్తిగారు స్టేష‌న్ డైరెక్ట‌ర్‌. ఉమామ‌హేశ్వ‌ర‌రావు అనే అనౌన్స‌ర్ ,... భార‌త దేశం నేటి నుంచి స్వ‌తంత్ర దేశం... అని వార్త‌లు చ‌దివారు. ఆ రోజు ఎవ‌రో నాయ‌కుడి వ‌చ్చి జెండా ఎగుర‌వేశారు. పేరు గుర్తు లేదు. ప్ర‌కాశం గార‌ని గుర్తు. ఆయ‌న‌తో పాటు చాలా మందే వ‌చ్చారు. వింజ‌మూరి సీతఅన‌సూయ‌లు, టంగులూరి సూర్య‌కుమారి దేశ‌భ‌క్తి గీతాలు ఆల‌పించారు. క‌వి స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు. రేడియో అన్న‌య్య‌గారైన న్యాయ‌ప‌తి రాఘ‌వ‌రావుగారు పిల్ల‌లో నాట‌కాలు వేయించారు. ఆడ‌వారి చేత ర‌క‌ర‌కాల వంట‌లు చేయించారు. ఆ రోజు ఎక్క‌డ చూసినా, మా ఇంట్లో వాళ్లు ఇన్ని రోజులు జైలుకి వెళ్లొచ్చారు.. ఇంత శిక్ష ప‌డింది... అంటూ అదొక వేడుక‌గా, క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకున్నారు. పిల్ల‌లంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్ బి స్టేడియాన్ని అందంగా అలంక‌రించారు. జెండాలు ఎగుర‌వేశారు. అంద‌రికీ ఫ‌ల‌హారాలు అందించారు.

దువ్వూరి సుబ్బ‌మ్మ‌గారు ఉప‌న్యాసాలు ఇచ్చారు. బుచ్చిబాబుగారి బామ్మ‌గారు శివ‌రాజు సుబ్బ‌మ్మ‌గారు ఆరు నెల‌ల‌పాటు జైలులో ఉన్నారు. అక్క‌డ జైలులో ఆవిడ‌కు మ‌డి సాగేది కాదు. విష‌యం తెలుసుకున్న ఆ గ్రామ‌స్థులు, ఆవిడ‌కు మ‌డిగా వంట చేసి తెచ్చి ఇచ్చేవారు. ఆ విష‌యాల‌న్నీ ఆ రోజు మేం ముచ్చ‌టించుకున్నాం. ఆవిడ‌లాగే ఎంతోమంది పిల్ల‌లు, కుటుంబాల‌ను వ‌దులుకుని ఉద్య‌మంలో పాల్గొని జైలుపాల‌య్యారు. వారు అటు వెళ్లిన‌ప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గ‌డిచిందో ఆ భ‌గ‌వంతునికే తెలియాలి. ఉద్య‌మంలో పాల్గొన్న వారి కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌టానికి పార్టీ వారికి డ‌బ్బు ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుద‌లైన‌వారంతా ఇళ్ల‌కు న‌డిచి వెళ్ల‌వ‌ల‌సి వ‌చ్చేది. వారు జైలులో ఉండ‌గా చేసిన ప‌నుల‌కు ఇచ్చిన డ‌బ్బులు ప్ర‌యాణం ఖ‌ర్చుల‌కు స‌రిపోయేవి కాదు. అందునా అప్ప‌ట్లో ఇంత‌గా బ‌స్సు సౌక‌ర్యాలు కూడా లేవు క‌దా. పాపం వారంతా ఎన్నో క‌ష్టాలు ప‌డి కాలి న‌డ‌క‌నే ఇల్లు చేరారు. ఇన్నాళ్లు ప‌డిన శ్ర‌మ‌కు ఫ‌లితం ల‌భించంద‌నే ఆనంద‌మే వారి ముఖాలలో క‌నిపించింది.


మ‌ధుర‌క్ష‌ణాలు
ఒక‌సారి గాంధీగారు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు, స‌త్య‌నారాయ‌ణ అనే ఆయ‌న వేసిన పెయింటింగ్ గాంధీగారికి నాతో ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కింద‌కు దిగ‌టానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో ప‌విత్రంగా త‌డుముకునేదాన్ని. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌రోజు నాకు ఆ సంఘ‌ట‌న ఒక్క‌సారి మ‌నసులో స్ఫురించింది. అలాగే ప్ర‌కాశం పంతులుగారు మా ఇంటికి వ‌స్తుండేవారు. మా వారిని, ఏరా బుచ్చీ! అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు.
-------


శివ‌రాజు సుబ్బ‌లక్ష్మి ప‌రిచ‌యం
శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత్రి. బుచ్చిబాబు స‌తీమ‌ణి. తొమ్మిదిన్న‌ర ద‌శాబ్దాల వ‌య‌సులో కూడా నాటి జ్ఞాప‌కాలు ఇంకా ప‌చ్చిగానే ఉన్నాయంటున్నారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నివ‌సిస్తున్నారు. స్వాతంత్ర్య వేడుక‌ల‌నే కాదు, గాంధీ, నెహ్రూ , ప‌టేల్‌, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, టంగుటూరి ప్ర‌కాశం పంతులు వంటి ఎంద‌రో నాయ‌కుల‌ను స్వ‌యంగా ద‌గ్గ‌ర‌గా చూశారు.


ప‌త్రిక‌ల‌లో శీర్షిక‌లు..
ప్రాగ్దిశాన వినూత్న తార ఉద‌యిస్తున్న‌ద‌ని నెహ్రూ ప్ర‌బోధ‌...
భార‌త దేశ స్వాతంత్ర్య సిద్ధి
ఆసియా ఖండానికే కాక స‌క‌ల ప్ర‌పంచానికీ మ‌హోత్కృష్ట స‌మ‌యం
ఇండియా ఇండిపెండెంట్, బ్రిటిష్ రూల్ ఎండ్‌

తెలుగు మాసం ప్ర‌కారం
అధిక  శ్రావ‌ణం, గురువారం, కృష్ణ ప‌క్షం త్ర‌యోద‌శి ఘ‌డియ‌లు వెళ్లి, చ‌తుర్ద‌శి ప్ర‌వేశిస్తోంది. పున‌ర్వ‌సు న‌క్ష‌త్రం అయిపోయి పుష్య‌మి న‌క్ష‌త్రం ప్ర‌వేశించింది. ద‌క్షిణాయ‌నం, నిశిత ముహూర్తంలో నుంచి బ్రాహ్మీ ముహూర్తంలోకి ప్ర‌వేశిస్తున్న స‌మ‌యంలో, భార‌త‌దేశం స‌ర్వ‌స్వ‌తంత్ర దేశం అయింద‌నే ప్ర‌కట‌న వ‌చ్చింది.
- వైజ‌యంతి పురాణ‌పండ‌

No comments:

Post a Comment