Friday, August 14, 2020

 స్వాతంత్య్ర ద‌ర్శ‌నులు


1947, ఆగ‌స్టు 14 సాయంత్రం...
జ‌ర‌గ‌బోతున్న‌ది తెలిసినా... అంద‌రి మ‌న‌సుల్లోనూ ఒకటే ఉత్కంఠ‌..
వాయుదేవుడు సైతం గాలి బిగ‌ప‌ట్టి బిగించుకుని కూర్చున్నాడు.
నెమ్మ‌దిగా చీక‌టి ప‌డుతోంది..
అమావాస్య రాత్ర‌లు కావ‌టంతో చంద్రుడు క‌నిపించీ క‌నిపించ‌కుండా ఉన్నాడు.
భార‌తీయులంతా న‌రాలు తెగే ఉత్కంఠ‌తో నిరీక్షిస్తున్నారు.
వృద్ధుల నుంచి పిల్ల‌ల దాకా అంద‌రూ శిలాప్ర‌తిమ‌ల్లా కూర్చున్నారు ఇంటింటా..
ప‌ల్లెప‌ల్లెలు, వాడ‌వాడ‌లు, ప‌ట్ట‌ణాలు.. అంతా నిశ్శ‌బ్దం.
మూగ‌జీవాలు సైతం ప‌చ్చి గ‌డ్డి కూడా ముట్ట‌కుండా మౌనంగా చెవులు రిక్కించాయి..
పూల‌చెట్లు పూల‌ను విక‌సింపచేయాలా.. ముకుళించుకోవాలా అని మొగ్గ‌గానే ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుదామా అని ఎదురుచూస్తోంది భార‌త‌జాతి.
స‌మ‌యం రానే వ‌చ్చింది.
అర్ధ‌రాత్రి అందరూ నిద్రిస్తూ ఉంటార‌నుకున్నా‌రేమో ఆంగ్లేయులు.
స‌రిగ్గా ఆగ‌స్టు 14 రాత్రి 12.00 గంట‌ల స‌మ‌యం ఆగ‌స్టు 15లోకి ప్ర‌వేశిస్తున్న త‌రుణంలో ప్ర‌క‌టించింది బ్రిటిష్ ప్ర‌భుత్వం..
భార‌త‌దేశం విడిచి వెళ్లిపోతున్నాం అని.
అంత‌వ‌ర‌కు గుండుసూది ప‌డితే విన‌ప‌డేంత నిశ్శ‌బ్దంగా ఉంది వాతావ‌ర‌ణం.
ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణం పిల్ల‌లంతా త‌ప్ప‌ట్ల‌తో కేరింత‌లు కొట్టారు.
పెద్ద‌లంతా ఆనంద‌బాష్పాలు విడుస్తూ, ఒక‌రినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు.
స‌ముద్ర‌తీర వాసులు అర్ధ‌రాత్రే అక్క‌డ‌కు చేరి, ఆ రోజు సూర్యోద‌యం ఎంత కొత్త‌గా ఉంటుందో వీక్షించాల‌నుకున్నారు.
సూర్యుడు ఇలా పైకి వ‌స్తున్నాడో లేదు, అంద‌రూ సంతోషంతో ఆయ‌న‌కు న‌మ‌స్క‌రించి, ప‌రిప‌రివిధాల ప్ర‌స్తుతించారు.
ఇంత‌కాలం జ‌రిగిన అన్ని న్యాయాన్యాయాల‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన ఆదిత్యుడు ప్ర‌కాశ‌వంతంగా ఉద‌యించాడు.
స్త్రీలంతా గాంధీగారి ప‌టానికి హార‌తులిచ్చి పాలాభిషేకం చేశారు.
వీధి వాకిళ్ల‌ను రంగ‌వ‌ల్లుల‌తో అలంక‌రించారు. గుమ్మాల‌కు మామిడి తోర‌ణాలు క‌ట్టారు.
త‌లంటు పోసుకుని. నూత‌న వ‌స్త్రాలు ధ‌రించారు.
పిండి వంట‌లు త‌యారుచేసి, ఇరుగుపొరుగుల‌కు అందించుకున్నారు.
స్వ‌చ్ఛ‌మైన‌, క‌ల్మ‌షం లేని మ‌న‌సుల‌తో అంద‌రూ స‌మావేశ‌మై, స్వాతంత్ర్యం కోసం జైళ్ల‌కు వెళ్లి, న‌ర‌క బాధ‌లు అనుభ‌వించిన‌వారి గురించి త‌ల‌చుకుంటూ, కంట త‌డి పెట్టారు. వారి త్యాగ‌ఫ‌ల‌మే క‌దా, ఈ నాటి మ‌న స్వేచ్ఛ‌కు కార‌ణం అనుకుంటూ దేశ‌నాయ‌కుల‌ను స్మ‌రించుకుని, వారికి పూజ‌లు జ‌రిపారు.
ఈ సంఘ‌ట‌న జ‌రిగి నేటికి 73 సంవ‌త్స‌రాలు గ‌డిచి, 74 వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశించాం.
ఇప్ప‌టికీ ఆ జ్ఞాప‌కాల త‌డి గుండెను ఆర్త్రం చేస్తుంది అంటున్నారు .. 95 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఉన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి, వ‌యొలిన్ విద్వాంసుడు అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి.
నాటి స్వాతంత్ర్య వేడుక‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించిన‌వారు వీరు. నాటి విష‌యాల‌ను నేటికీ ఇంకా మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నాయి అంటున్న వీరితో సాక్షి సంభాషించింది. ఆ వివ‌రాలు..
----------

అన్న‌వ‌రపు రామ‌స్వామి (95), ప్ర‌ముఖ వ‌యొలిన్ విద్వాంసుడు, విజ‌య‌వాడ నుంచి...
1947, ఆగ‌స్టు 15, చాలా విశేష‌మైన రోజు. భార‌త‌జాతి దాస్య శృంఖలాలు తెంచుకున్న రోజు. ఎంతోమంది ప్రాణ‌త్యాగం చేయ‌టం వ‌ల్ల మ‌న‌కు ఈ సంతోష‌క‌ర‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చిన‌రోజు. మాకు పెద్ద పండుగ‌. ఈ పండుగ‌కు ప్ర‌ధాన కార‌కులు గాంధీగారేన‌ని అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చేనాటికి నా వ‌య‌సు 22 సంవ‌త్స‌రాలు. ఆ రోజున ఇంటింటా ఎవ‌రికి తోచిన వేడుక‌లు వారు చేసుకున్నారు. అప్ప‌ట్లో మీడియా ఇంత ఎక్కువ‌గా లేదు. అందువ‌ల్ల ఎక్క‌డి విష‌యాలు అక్క‌డే ఉండిపోయేవి. అంద‌రూ ఒకేచోట చేరే అవ‌కాశ‌మే లేదు.
ఆ రోజు గుంటూరులో మ‌హావిద్వాంసులైన మ‌హాద్రి వెంక‌ట‌ప్ప‌య్య‌శాస్త్ర్రి గారి క‌చేరీ ఏర్పాటు చేశారు. మేం అప్ప‌టికి పారుప‌ల్లి రామ‌కృష్న‌య్య పంతులుగారి ద‌గ్గ‌ర గురుకుల విద్యాభ్యాసం చేస్తున్నాం. మేమంతా ఆ క‌చేరీకి హాజ‌ర‌య్యాం. ఆ రోజు అక్క‌డకు వ‌చ్చిన‌వారిలో .. ఎవ‌రి ముఖాల‌లో చూసినా ఆనంద‌మే వెల్లివిరిసింది. అంద‌రూ వారి వారి ఇళ్ల‌లో జెండాలు ఎగ‌రేసుకున్నారు. ఆ రోజుల్లో దుకాణాలు బాగా దూరంగా ఉండ‌టం వ‌ల్ల ఏమైనా కొనుక్కుందామ‌న్నా కుదిరేది కాదు. షాపులు కూడా ఎక్కువ‌గా ఉండేవి కాదు.
అప్ప‌ట్లో విజ‌య‌వాడ‌లో ఆకాశ‌వాణి కేంద్రం ఇంకా రాలేదు. మీడియా ఇంత ఎక్కువ‌గా లేక ఏ స‌మాచార‌మూ బ‌య‌ట‌కు రాలేదు. మ‌ద్రాసు నుంచి ఆంధ్ర‌ప‌త్రిక మాత్ర‌మే వ‌చ్చేది. ఆ పత్రిక వ‌చ్చిన త‌ర‌వాతే స‌మాచారం తెలిసేది. అవి అతి విలువైన రోజులు. ప్ర‌తి విష‌యానికీ విలువ ఇచ్చేవారు. అప్ప‌టి మాటల్లో ఒక జీవం, ప‌విత్ర‌త ఉండేవి. ప్ర‌తి వారి మాట‌కు విలువ ఉండేది. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టే ఉండేది. వారే మ‌న దేశానికి స్వాతంత్ర్యం తీసుకువ‌చ్చారు.
జాన‌ప‌ద క‌ళాకారులు..

ఒక పేట‌లో ఉన్న‌వారంతా ఒక‌చోట చేరి సంబ‌రంగా వేడుక‌లు చేసుకున్నారు. బుడ‌బుక్క‌ల వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఇల్లిల్లూ తిరుగుతూ స్వాతంత్ర్యం గురించి అందంగా మాట‌లు చెప్పారు. పిల్ల‌లంతా ఒక చోట చేరి ప‌ద్యాలు, పాట‌లు పాడారు. ప‌నిపాట‌లు చేసుకునేవారంతా ఒక మాస్టారుని నియోగించుకుని, ముందురోజు రాత్రి సాధ‌న చేసి, స్వాతంత్ర్యం వ‌చ్చింద‌ని ప్ర‌క‌ట‌న తెలిసిన వెంట‌నే డ‌ప్పులు వాయించారు. నాట‌కాలు వేశారు. వారిలో నిష్క‌ల్మ‌ష‌మైన గౌర‌వం, ప్రేమ ఉండేవి. ఎవ‌రికి వారే హ‌మ్మ‌య్య స్వ‌తంత్ర్యం వ‌చ్చింది అంటూ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటా గాంధీగారి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేశారు. క‌వులంతా క‌విత్వం రాసి, గేయంలా పాడారు. మాకొద్దీ తెల్ల‌దొర‌త‌న‌ము పాట‌ను అందరూ బృందాలుగా గానం చేశారు. ఆ నాటి వారి గురించి నేను చెప్పేది ఒక్క‌టే మాట‌, స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సుతో పండుగ‌లా జ‌రుపుకున్నారు. వీధివీధిలో బ్యాన‌ర్లు, జెండాలు క‌ట్టారు. క‌ల్మ‌షం లేని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు... అంటూ నాటి సంఘ‌ట‌న‌లు గుర్తు ఉన్నంత‌వ‌ర‌కు వివ‌రించారు.

అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి ప‌రిచ‌యం
తొమ్మిదిన్న‌ర ద‌శాబ్దాల వ‌య‌సు ఉన్న అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి విజ‌య‌వాడ‌లో నివ‌సిస్తున్నారు. ఆకాశ‌వాణి విజ‌య‌వాడ‌ కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి అంటే 1948, డిసెంబ‌రు 1వ తేదీ నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ప‌నిచేశారు. ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు పారుప‌ల్లి రామ‌కృష్ణ‌య్య పంతులుగారి ద‌గ్గ‌ర గురుకుల వాసం చేసి సంగీతం అభ్య‌సించారు. నేటికీ సంగీత కార్య‌క్ర‌మం అంటే ఎంతో ఉత్సాహంగా ముందుకు వ‌స్తారు. గంట‌సేపు క‌చేరీ కూడా చేస్తున్నారు.
-------------------------------


శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి (95) ర‌చ‌యిత్రి (ప్ర‌ముఖ ర‌చ‌యిత బుచ్చిబాబు స‌తీమ‌ణి) బెంగ‌ళూరు నుంచి
మ‌న ఇళ్ల‌లో ద‌స‌రా దీపావ‌ళి పండుగ‌లు జ‌రుపుకున్న‌ట్లుగా ఈ పండుగ జ‌రుపుకున్నాం. బుచ్చిబాబుగారికి ఇలా చేయ‌టం చాలా ఇష్టం. మా ఇంటిల్లిపాదీ ఉదయాన్నే త‌లంట్లు పోసుకుని, కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకున్నాం. గుమ్మానికి మామిడి తోర‌ణాలు క‌ట్టాం. గ‌డ‌ప‌ల‌కుప‌సుపు రాసి, కుంకుమ పెట్టాం. ఇల్లంతా క‌ళ‌క‌ళ‌లాడింది. రోజూఉండే ఇల్లే అయినా, ఆ రోజు ఎంతో కొత్త‌గా అనిపించింది. అప్ప‌డు నాకు 22 సంవ‌త్స‌రాల వ‌య‌సు. ర‌క‌ర‌కాల మిఠాయిలు త‌యారుచేశాం. ఇంటికి వ‌చ్చిన‌వారంద‌రికీ నిండుగా భోజ‌నం పెట్టాం. అప్ప‌డు మేం హైద‌రాబాద్‌లో ఉంటున్నాం. జెండా ఎగుర‌వేయ‌టానికి హైద‌రాబాద్ ఆకాశ‌వాణి కార్యాల‌యానికి వెళ్లాం. అప్ప‌టికి ఇంకా డెక్క‌న్ రెడియోగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆ రోజు నేను ఎరుపు అంచు ఉన్న నీలం రంగు ప‌ట్టు చీర కట్టుకున్నాను. ఆ చీరంటే నాకు చాలా ఇష్టం. బుచ్చిబాబుగారు ఖ‌ద్ద‌రు పైజ‌మా, లాల్చీ క‌ట్టుకున్నారు. పైన వేసుకోవ‌టానికి ముందుగానే జోథ్‌పూర్ కోటు కుట్టించుకున్నారు. ఆ రోజు మ‌ద్రాసు నుంచి సినీన‌టులు పుష్ప‌వ‌ల్లి, భానుమ‌తి గార‌లు వ‌చ్చారు. జైలు  నుంచి విడుద‌లైన వారిలో కొంద‌రు ఆకాశ‌వాణి ద్వారా ప్ర‌త్య‌క్షంగా త‌మ అనుభ‌వాలు పంచుకున్నారు.
ఎస్‌. ఎన్‌. మూర్తిగారు స్టేష‌న్ డైరెక్ట‌ర్‌. ఉమామ‌హేశ్వ‌ర‌రావు అనే అనౌన్స‌ర్ ,... భార‌త దేశం నేటి నుంచి స్వ‌తంత్ర దేశం... అని వార్త‌లు చ‌దివారు. ఆ రోజు ఎవ‌రో నాయ‌కుడి వ‌చ్చి జెండా ఎగుర‌వేశారు. పేరు గుర్తు లేదు. ప్ర‌కాశం గార‌ని గుర్తు. ఆయ‌న‌తో పాటు చాలా మందే వ‌చ్చారు. వింజ‌మూరి సీతఅన‌సూయ‌లు, టంగులూరి సూర్య‌కుమారి దేశ‌భ‌క్తి గీతాలు ఆల‌పించారు. క‌వి స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు. రేడియో అన్న‌య్య‌గారైన న్యాయ‌ప‌తి రాఘ‌వ‌రావుగారు పిల్ల‌లో నాట‌కాలు వేయించారు. ఆడ‌వారి చేత ర‌క‌ర‌కాల వంట‌లు చేయించారు. ఆ రోజు ఎక్క‌డ చూసినా, మా ఇంట్లో వాళ్లు ఇన్ని రోజులు జైలుకి వెళ్లొచ్చారు.. ఇంత శిక్ష ప‌డింది... అంటూ అదొక వేడుక‌గా, క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకున్నారు. పిల్ల‌లంతా ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. ఎల్ బి స్టేడియాన్ని అందంగా అలంక‌రించారు. జెండాలు ఎగుర‌వేశారు. అంద‌రికీ ఫ‌ల‌హారాలు అందించారు.

దువ్వూరి సుబ్బ‌మ్మ‌గారు ఉప‌న్యాసాలు ఇచ్చారు. బుచ్చిబాబుగారి బామ్మ‌గారు శివ‌రాజు సుబ్బ‌మ్మ‌గారు ఆరు నెల‌ల‌పాటు జైలులో ఉన్నారు. అక్క‌డ జైలులో ఆవిడ‌కు మ‌డి సాగేది కాదు. విష‌యం తెలుసుకున్న ఆ గ్రామ‌స్థులు, ఆవిడ‌కు మ‌డిగా వంట చేసి తెచ్చి ఇచ్చేవారు. ఆ విష‌యాల‌న్నీ ఆ రోజు మేం ముచ్చ‌టించుకున్నాం. ఆవిడ‌లాగే ఎంతోమంది పిల్ల‌లు, కుటుంబాల‌ను వ‌దులుకుని ఉద్య‌మంలో పాల్గొని జైలుపాల‌య్యారు. వారు అటు వెళ్లిన‌ప్పుడు వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎలా గ‌డిచిందో ఆ భ‌గ‌వంతునికే తెలియాలి. ఉద్య‌మంలో పాల్గొన్న వారి కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేయ‌టానికి పార్టీ వారికి డ‌బ్బు ఉండేవి కాదు. జైళ్ల నుండి విడుద‌లైన‌వారంతా ఇళ్ల‌కు న‌డిచి వెళ్ల‌వ‌ల‌సి వ‌చ్చేది. వారు జైలులో ఉండ‌గా చేసిన ప‌నుల‌కు ఇచ్చిన డ‌బ్బులు ప్ర‌యాణం ఖ‌ర్చుల‌కు స‌రిపోయేవి కాదు. అందునా అప్ప‌ట్లో ఇంత‌గా బ‌స్సు సౌక‌ర్యాలు కూడా లేవు క‌దా. పాపం వారంతా ఎన్నో క‌ష్టాలు ప‌డి కాలి న‌డ‌క‌నే ఇల్లు చేరారు. ఇన్నాళ్లు ప‌డిన శ్ర‌మ‌కు ఫ‌లితం ల‌భించంద‌నే ఆనంద‌మే వారి ముఖాలలో క‌నిపించింది.


మ‌ధుర‌క్ష‌ణాలు
ఒక‌సారి గాంధీగారు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు, స‌త్య‌నారాయ‌ణ అనే ఆయ‌న వేసిన పెయింటింగ్ గాంధీగారికి నాతో ఇప్పించారు. గాంధీగారు స్టేజీ మీద నుంచి కింద‌కు దిగ‌టానికి, నా భుజాల మీద చేయి వేసుకున్నారు. చాలాకాలం ఆ భుజాన్ని ఎంతో ప‌విత్రంగా త‌డుముకునేదాన్ని. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌రోజు నాకు ఆ సంఘ‌ట‌న ఒక్క‌సారి మ‌నసులో స్ఫురించింది. అలాగే ప్ర‌కాశం పంతులుగారు మా ఇంటికి వ‌స్తుండేవారు. మా వారిని, ఏరా బుచ్చీ! అంటూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు.
-------


శివ‌రాజు సుబ్బ‌లక్ష్మి ప‌రిచ‌యం
శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత్రి. బుచ్చిబాబు స‌తీమ‌ణి. తొమ్మిదిన్న‌ర ద‌శాబ్దాల వ‌య‌సులో కూడా నాటి జ్ఞాప‌కాలు ఇంకా ప‌చ్చిగానే ఉన్నాయంటున్నారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నివ‌సిస్తున్నారు. స్వాతంత్ర్య వేడుక‌ల‌నే కాదు, గాంధీ, నెహ్రూ , ప‌టేల్‌, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, టంగుటూరి ప్ర‌కాశం పంతులు వంటి ఎంద‌రో నాయ‌కుల‌ను స్వ‌యంగా ద‌గ్గ‌ర‌గా చూశారు.


ప‌త్రిక‌ల‌లో శీర్షిక‌లు..
ప్రాగ్దిశాన వినూత్న తార ఉద‌యిస్తున్న‌ద‌ని నెహ్రూ ప్ర‌బోధ‌...
భార‌త దేశ స్వాతంత్ర్య సిద్ధి
ఆసియా ఖండానికే కాక స‌క‌ల ప్ర‌పంచానికీ మ‌హోత్కృష్ట స‌మ‌యం
ఇండియా ఇండిపెండెంట్, బ్రిటిష్ రూల్ ఎండ్‌

తెలుగు మాసం ప్ర‌కారం
అధిక  శ్రావ‌ణం, గురువారం, కృష్ణ ప‌క్షం త్ర‌యోద‌శి ఘ‌డియ‌లు వెళ్లి, చ‌తుర్ద‌శి ప్ర‌వేశిస్తోంది. పున‌ర్వ‌సు న‌క్ష‌త్రం అయిపోయి పుష్య‌మి న‌క్ష‌త్రం ప్ర‌వేశించింది. ద‌క్షిణాయ‌నం, నిశిత ముహూర్తంలో నుంచి బ్రాహ్మీ ముహూర్తంలోకి ప్ర‌వేశిస్తున్న స‌మ‌యంలో, భార‌త‌దేశం స‌ర్వ‌స్వ‌తంత్ర దేశం అయింద‌నే ప్ర‌కట‌న వ‌చ్చింది.
- వైజ‌యంతి పురాణ‌పండ‌

Wednesday, July 8, 2020

Bangalore Trip

సుమారు ప‌ది సంవ‌త్స‌రాల క్రితం బెంగ‌ళూరు ట్రిప్ వెళ్లాం.
బెంగ‌ళూరు, మైసూరు, శ్రావ‌ణ బెళ‌గోళా, బేలూరు, హ‌లీబీడు...
ఈ ప్రాంతాలు చూడాల‌నుకున్నాం.
మా అబ్బాయి, నేను, మా వారు ముగ్గురం క‌లిసి హైదరాబాద్ నుంచి బెంగ‌ళూరు వ‌ర‌కు రైలు ప్ర‌యాణం చేశాం.
అక్క‌డ మిగ‌తా ప్ర‌దేశాలు చూడ‌టానికి ఒక కారు మాట్లాడుకున్నాం. స‌రిగ్గా వాన‌లు మొద‌ల‌య్యాయి.
మా అదృష్టం ఏమో కానీ, ప్ర‌దేశాల‌న్నీ చూస్తున్నంత‌సేపు వ‌రుణ దేవుడు మా మీద క‌రుణా క‌టాక్ష జ‌ల్లులు కురిపించాడు. కారులో అడుగు పెట్ట‌గానే వ‌ర్షించాడు.
ఎలాగైతేనేం ప్ర‌యాణం మాత్రం చాలా ఆహ్లాదంగా, ఆనందంగా జ‌రిగింది.
బెంగ‌ళూరు లోని బృందావ‌న్ గార్డెన్ కూడా చూశాం.
మా అదృష్టం కొద్దీ మంచి కారు డ్రైవ‌రు దొరికాడు.
అక్క‌డే ఉన్న మా బాల్య మిత్రురాలి ఇంటికి, మా మేన‌మామ ఇంటికి కూడా వెళ్లాం.
అప్పుడ‌ప్పుడు ఇటువంటి ప్ర‌యాణాలు చేస్తుండాలి అనిపించింది.
ఇప్పుడు ఎక్క‌డ‌కూ వెళ్లే ప‌రిస్థితి లేదు.
అందుకే ఒక‌సారి పాత జ్ఞాప‌కాల‌నైనా నెమ‌రేసుకుందామ‌నిపించింది.
మ‌నుషులు ద‌గ్గ‌ర‌వ్వ‌టానికి ఇటువంటి ప్ర‌యాణాలు చాలా అవ‌స‌ర‌మ‌నిపించింది.
శ్రావ‌ణ బెళ‌గోళా పైకి ఎక్కేట‌ప్పుడు బాగానే ఎక్కేశాను.
కాని కింద‌కు దిగేట‌ప్పుడు క‌ళ్లు తిరిగాయి.
అందుకే ముంద‌ర మా శ్రీ‌వారిని న‌డ‌వ‌మ‌ని, వెన‌కాలే నేను త‌న భుజం మీద చేయి వేసుకుని దిగాను. ఆ మాత్రం భ‌రోసా ఇచ్చే మ‌న మ‌నిషి ఉంటే ఆ హాయి వేరు. ఆ భ‌రోసా వేరు. ఆ తృప్తి వేరు.
ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర‌వాత ఆ ఫొటోలు చూస్తుంటే...
భ‌గ‌వంతుడు ఒక‌రికి ఒక‌రు తోడునీడ‌గా ఉండ‌టానికే వివాహ వ్య‌వ‌స్థ ఏర్పాటుచేశాడ‌నిపించింది.
నాన్న‌గారు (ఉష‌శ్రీ‌గారు_ త‌న పెళ్లాడే బొమ్మా! పుస్తకంలో
జీవితంలో సాహ‌చ‌ర్యం కోసం పెళ్లి అని రాశారు.
అది నిజ‌మని అనుభ‌వంలోనే అర్థం అయ్యింది.
ఈ రోజు ఈ ఫొటోలు చూడ‌గానే ఇది రాయాల‌నిపించింది.
ఇది మొత్తం నా సొంత అభిప్రాయం మాత్ర‌మే.



















Friday, July 3, 2020

ఎంత కోపం వ‌చ్చినా మౌన‌మే...


గ‌వ‌ర్న‌రు గారి స‌తీమ‌ణితో సంభాషించ‌టానికి చెన్నైలోని రాజ‌భ‌వ‌న్‌కు వెళ్లి, గ‌వ‌ర్న‌ర్ చాంబ‌ర్‌లోకి అడుగు పెట్ట‌గానే, ఆయ‌న ఎంతో ఆప్యాయంగా లోప‌లికి ఆహ్వానించారు. చెక్కుచెద‌ర‌ని చిరున‌వ్వుతో, మ‌డ‌త న‌ల‌గ‌ని తెల్ల‌టి పంచెతో, ఏదో దీర్ఘాలోచ‌న‌లో ఉన్న భంగిమ‌లో ఠీవిగా కూర్చున్నారు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ అయిన మ‌న తెలుగు తేజం గౌర‌వ‌నీయులు కొణిజేటి రోశ‌య్య‌. 
వారి స‌తీమ‌ణితో ముచ్చ‌టించ‌టానికి వ‌చ్చామ‌ని చెప్ప‌గా ఆమెకు క‌బురు పంపారు. రెండే నిమిషాల్లో ఆవిడ రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఎంతో సామాన్యంగా, ఏ మాత్రం భేష‌జం లేకుండా, నిక్క‌చ్చిత‌నంతో ఉన్న వ‌ద‌నంతో రోశ‌య్య గారి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి శివ‌ల‌క్ష్మి వ‌చ్చారు. ఆమెను కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాన‌న‌గానే మౌనంగానే అంగీక‌రించారు మిత‌భాషి అయిన శివ‌ల‌క్ష్మి.


1. మీది చుట్ట‌రిక‌మా లేదా బ‌య‌టి సంబంధ‌మా..
జ‌. మాది దూర‌పు చుట్ట‌రికం. ఆయ‌న నాకు మామ‌య్య వ‌ర‌స అవుతారు.
2. మీ వైవాహిక జీవితం సుమారు 65 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది క‌దా! ఇన్ని సంవ‌త్స‌రాల‌లో మీ జీవితం ఎలా ఉంది?
జ‌. పెళ్లయిన కొత్త‌ల్లో మా అత్త‌గారు మాతోనే ఉండ‌టం వ‌ల్ల అన్నీ ఆవిడ‌తో సంప్ర‌దించి చేస్తుండేదాన్ని. అందువ‌ల్ల నాకు పెద్ద‌గా ఇబ్బంది అనేది ఏమీ తెలియ‌లేదు. త‌ర‌వాత పిల్ల‌లు పెద్ద‌వాళ్ల‌య్యారు. ఇక అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు.
3. ఆయ‌న పెద్ద రాజ‌కీయ సెల‌బ్రిటీ క‌దా! మ‌రి ఇంట్లో ఆయ‌న ఎలా ఉంటారు?
జ‌. ఆయ‌న ఇంట్లో ఉన్నంత‌సేపు రాజ‌కీయాల‌కు సంబంధ‌మే ఉండ‌దు. ఒక ఇంటి పెద్ద‌గా సాధార‌ణంగా ఉంటారు. బ‌య‌ట మాత్ర‌మే రాజ‌కీయాలు. అందువ‌ల్ల మాకు ఎప్పుడూ రాజ‌కీయ‌నాకుడి ఇంట్లో ఉంటున్నాం అనే భావనే క‌ల‌గ‌లేదు. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడితే ఆయ‌న ఇంటి మ‌నిషి. గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు అడుగుపెడితే ఆయ‌న రాజ‌కీయ‌నాయ‌కుడు. ఆ విధంగా ఆయ‌న బ్యాలెన్స్ చేస్తున్నారు.
4. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రుగా చెన్నైకి వ‌చ్చి ఐదు సంవ‌త్స‌రాలు కాబోతోంది. ఇక్క‌డ ఉగాది ఎలా ఉంది? ప‌ండుగ‌లు కోల్పోయామ‌న్న బాధ ఎప్పుడైనా క‌లిగిందా?
జ‌. ఇంత‌వ‌ర‌కూ ఎన్న‌డూ ఉగాది పండుగ మిస్ కాలేదు. పండ‌గ‌నాటికి పిల్ల‌లు రావ‌డ‌మో, మేము అక్క‌డు వెళ్తుండ‌ట‌మో ఏదో ఒక‌టి జ‌రుగుతుంటుంది. ఇక్క‌డ చెన్నైలో కూడా తెలుగువారు ఉన్నారు క‌నుక‌, వారి మ‌ధ్య కూడా పండుగ ఆనందంగా జ‌రుపుకుంటాం. ఇంత‌వ‌ర‌కూ పండుగ‌లు కోల్పోయామ‌న్న బాధ క‌ల‌గ‌లేదు.
5. ఆయ‌న‌కు ఇష్ట‌మైన వంట‌కాలు ఏంటి? మీరే స్వ‌యంగా వండి పెడ‌తారా?
జ‌. ఆయ‌న పూర్తిగా శాకాహారి. నాలుగు ప్ర‌దేశాల‌కూ తిరిగేవాళ్లు. అన్నిర‌కాల వంట‌కాల‌కూ అల‌వాటు ప‌డ‌తారు. అందువ‌ల్ల ఏ వంట ఎలా ఉన్నా ఏమీ మాట్లాడ‌రు. అదీకాక‌, ఏదో ఒక ఊర‌గాయ ప‌క్క‌న పెట్టుకుంటే స‌రిపోతుంది. ఏ వంట‌కం ఎలా ఉన్నా అన్నీ ఆ నంజులో క‌లిసిపోతాయి.
6. మీ వంట ఎప్పుడైనా న‌చ్చ‌లేదంటే మీకు ఎలా అనిపిస్తుంది. అలాగే మెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది.
జ‌. భోజ‌నం ఎలా పెట్టినా తినేస్తారు. క‌నుక మెచ్చుకోవ‌డాలు, నొచ్చుకోవ‌డాల‌నే ప్ర‌స‌క్తే లేదు.
7. దూర ప్రాంతాల‌కు వెళ్లి వ‌చ్చేట‌ప్పుడు మీ కోసం ప్ర‌త్యేకంగా ఏమైనా కొని తీసుకువ‌చ్చేవారా?
జ‌. (రోశ‌య్య‌గారు) పెళ్ల‌యిన కొత్త‌లో అంటే 1960 - 70 ప్రాంతంలో పిల్ల‌ల చంట‌ప్పుడు ఎప్పుడైనా వాళ్ల‌కు బొమ్మ‌లు తెచ్చేవాడిని. ఇక బ‌ట్ట‌ల విష‌యంలో... మా అమ్మ‌గారు ఉన్నంత‌కాలం ఆవిడే కొనేవారు. ఆవిడ గ‌తించాక మా పిల్ల‌లు పెద్ద‌వాళ్లు కావ‌డంతో వాళ్లే చూసుకుంటున్నారు.
శివ‌ల‌క్ష్మి: ముఖ్యంగా మా కోడ‌ల్లే నా బ‌ట్ట‌ల విష‌యం చూసుకుంటున్నారు. నాకు వెళ్లి తెచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఇంత‌వ‌ర‌కూ క‌ల‌గ‌లేదు. ఇక న‌గ‌ల విష‌యం అంటారా, మా నాన్న‌గారే చూసుకున్నారు.
8.రోశ‌య్య‌గారికి కోపం ఎక్కువ అంటారు. ఆ కోపాన్ని ఎప్పుడైనా రుచి చూశారా?
జ‌. ఆయ‌న‌కు ఎంత కోపం వ‌చ్చినా మౌనంగా ఉంటారు. ఎంత ప‌ల‌క‌రించినా ప‌ల‌క‌రు. ఏ ప్ర‌శ్న‌కూ స‌మాధానం చెప్ప‌రు. అంత‌కుమించి ఆయ‌న కోపాన్ని వేరేలా ఎన్న‌డూ ప్ర‌ద‌ర్శించ‌లేదు.
9. రాజ‌కీయాల్లో ఆయ‌న మీద నింద‌లు వేసిన‌ప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
జ‌. వాళ్ల మాట‌కు ఆయ‌న కూడా పొడిచిన‌ట్లే స‌మాధాన‌మిస్తారు. ఇంక మ‌నం ఆ విష‌యం గురించి ఆలోచించ‌డం ఎందుకు. ఆయ‌న‌కు ఏ ఇబ్బందీ రాద‌నే న‌మ్మ‌కం నాకుంది. అవ‌స‌ర‌మైతే గ‌ట్టిగా మాట్లాడ‌కుండా పోవ‌డ‌మే. ఆ నేర్ప‌రిత‌నం ఆయ‌న‌కు ఉన్నందున వేరే అనుకోవ‌డం ఎందుకు?
10.ఇన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాల్లో ఉండ‌టం వ‌ల్ల మీరు వ్య‌క్తిగ‌తంగా ఏమైనా కోల్పోయార‌నిపిస్తుందా?
జ‌. ఇన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాల్లో ఉన్నార‌నే భావ‌నే క‌ల‌గ‌దు నాకు. ఆయ‌న ఇంట్లో అడుగు పెట్టేస‌రికి అన్నీ మ‌ర్చిపోయేదాన్ని. ఆయ‌న ఒక బాధ్య‌త తీసుకున్నాక స‌రిగా నిర్వ‌హిస్తున్నారా లేదా అనే అనుకుంటాను.
11. ముఖ్యమంత్రిగా, మంత్రిగా... ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో ఏదైనా తేడా క‌నిపించిందా మీకు?
జ‌. ఎప్పుడూ నాకు ఏ తేడాలూ అనిపించ‌లేదు. నిరంత‌రం ఆయ‌న‌తో క‌లిసి ఉంటాను కనుక నాకు ఆయ‌న ఎప్పుడూ ఒకేలా అనిపిస్తారు.
12. గ‌వ‌ర్న‌ర్‌గా...
జ‌. గ‌వ‌ర్న‌ర్‌గా కంటె ఆర్థిక‌మంత్రిగా ఉన్న‌ప్పుడైతే ఎంతో ప‌ని, ఎన్నో లెక్క‌లు వేయాలి. అప్పుడే ఆయ‌న చేతి నిండా ప‌ని ఉన్న‌ట్లు అనిపిస్తుంది నాకు.
13. ఆయ‌న రాష్ట్ర బ‌డ్జెట్ 17 సార్లు వేసి రికార్డు సృష్టించారు. మీరు ఇంటి బ‌డ్జెట్ ఎలా ప్లాన్ చేస్తారు?
జ‌. నేను ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ అంటూ ఏమీ వేయ‌ను. ఇంట్లో మ‌నుషుల్ని బ‌ట్టి అర్థ‌మైపోతుంది. అందువ‌ల్ల బ‌డ్జెట్ వేయాల్సిన అవ‌స‌రం లేదు.
14. పిల్ల‌ల చ‌దువు విష‌యం..
జ‌. మేం తెనాలి ఉన్న‌ప్పుడే పెద్ద‌బ్బాయిది, పెద్ద‌మ్మాయిది చ‌దువులు అయిపోయాయి. ఇంక రెండ‌వ అబ్బాయి టైమ్‌కి ఆలోచించ‌క్క‌ర్లేకుండా అయిపోయింది. అలా మా పిల్ల‌ల చ‌దువుల గురించి నేనేమీ ప‌ట్టించుకోవ‌క్క‌ర్లేకుండా అయిపోయింది.
సొంత ఊరిలో..
సొంత ఊరిలో ఇల్లు ఉండాల‌న్న‌ది నా ఆకాంక్ష‌. వీలు దొరికిన‌ప్పుడు అక్క‌డికి వెళ్లి వ‌స్తుంటే తృప్తిగా ఉంటుంది. నేను ఏ ప‌ద‌విలో ఉన్నా, ఏ బాధ్య‌త‌లో ఉన్నా, అప్పుడ‌ప్పుడూ ఊరు వెళ్లి అక్క‌డ ఉండి వ‌స్తుంటాను.
- కొణిజేటి శివ‌ల‌క్ష్మి
----------------------------------

2015 మార్చిలో, అప్పుడు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రుగా ఉన్న సంద‌ర్భంలో రోశ‌య్య‌గారితో సాక్షి త‌ర‌ఫున ఒక ఇంట‌ర్వ్యూ తీసుకున్నాను.
ఈ రోజు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రోశ‌య్య గారి స‌తీమ‌ణి ఆ రోజున సంభాషించిన వివ‌రాలు ఇప్పుడు ఇలా అంద‌రికీ షేర్ చేస్తున్నాను.
- వైజ‌యంతి పురాణ‌పండ‌
---------------------------- 

Sunday, June 28, 2020

నాన్న అనే వృక్షానికి పల్లవించాను..


నిజాయితీగా ఉండటం తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నారు.
తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ తండ్రి నుంచి అలవర్చుకున్నారు.
తెలుగులో సివిల్స్‌ రాసే ధైర్యం తండ్రి నూరిపోసినదే.
అవమానాలను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం తండ్రి ద్వారానే సంక్రమించింది.  అనుకున్నది సాధించే పట్టుదల తండ్రి నుంచి వచ్చినదే. 
ఆ తండ్రి డా. ఆకురాతి కోదండరామయ్య.
ఆ కుమార్తె విజయవాడకు చెందిన ఆకురాతి పల్లవి ఐఏయస్‌
గాంధేయవాది...
‘చిన్నప్పుడు స్కూల్‌లో చదువుతుండే రోజుల్లో, లంచ్‌ టైమ్‌లో మామిడిచెట్ల కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. ఒకరోజు శారద అనే నా ఫ్రెండ్‌ బాక్సు తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదని అడిగితే, ‘‘నేను అలిగి, ‘బాక్సు వద్ద’న్నాను. ‘నువ్వు ఒక రోజు తినకపోతే అన్నం మిగులుతుంది’ అన్నారు మా వాళ్లు’’ అని నవ్వుతూ చెప్పింది. అంత పేదరికంలో ఉన్నారు వాళ్లు. అప్పుడు అనిపించింది పేద పిల్లలకు సహాయం చేయాలని. నా మనసులో మాట నాన్నతో పంచుకున్నాను. అందుకు ఐఏయస్‌ చదవాలన్నారు నాన్న. అప్పుడే నాలో పట్టుదల బయలుదేరింది.





నాన్నే నేర్పించారు...
నాకు చిన్నతనం నుంచి స్వాభిమానం ఎక్కువ. మాట పడలేను. అందుకే పద్నాలుగు పాఠశాలలు మారాను.  ఇక లాభం లేదని డిస్టెన్స్‌లోనే చదువు కొనసాగించాను. అది కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. గాంధీగారు మాతృభాషలో చదివించమని చెప్పిన మాటలు నాన్న పాటించారు. 
ఐఏయస్‌కి ప్రిపేర్‌ అయ్యేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కోచింగ్‌ సెంటర్ల వాళ్లు నన్ను అవమానించారు. నాలో పట్టుదల మరింత ఎక్కువైంది. తెలుగు మీడియంలో చదవటం వల్ల, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయటంలో నాన్న ఎంతగానో సహయపడ్డారు. కొన్ని చాప్టర్లు ఆయనే ట్రాన్స్‌లేట్‌ చేసి ఇచ్చారు. అలా ఆయన సహకారంతోనే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న ఆ కొద్దిపాటి ఇంగ్లీషు ఇప్పుడు నా ఆఫీసు విషయంలో ఎంతగానో ఉపయోగపడుతోంది. 
నాన్నే ఎగ్జామినర్‌...
ఐఏయస్‌ మోడల్‌ ఎగ్జామ్స్‌ నాన్నే ఇంట్లో కండక్ట్‌ చేశారు. పాత పేపర్లు, మోడల్‌ పేపర్లు చూసి, పరీక్షరాయించి దిద్దేవారు. నేను కూతుర్ని కాబట్టి నాకు ఎక్కువ మార్కులు వేస్తున్నారని నాన్నతో అనటంతో, నాన్నకు తెలిసిన లెక్చరర్లకు నా పేపర్లు పంపించి, దిద్దిస్తే, నాన్న వేసిన మార్కుల కంటె ఎక్కువ మార్కులు వచ్చేవి. అప్పుడు కాస్త నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాన్నగారు పెట్టిన పరీక్షలను కూడా నిజం పరీక్షల్లాగా చాలా సీరియస్‌గా రాసేదాన్ని. నేను ఆప్షనల్‌గా హిస్టరీ తీసుకోవటానికి కారణం కూడా నాన్నే. చరిత్ర నాన్నగారే చెప్పారు.






నాన్నే నా స్నేహితుడు..
నాన్న ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పి.హెచ్‌డి చేశారు. ఆయన మాకు ఒక స్నేహితుడిలా సలహాలిస్తారు. ఐఏయస్‌ ఇంగ్లీషు మీడియంలో రాద్దామని ప్రయత్నించి మానేశాను. తెలుగు మీడియంలోనే రాశాను. అందుకు నాన్న ఇచ్చిన ప్రోత్సాహం నేను మరచిపోలేను. సుప్రీంకోర్టు, హైకోర్టు విషయాలలో ఇంగ్లీషులోనే మేనేజ్‌ చేస్తున్నాను. ఎనిమిది సంవత్సరాల పాటు తెలుగును ఇంగ్లీషులోకి అనువదించి నేర్చుకోవటం వల్లే ఇప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ విషయంలో నేను నాన్న ఋణం తీర్చుకోలేను. నా మీద నాకు కాన్ఫిడెన్స్‌ ఎక్కువ. నేను ప్రిపేర్‌ అవుతున్న టైమ్‌లో, ఇంటి నుంచి రెండు సందుల అవతల రూమ్‌ తీసుకుని, ఐఏఎస్‌కి సెలక్ట్‌ అయ్యేవరకు ఒంటరిగా గదిలో ఉంటూ చువుకునే ధైర్యాన్ని నాన్నే నేర్పించారు. నిరంతరం పుస్తకాలు చదువుతూండేదాన్ని. నాన్న క్యారేజీ తెచ్చేవారు. ఆ సమయంలో,  పోతన, ధూర్జటి, శ్రీనాథుడు, శ్రీశ్రీ... వీరి పద్యాలు, కవితలు నాన్న తాదాత్మ్యంతో చదువుతూంటే... ‘ఇంతింతై వటుడింతై..’లాంటి పద్యాలు విని నేర్చుకున్నాను. అందువల్లే ఐఏయస్‌లో పద్యాలు పూర్తిగా రాసేశాను. నాన్నతో పోటాపోటీగా షటిల్‌ ఆడేదాన్ని. 
– ఆకురాతి పల్లవి, 
(సమగ్ర పిల్లల రక్షణ యోజన, బెంగళూరు, భారత ప్రభుత్వం)

 – సంభాషణ: వైజయంతి పురాణపండ

పాట మేధావి


బుడతడి ప్రజ్ఞ వెనుక నాన్న
జిబిగ్‌న్యూ (బుజ్జి) కి తెలుగు మాట్లాడటంరాదు..
తెలుగు చదవటం రాదు
తెలుగు పదాలకు అర్థం తెలియదు.
తెలుగు పాట మాత్రం ఉచ్చారణ దోషాలు లేకుండా భావయుక్తంగా పాడగలడు..
మొత్తం తొమ్మిది భాషల్లో ఈ బుడతడు ఇలా రాగయుక్తంగా పాడేస్తుంటాడు.
ఈ బుజ్జిగాడు నోట వచ్చిన ప్రతిపలుకుని నేర్చుకుంటూనే పాటలు పాడేస్తున్నాడు.
బుజ్జిగాడికి పాటలు నేర్పటం మొదలుపెట్టారు తండ్రి 
బుజ్జిగాడిలోని ప్రతిభను ఏ విధంగా గుర్తించారో సాక్షికి వివరించారు లండన్‌లో నివసిస్తున్న చరట్లూర్‌ శరత్‌చంద్రకాంత్‌.
––––––––––––––––––––


మేం హైదరాబాద్‌ వాస్తవ్యులం. దేశదేశాలు తిరుగుతూ, పోలాండ్‌లో ఒక కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉర్స్‌జులాను వివాహం చేసుకున్నాను. మాకు ఒక బాబు. జిబిగిన్యూ ఆచార్య అని పేరుపెట్టాం. బుజ్జి అని ముద్దుగా పిలుచుకుంటాం. బాబుకి రెండున్నరేళ్ల వయసున్నప్పుడు కార్లను గురించి చెబితే గుర్తు పెట్టుకుని, బయట ఏ కారు కనిపించినా ఆ బ్రాండ్‌ పేరు చెబుతుండేవాడు. ఆ తరవాత 202 ప్రపంచ దేశాల రాజధానులు నేర్పించాను. అడగ్గానే చెప్పేవాడు. వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాను. అలా జనరల్‌ నాలెడ్జితో మా బుజ్జి బాగా ఫేమస్‌ అయ్యాడు. 

ఆ రోజు...
ఐదేళ్ల వయసులో ఒక స్పానిష్‌ పాట పాడాడు. అప్పటికి వాడికి స్పానిష్‌ తెలియదు. వెంటనే ‘శుక్లాంబరధరం’ శ్లోకం నేర్పించాను. 20 నిమిషాలలో రాగయుక్తంగా పాడాడు. మన జాతీయ గీతం ‘జనగణమణ’ రెండు సార్లు నేర్చుకుని వెంటనే పాడేశాడు. ఇలా ఏ పాట నేర్పినా అరగంటలో ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం గమనించాను. ఒకసారి నా స్నేహితులు హైదరాబాద్‌ నుంచి లండన్‌ మా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి పాటలు విని, రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలా పిల్లవాడు ప్రపంచానికి పరిచితుడయ్యాడు. ఆ తరవాత యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి మా బుజ్జిగాడి పాటలు అప్‌లోడ్‌ చేయటం మొదలుపెట్టాను. పిల్లవాడి పాటలు చూసిన సినీ, సంగీత ప్రముఖులు పిల్లవాడిని ప్రశంసలతో ఆశీర్వదించారు. బాలు, కోటి, కమల్‌హాసన్, శంకర్‌మహదేవన్, చంద్రబోస్‌ వంటి పెద్దల ఆశీర్వాదం నాకు చాలా సంతోషం కలిగించింది. మా బుజ్జిగాడు సుమారు రెండు వందల తెలుగు పాటలు నేర్చుకున్నాడు.


ఇలా నేర్పిస్తాను...
పాట ముందుగా నేను నేర్చుకుని, ఆ తరవాత బుజ్జిగాడిని నేర్పుతాను. ఆ తరవాత ఒరిజినల్‌ సాంగ్‌ ప్లే చేసి వినిపిస్తాను. ‘పాట నేర్పుతాను’ అనగానే వెంటనే నేర్చుకుని, పాడేస్తాడు. పెయింటింగ్,. కీబోర్డు, వెంటిలాక్విజమ్‌ కూడా చేస్తున్నాడు. స్కూల్‌ ఎంట్రన్స్‌కి కూడా కూచోబెట్టి చదవమని చెప్పలేదు. వెస్ట్‌మినిస్టర్‌ స్కూల్‌లో 30 సీట్ల కోసం 90 వేల మంది పరీక్ష రాస్తే, అందులో సెలక్ట్‌ అయ్యాడు. ఇదే స్కూల్లో కంటిన్యూ  అయితే, ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వస్తుంది. బాబు ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు.  
చెన్నైలో ఉంటున్న ర‌మేశ్ రూపొందించిన సంగీత చ‌క్రం కూడా నిరీక్షిస్తున్నాడు. ఆ చ‌క్రం స‌హాయంతో ఒకేసారి భార‌తీయ‌, పాశ్చాత్య రాగాల‌ను సులువు నేర్చుకోవాల‌నే కుతూహలంతో ఉన్నాడు.


నా బాధ్యత...
ఎప్పుడు ఎక్కడ ఏది ప్రమోట్‌ చేయాలో, అది ఒక తండ్రిగా నేను చేస్తున్నాను. లవకుశ చిత్రంలోని రామసుగుణధామా... పాడుతుంటే కళ్లలో నీళ్లు వస్తాయి. ఈ పాటను రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు నేర్పించాను. ఇప్పుడు పాండురంగ మహాత్మ్యంలోని ‘జయకృష్ణా ముకుందా మురారీ’ పాట నేర్పుతున్నాను. పాటను ఇంగ్లీషులో రాసుకుని, నాలుగేసి లైన్ల చొప్పున నాలుగు సార్లు చెబితే పాడుతున్నాడు. ఆ నాలుగు లైన్లు పాడటం వచ్చాక, మరో నాలుగు లైన్లు నేర్పుతున్నాను. 
– చరట్లూర్‌ శరత్‌చంద్రకాంత్‌

ఆడుకుందాం! రండి!


అమ్మమ్మా! నాకు అప్పచ్చులు చేసి పెట్టవా!
బామ్మా! నాకు మామిడి తాండ్ర పెట్టవా!
తాతయ్యా! నాకో కథ చెప్పవా!
అత్తా! నన్ను గుడికి తీసుకువెళ్లవా!
బాబాయ్‌! నన్ను చెరువు దగ్గర ఉన్న పార్కుకి తీసుకెళ్లవా!
వేసవి కాలం వస్తే ఇటువంటి పిలుపులు బాగా వినిపించేవి.
ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే ఏవో కోర్సుల్లో చేరిపోతున్నారు పిల్లలు. ఒకవేళ ఇంట్లో ఉన్నా, వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్‌కి అతుక్కుపోతున్నారు.
––––––––––––––––

బాల్యంలో మధురక్షణాలుగా చెప్పుకోవలసినవి అమ్మమ్మ, నాయనమ్మలతో గడిపే క్షణాలు. ఆ మధురక్షణాలను వీడియోగా తీసి అప్‌లోడ్‌ చేశారు ఒక నాయనమ్మ. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను రాజ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పెట్టిన పది గంటలకే ఆ వీడియోను మూడు లక్షలకు పైగా చూశారు. తన మనవరాలు సంబరంగా చూస్తుంటే, ఆ నాయనమ్మ ఐదురాళ్లతో గచ్చకాయలను అవలీలగా నవ్వుతూ ఆడుతున్నారు. ఈ పోస్టుకి ‘పిల్లలు అమ్మమ్మనాయనమ్మలతో ఎందుకు కాలం గడపాలి’ అని క్యాప్షన్‌ పెట్టారు రాజ్‌. ఈ ట్వీట్‌ చూసినవారిలో ఒకరు, ‘నేను మా అమ్మమ్మతో చాలా బాగా ఆడుకున్నాను. ఈ వీడియో చూసి నా బాల్యం గుర్తు చేసుకున్నాను. నాకు ఆనందం కలిగించిన ఈ వీడియో షేర్‌ చేసినందుకు చాలా థాంక్స్‌’ ట్వీట్‌ చేశారు. ‘అమ్మమ్మనాయనమ్మలను జాగ్రత్తగా చూసుకోండి. వారు మనకు ప్రకృతి ప్రసాదించిన అందమైన బహుమతి, ఇటీవలే మా అమ్మమ్మ కాలం చేసింది’ అని మరొకరు చాలా బాధ్యతగా ట్వీట్‌ చేశారు. 





గతంలో...
సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు, పిల్లలకు ఏ సెలవులు వచ్చినా తాతయ్య ఇంటికి వెళ్లిపోయేవారు, అక్కడ అందరితో ఆడుకుంటూ, మధురజ్ఞాపకాలను పోగు చేసుకునేవారు. ముఖ్యంగా అమ్మమ్మ పెట్టిన మినపసున్నుండలు, నాయనమ్మ తినిపించిన గోరుముద్దలు, తాతయ్యలు చెప్పిన కథలు.. రెండు నెలలు రెండు క్షణాలుగా గడిచిపోయేవి పిల్లలకు. అసలు కంటె వడ్డీ ముద్దు అనే సామెత ఉండనే ఉంది. తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు మనవల రాక కోసం ఎదురుచూస్తుండేవారు. వారు వస్తున్న కబురు రాగానే, ఇంటి నిండా పిండి వంటలు సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలు ఆడుకుంటూ, మధ్యమధ్యలో వచ్చి, ‘అమ్మమ్మా! ఆకలి’ అనగానే ఒక సున్నుండ పెట్టేది అమ్మమ్మ. 
ఆటపాటలు...
కేవలం చిరుతిళ్లు మాత్రమే కాదు, పిల్లలతో ఎన్నో ఆటలు ఆడేవారు అమ్మమ్మలు. పిల్లల చేతులన్నీ ఒక చోట చేర్చి, ‘తారంగం తారంగం తాండవ కృష్ణా తారంగం, వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ, చింతగింజలు, గచ్చ కాయలు, పచ్చీస్, దూదుం పుల్ల... ఇలా ఎన్నో ఆటలు వారితో ఆడుతూ, వారికి విజ్ఞానం పంచేవారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, పోతన భాగవతంలో పద్యాలు, సుమతీ శతకం, వేమన శతకం... ఇలా అమ్మమ్మ, నాయనమ్మల ఇల్లు విజ్ఞాన భాండాగారంలా ఉండేది. 



ప్రస్తుతం...
చాలాకాలం తరవాత ఇప్పుడు ఒక బామ్మ తన మనవరాలిని పక్కన కూర్చోపెట్టుకుని, గచ్చకాయలలో రకరకాల ఆటలను ఆడుతుంటే, ఆ పసిపిల్ల కల్మషం లేకుండా స్వచ్ఛంగా కడుపునిండుగా, కడుపు పగిలేలా నవ్వుతోంది. ఆట ఆడుతూ బామ్మ చేస్తున్న శబ్దాలకు హాయిగా నవ్వుతోంది మనవరాలు.  అంత చిన్న మనవరాలికి గచ్చకాయలు ఆడటం రాదు. కాని ఆ బామ్మ మాత్రం చంటిపిల్లకు అర్థమయ్యేలా ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆడటంతో చాలా చక్కగా ఎంజాయ్‌ చేసింది. గచ్చకాయలతో మరిన్ని ఆటలు ఆడిన వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

ఈ చెయ్యి చాలు సేవ చేయటానికి...


శరీరంలో అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి కూడా సేవ చేయలేని వారు చాలామందే ఉంటారు. 
శరీరం సహకరించకపోయినా, మనసు సేవ చేయమని చెబుతుంటే, సేవ చేయకుండా ఉండగలరా.
కర్ణాటక ఉడిపిలో ఈ పది సంవత్సరాల చిన్నారి సింధూరి మనసుకు వైకల్యం లేదు. 
సింధూరి ఆరో తరగతి చదువుతోంది.
భగవంతుడు ఆమెకు ఒక్క చెయ్యి మాత్రమే ఇచ్చాడు. 
రెండు చేతులు లేని వారి కంటె నేనే చాలా నయం అనుకుంది.
ఒక్క చేత్తోనే మిషన్‌ మీద మాస్కులు కుట్టటం ప్రారంభించి, తోటి స్నేహితులందరికీ అందచేస్తోంది. ‘‘స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ లో మా స్కూల్‌ తరఫున లక్ష మాస్కులు కుట్టి, ఎస్‌ఎస్‌ఎల్‌సి వాళ్లకి అందచేయాలి. నేను 15 మాస్కులు కుట్టాను. మొదట్లో నేను, నా నిస్సహాయతకు బాధపడ్డాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పింది’’ అంటూ తనకు తల్లి ఇచ్చిన ధైర్యం గురించి ఎంతో ఆనందంగా చెబుతుంది సింధూరి. 
వీరు కట్టిన మాస్కులను 12 తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందచేశారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారికి మాస్కులు తప్పనిసరి. సింధూరి చాలా తెలివైన పిల్ల అని, శ్రద్ధగా చదువుకుంటుందని ఆ పాఠశాల టీచర్లు సింధూరిని మెచ్చుకుంటారు. సింధూరి మౌంట్‌ రోజరీ ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది. 
కరోనా మహమ్మారి కారణంగా యువతలో ఉన్న ప్రతిభ బయటకు వస్తోంది. వీరంతా చాలా విలక్షణంగా వారి వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కొందరు మాస్కులు కుట్టి ఉచితంగా అందచేస్తుంటే, మరి కొందరు వారు దాచుకున్న డబ్బుల్ని పేదలకు ఉపయోగిస్తున్నారు.
ఏప్రిల్‌ నెలలో, 17 సంవత్సరాల ఒక దివ్యాంగుడు తను బహుమతిగా గెలుచుకున్న రెండు లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేశాడు. ఢిల్లీకి చెందిన మరో విద్యార్థి 3డి ప్రింటర్‌తో ఫేస్‌ షీల్డ్‌ తయారుచేశాడు. పదో తరగతి చదువుతున్న జరేబ్‌ వర్ధన్‌.. 100 ఫేస్‌ షీల్డులు తయారుచేసి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ్‌కి అందచేశాడు. 
యువతరమే దేశానికి బలం అన్న మాటలను ఈ యువత చేతలలో చూపుతున్నారు. బాధ్యతతో మెలగుతున్న ఈ యువతకు సెల్యూట్‌ చేయాల్సిందే.

Saturday, June 27, 2020

సంగీత యోగం


సంగీతానికి తలలు ఊపని ప్రాణి సృష్టిలో లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పాముల వరకు సంగీత మాధుర్యంలో ఓలలాడతారని శాస్త్రం చెబుతోంది. పసిపాప భూమి మీద పడి కేర్‌కేర్‌మంటూ ఏడుపు ప్రారంభించగానే సంగీత జ్ఞానం లేని తల్లి సైతం ఏదో ఒక జోల పాట పాడటానికి ప్రయత్నిస్తుంది. సాక్షాత్తు అన్నమయ్యే ఆ భగవంతుడికి ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ అంటూ జోలపాడాడు. పాటకు అంత శక్తి ఉంది. ఉద్యమాలన్నీ పాటల మీద నడిచి, ఉద్యమాలను ముందుకు నడిపాయి. 
ఇక జానపదులు ప్రతి పనికీ ఒక పాట పాడుతూనే ఉంటారు. వడ్లు దంచుతూ ఏకంగా రామాయణాన్నే పాడారు నాటితరం వారు. అలా రామాయణం స్త్రీలపాటల రూపంలో వచ్చింది. బండి నడుపుతూ పాట, పంట కోతలు కోస్తూ పాట, నూర్పుళ్లు, తూర్పారపోయడం, ధాన్యం బస్తాల్లోకి ఎత్తి, గాదెల్లో నింపడం... పని ఏదైనా సరే.. పాడుకుంటూ అలసటను మరచిపోతారు. రజకులు వస్త్రాలను ఉతుకుతూ, ‘ఉష్‌..ఉష్‌’ అంటూ ఒక రాగాన్ని ఆలపిస్తారు. బరువులు ఎత్తేవారు ‘హైసా, హైసా’ అంటూ వారికి తోచినది పాడుతూ, బరువు ఎత్తటం వల్ల కలిగే అలసటను మరచిపోతారు. 
వివాహాలలో వియ్యపురాలిని ఆటపట్టిస్తూ, ‘వియ్యపురాలా ఓ వయ్యారి భామా నీ ఒయ్యారములేలనే’ అంటూ వేడుకగా పాడుకుంటారు. బావగారిని ఆటపట్టిస్తూ మరదలు, ‘ఓహోహో బావగారు ఎప్పుడొచ్చారు, ఈ చిల్లు చెంబులో నీళ్లున్నాయి కాళ్లు కడుక్కోండి’ అంటూ పాడుతుంది. ఏ పనిలోనైనా పాట ఒక ఆశ్వాసన ఇస్తుంది. 
శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. ప్రస్తుతం అందరం మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. సినిమా పాటలైతే ‘పాట చాలా మెలోడియస్‌గా ఉన్నాయి’ అంటాం. అవే మనసుకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగించే రాగాలు. ఒక పక్కన కరోనా మహమ్మారి గురించి అందరిలోనూ ఏదో తెలియని భయం బయలుదేరింది. అలజడితో ఉన్న మనసుకు సాంత్వన కావాలనిపిస్తు్తంది. ఇటువంటి సమయంలోనూ సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం.
సామ రాగం (సరిమపదస... సదపమగరిస)
ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళ నయనా’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. మనకు బాగా సరిచితమైన ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా శంకరాభరణంలోని సదాశివబ్రహ్మం రచించిన ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే. 
2. మలయమారుతం.. (సరిగపదనిస.. సనిదపగరిస)
ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనసుకు ఆహ్లాదం కలగించమని భగవంతుడిని కీర్తించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు.
3. మోహన రాగం (సరిగపదస.. సదపగరిస)
‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాటించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో స్వరాలను ఇముడ్చుకుని, మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్‌’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’.
4. హిందోళ (సగమదనిస.. సనిదమగస)
ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే.
5. వలజి (సగపదనిస.. సనిదపగస)
ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా/తనువు మనసు ఊగితూగి/ఒక మైకం కలిగేనులే/ఈ మహిమ నీదేనులే/ప్రేమ తీరు ఇంతేనులే.. ’, ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్‌ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాటలు ఈ రాగంలో స్వరపరిచినవే.
6. మధ్యమావతి (సరిమపనిస.. సనిపమరిస)
ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ, లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు.

మ‌న‌సుకి ప్ర‌శాంతంగా ఉంటుంది
 
కొన్ని రాగాలు మనసుకు ఉల్లాసం కలిగించడనికి కారణం స్వరస్థానాల మధ్య దూరం ఉండటమే. సంగీతం సప్తస్వర సమ్మిళితం. కాని ఈ రాగాలలో కేవలం ఐదు స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం కొన్ని స్వరస్థానాల కలయిక వల్ల ఆ మాధుర్యం వస్తుంది. ‘సరిగమపదని’ అనే స్థానాలలో రి అక్షరం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. గ రెండు రకాలుగా ఉంటుంది. అంటే స పక్కన మొదటి రి కాకుండా రెండో రి వస్తే అప్పుడు వాటి కలయిక కారణంగా పాటకు మాధుర్యం వస్తుంది. స పక్కన మొదటి రి, గ పక్కన మొదటి మ వస్తే అవి వీరోచిత రాగాలుగా వినిపిస్తాయి. దూరం ఉండాలి కాని, దూరంగా ఉండకూడదు. అటువంటివి ఈ రాగాలన్నీ. ఈ రాగాలు వింటే మానసిక ప్రశాంతత వస్తుంది. 
– మోదుమూడి సుధాకర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. 

-------------------------------------------------

మ‌నఃస్థితికి అనుగుణంగా రాగాలు..

మానసిక ఆరోగ్యం కోసం ఎక్కువ శక్తివంతంగా ఉండే రాగాలను వినిపిస్తాం. సంతోషం కోసం హంసధ్వ‌ని రాగాన్ని వినిపిస్తాం. కేదారగౌశ, ధీర శంకరాభరణం వంటి రాగాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అభోగి రాగం ప్రశాంతతను చేకూరుస్తుంది. అభేరి సంతోషాన్ని ఇస్తుంది. నేను రాగాల మీద పరిశోధన చేశాను. ఏ రాగం ఎటువంటి సమయంలో, ఏ విధంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా అవసరమైన వారికి మ్యూజిక్‌ థెరపీ చేస్తాను. 
– డాక్టర్‌ మీనాక్షి రవి, డైరెక్టర్, మీరా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీ, బెంగళూరు.
–––––––––––––––––––
– సంభాష‌ణ‌: వైజయంతి పురాణపండ