Sunday, June 28, 2020

నాన్న అనే వృక్షానికి పల్లవించాను..


నిజాయితీగా ఉండటం తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నారు.
తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ తండ్రి నుంచి అలవర్చుకున్నారు.
తెలుగులో సివిల్స్‌ రాసే ధైర్యం తండ్రి నూరిపోసినదే.
అవమానాలను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం తండ్రి ద్వారానే సంక్రమించింది.  అనుకున్నది సాధించే పట్టుదల తండ్రి నుంచి వచ్చినదే. 
ఆ తండ్రి డా. ఆకురాతి కోదండరామయ్య.
ఆ కుమార్తె విజయవాడకు చెందిన ఆకురాతి పల్లవి ఐఏయస్‌
గాంధేయవాది...
‘చిన్నప్పుడు స్కూల్‌లో చదువుతుండే రోజుల్లో, లంచ్‌ టైమ్‌లో మామిడిచెట్ల కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. ఒకరోజు శారద అనే నా ఫ్రెండ్‌ బాక్సు తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదని అడిగితే, ‘‘నేను అలిగి, ‘బాక్సు వద్ద’న్నాను. ‘నువ్వు ఒక రోజు తినకపోతే అన్నం మిగులుతుంది’ అన్నారు మా వాళ్లు’’ అని నవ్వుతూ చెప్పింది. అంత పేదరికంలో ఉన్నారు వాళ్లు. అప్పుడు అనిపించింది పేద పిల్లలకు సహాయం చేయాలని. నా మనసులో మాట నాన్నతో పంచుకున్నాను. అందుకు ఐఏయస్‌ చదవాలన్నారు నాన్న. అప్పుడే నాలో పట్టుదల బయలుదేరింది.





నాన్నే నేర్పించారు...
నాకు చిన్నతనం నుంచి స్వాభిమానం ఎక్కువ. మాట పడలేను. అందుకే పద్నాలుగు పాఠశాలలు మారాను.  ఇక లాభం లేదని డిస్టెన్స్‌లోనే చదువు కొనసాగించాను. అది కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. గాంధీగారు మాతృభాషలో చదివించమని చెప్పిన మాటలు నాన్న పాటించారు. 
ఐఏయస్‌కి ప్రిపేర్‌ అయ్యేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కోచింగ్‌ సెంటర్ల వాళ్లు నన్ను అవమానించారు. నాలో పట్టుదల మరింత ఎక్కువైంది. తెలుగు మీడియంలో చదవటం వల్ల, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయటంలో నాన్న ఎంతగానో సహయపడ్డారు. కొన్ని చాప్టర్లు ఆయనే ట్రాన్స్‌లేట్‌ చేసి ఇచ్చారు. అలా ఆయన సహకారంతోనే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న ఆ కొద్దిపాటి ఇంగ్లీషు ఇప్పుడు నా ఆఫీసు విషయంలో ఎంతగానో ఉపయోగపడుతోంది. 
నాన్నే ఎగ్జామినర్‌...
ఐఏయస్‌ మోడల్‌ ఎగ్జామ్స్‌ నాన్నే ఇంట్లో కండక్ట్‌ చేశారు. పాత పేపర్లు, మోడల్‌ పేపర్లు చూసి, పరీక్షరాయించి దిద్దేవారు. నేను కూతుర్ని కాబట్టి నాకు ఎక్కువ మార్కులు వేస్తున్నారని నాన్నతో అనటంతో, నాన్నకు తెలిసిన లెక్చరర్లకు నా పేపర్లు పంపించి, దిద్దిస్తే, నాన్న వేసిన మార్కుల కంటె ఎక్కువ మార్కులు వచ్చేవి. అప్పుడు కాస్త నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాన్నగారు పెట్టిన పరీక్షలను కూడా నిజం పరీక్షల్లాగా చాలా సీరియస్‌గా రాసేదాన్ని. నేను ఆప్షనల్‌గా హిస్టరీ తీసుకోవటానికి కారణం కూడా నాన్నే. చరిత్ర నాన్నగారే చెప్పారు.






నాన్నే నా స్నేహితుడు..
నాన్న ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పి.హెచ్‌డి చేశారు. ఆయన మాకు ఒక స్నేహితుడిలా సలహాలిస్తారు. ఐఏయస్‌ ఇంగ్లీషు మీడియంలో రాద్దామని ప్రయత్నించి మానేశాను. తెలుగు మీడియంలోనే రాశాను. అందుకు నాన్న ఇచ్చిన ప్రోత్సాహం నేను మరచిపోలేను. సుప్రీంకోర్టు, హైకోర్టు విషయాలలో ఇంగ్లీషులోనే మేనేజ్‌ చేస్తున్నాను. ఎనిమిది సంవత్సరాల పాటు తెలుగును ఇంగ్లీషులోకి అనువదించి నేర్చుకోవటం వల్లే ఇప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ విషయంలో నేను నాన్న ఋణం తీర్చుకోలేను. నా మీద నాకు కాన్ఫిడెన్స్‌ ఎక్కువ. నేను ప్రిపేర్‌ అవుతున్న టైమ్‌లో, ఇంటి నుంచి రెండు సందుల అవతల రూమ్‌ తీసుకుని, ఐఏఎస్‌కి సెలక్ట్‌ అయ్యేవరకు ఒంటరిగా గదిలో ఉంటూ చువుకునే ధైర్యాన్ని నాన్నే నేర్పించారు. నిరంతరం పుస్తకాలు చదువుతూండేదాన్ని. నాన్న క్యారేజీ తెచ్చేవారు. ఆ సమయంలో,  పోతన, ధూర్జటి, శ్రీనాథుడు, శ్రీశ్రీ... వీరి పద్యాలు, కవితలు నాన్న తాదాత్మ్యంతో చదువుతూంటే... ‘ఇంతింతై వటుడింతై..’లాంటి పద్యాలు విని నేర్చుకున్నాను. అందువల్లే ఐఏయస్‌లో పద్యాలు పూర్తిగా రాసేశాను. నాన్నతో పోటాపోటీగా షటిల్‌ ఆడేదాన్ని. 
– ఆకురాతి పల్లవి, 
(సమగ్ర పిల్లల రక్షణ యోజన, బెంగళూరు, భారత ప్రభుత్వం)

 – సంభాషణ: వైజయంతి పురాణపండ

పాట మేధావి


బుడతడి ప్రజ్ఞ వెనుక నాన్న
జిబిగ్‌న్యూ (బుజ్జి) కి తెలుగు మాట్లాడటంరాదు..
తెలుగు చదవటం రాదు
తెలుగు పదాలకు అర్థం తెలియదు.
తెలుగు పాట మాత్రం ఉచ్చారణ దోషాలు లేకుండా భావయుక్తంగా పాడగలడు..
మొత్తం తొమ్మిది భాషల్లో ఈ బుడతడు ఇలా రాగయుక్తంగా పాడేస్తుంటాడు.
ఈ బుజ్జిగాడు నోట వచ్చిన ప్రతిపలుకుని నేర్చుకుంటూనే పాటలు పాడేస్తున్నాడు.
బుజ్జిగాడికి పాటలు నేర్పటం మొదలుపెట్టారు తండ్రి 
బుజ్జిగాడిలోని ప్రతిభను ఏ విధంగా గుర్తించారో సాక్షికి వివరించారు లండన్‌లో నివసిస్తున్న చరట్లూర్‌ శరత్‌చంద్రకాంత్‌.
––––––––––––––––––––


మేం హైదరాబాద్‌ వాస్తవ్యులం. దేశదేశాలు తిరుగుతూ, పోలాండ్‌లో ఒక కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉర్స్‌జులాను వివాహం చేసుకున్నాను. మాకు ఒక బాబు. జిబిగిన్యూ ఆచార్య అని పేరుపెట్టాం. బుజ్జి అని ముద్దుగా పిలుచుకుంటాం. బాబుకి రెండున్నరేళ్ల వయసున్నప్పుడు కార్లను గురించి చెబితే గుర్తు పెట్టుకుని, బయట ఏ కారు కనిపించినా ఆ బ్రాండ్‌ పేరు చెబుతుండేవాడు. ఆ తరవాత 202 ప్రపంచ దేశాల రాజధానులు నేర్పించాను. అడగ్గానే చెప్పేవాడు. వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాను. అలా జనరల్‌ నాలెడ్జితో మా బుజ్జి బాగా ఫేమస్‌ అయ్యాడు. 

ఆ రోజు...
ఐదేళ్ల వయసులో ఒక స్పానిష్‌ పాట పాడాడు. అప్పటికి వాడికి స్పానిష్‌ తెలియదు. వెంటనే ‘శుక్లాంబరధరం’ శ్లోకం నేర్పించాను. 20 నిమిషాలలో రాగయుక్తంగా పాడాడు. మన జాతీయ గీతం ‘జనగణమణ’ రెండు సార్లు నేర్చుకుని వెంటనే పాడేశాడు. ఇలా ఏ పాట నేర్పినా అరగంటలో ఉచ్చారణ దోషాలు లేకుండా పాడటం గమనించాను. ఒకసారి నా స్నేహితులు హైదరాబాద్‌ నుంచి లండన్‌ మా ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయి పాటలు విని, రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అలా పిల్లవాడు ప్రపంచానికి పరిచితుడయ్యాడు. ఆ తరవాత యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి మా బుజ్జిగాడి పాటలు అప్‌లోడ్‌ చేయటం మొదలుపెట్టాను. పిల్లవాడి పాటలు చూసిన సినీ, సంగీత ప్రముఖులు పిల్లవాడిని ప్రశంసలతో ఆశీర్వదించారు. బాలు, కోటి, కమల్‌హాసన్, శంకర్‌మహదేవన్, చంద్రబోస్‌ వంటి పెద్దల ఆశీర్వాదం నాకు చాలా సంతోషం కలిగించింది. మా బుజ్జిగాడు సుమారు రెండు వందల తెలుగు పాటలు నేర్చుకున్నాడు.


ఇలా నేర్పిస్తాను...
పాట ముందుగా నేను నేర్చుకుని, ఆ తరవాత బుజ్జిగాడిని నేర్పుతాను. ఆ తరవాత ఒరిజినల్‌ సాంగ్‌ ప్లే చేసి వినిపిస్తాను. ‘పాట నేర్పుతాను’ అనగానే వెంటనే నేర్చుకుని, పాడేస్తాడు. పెయింటింగ్,. కీబోర్డు, వెంటిలాక్విజమ్‌ కూడా చేస్తున్నాడు. స్కూల్‌ ఎంట్రన్స్‌కి కూడా కూచోబెట్టి చదవమని చెప్పలేదు. వెస్ట్‌మినిస్టర్‌ స్కూల్‌లో 30 సీట్ల కోసం 90 వేల మంది పరీక్ష రాస్తే, అందులో సెలక్ట్‌ అయ్యాడు. ఇదే స్కూల్లో కంటిన్యూ  అయితే, ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వస్తుంది. బాబు ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు.  
చెన్నైలో ఉంటున్న ర‌మేశ్ రూపొందించిన సంగీత చ‌క్రం కూడా నిరీక్షిస్తున్నాడు. ఆ చ‌క్రం స‌హాయంతో ఒకేసారి భార‌తీయ‌, పాశ్చాత్య రాగాల‌ను సులువు నేర్చుకోవాల‌నే కుతూహలంతో ఉన్నాడు.


నా బాధ్యత...
ఎప్పుడు ఎక్కడ ఏది ప్రమోట్‌ చేయాలో, అది ఒక తండ్రిగా నేను చేస్తున్నాను. లవకుశ చిత్రంలోని రామసుగుణధామా... పాడుతుంటే కళ్లలో నీళ్లు వస్తాయి. ఈ పాటను రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు నేర్పించాను. ఇప్పుడు పాండురంగ మహాత్మ్యంలోని ‘జయకృష్ణా ముకుందా మురారీ’ పాట నేర్పుతున్నాను. పాటను ఇంగ్లీషులో రాసుకుని, నాలుగేసి లైన్ల చొప్పున నాలుగు సార్లు చెబితే పాడుతున్నాడు. ఆ నాలుగు లైన్లు పాడటం వచ్చాక, మరో నాలుగు లైన్లు నేర్పుతున్నాను. 
– చరట్లూర్‌ శరత్‌చంద్రకాంత్‌

ఆడుకుందాం! రండి!


అమ్మమ్మా! నాకు అప్పచ్చులు చేసి పెట్టవా!
బామ్మా! నాకు మామిడి తాండ్ర పెట్టవా!
తాతయ్యా! నాకో కథ చెప్పవా!
అత్తా! నన్ను గుడికి తీసుకువెళ్లవా!
బాబాయ్‌! నన్ను చెరువు దగ్గర ఉన్న పార్కుకి తీసుకెళ్లవా!
వేసవి కాలం వస్తే ఇటువంటి పిలుపులు బాగా వినిపించేవి.
ఇప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే ఏవో కోర్సుల్లో చేరిపోతున్నారు పిల్లలు. ఒకవేళ ఇంట్లో ఉన్నా, వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్‌కి అతుక్కుపోతున్నారు.
––––––––––––––––

బాల్యంలో మధురక్షణాలుగా చెప్పుకోవలసినవి అమ్మమ్మ, నాయనమ్మలతో గడిపే క్షణాలు. ఆ మధురక్షణాలను వీడియోగా తీసి అప్‌లోడ్‌ చేశారు ఒక నాయనమ్మ. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను రాజ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పెట్టిన పది గంటలకే ఆ వీడియోను మూడు లక్షలకు పైగా చూశారు. తన మనవరాలు సంబరంగా చూస్తుంటే, ఆ నాయనమ్మ ఐదురాళ్లతో గచ్చకాయలను అవలీలగా నవ్వుతూ ఆడుతున్నారు. ఈ పోస్టుకి ‘పిల్లలు అమ్మమ్మనాయనమ్మలతో ఎందుకు కాలం గడపాలి’ అని క్యాప్షన్‌ పెట్టారు రాజ్‌. ఈ ట్వీట్‌ చూసినవారిలో ఒకరు, ‘నేను మా అమ్మమ్మతో చాలా బాగా ఆడుకున్నాను. ఈ వీడియో చూసి నా బాల్యం గుర్తు చేసుకున్నాను. నాకు ఆనందం కలిగించిన ఈ వీడియో షేర్‌ చేసినందుకు చాలా థాంక్స్‌’ ట్వీట్‌ చేశారు. ‘అమ్మమ్మనాయనమ్మలను జాగ్రత్తగా చూసుకోండి. వారు మనకు ప్రకృతి ప్రసాదించిన అందమైన బహుమతి, ఇటీవలే మా అమ్మమ్మ కాలం చేసింది’ అని మరొకరు చాలా బాధ్యతగా ట్వీట్‌ చేశారు. 





గతంలో...
సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు, పిల్లలకు ఏ సెలవులు వచ్చినా తాతయ్య ఇంటికి వెళ్లిపోయేవారు, అక్కడ అందరితో ఆడుకుంటూ, మధురజ్ఞాపకాలను పోగు చేసుకునేవారు. ముఖ్యంగా అమ్మమ్మ పెట్టిన మినపసున్నుండలు, నాయనమ్మ తినిపించిన గోరుముద్దలు, తాతయ్యలు చెప్పిన కథలు.. రెండు నెలలు రెండు క్షణాలుగా గడిచిపోయేవి పిల్లలకు. అసలు కంటె వడ్డీ ముద్దు అనే సామెత ఉండనే ఉంది. తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు మనవల రాక కోసం ఎదురుచూస్తుండేవారు. వారు వస్తున్న కబురు రాగానే, ఇంటి నిండా పిండి వంటలు సిద్ధం చేసి ఉంచేవారు. పిల్లలు ఆడుకుంటూ, మధ్యమధ్యలో వచ్చి, ‘అమ్మమ్మా! ఆకలి’ అనగానే ఒక సున్నుండ పెట్టేది అమ్మమ్మ. 
ఆటపాటలు...
కేవలం చిరుతిళ్లు మాత్రమే కాదు, పిల్లలతో ఎన్నో ఆటలు ఆడేవారు అమ్మమ్మలు. పిల్లల చేతులన్నీ ఒక చోట చేర్చి, ‘తారంగం తారంగం తాండవ కృష్ణా తారంగం, వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ, చింతగింజలు, గచ్చ కాయలు, పచ్చీస్, దూదుం పుల్ల... ఇలా ఎన్నో ఆటలు వారితో ఆడుతూ, వారికి విజ్ఞానం పంచేవారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, పోతన భాగవతంలో పద్యాలు, సుమతీ శతకం, వేమన శతకం... ఇలా అమ్మమ్మ, నాయనమ్మల ఇల్లు విజ్ఞాన భాండాగారంలా ఉండేది. 



ప్రస్తుతం...
చాలాకాలం తరవాత ఇప్పుడు ఒక బామ్మ తన మనవరాలిని పక్కన కూర్చోపెట్టుకుని, గచ్చకాయలలో రకరకాల ఆటలను ఆడుతుంటే, ఆ పసిపిల్ల కల్మషం లేకుండా స్వచ్ఛంగా కడుపునిండుగా, కడుపు పగిలేలా నవ్వుతోంది. ఆట ఆడుతూ బామ్మ చేస్తున్న శబ్దాలకు హాయిగా నవ్వుతోంది మనవరాలు.  అంత చిన్న మనవరాలికి గచ్చకాయలు ఆడటం రాదు. కాని ఆ బామ్మ మాత్రం చంటిపిల్లకు అర్థమయ్యేలా ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఆడటంతో చాలా చక్కగా ఎంజాయ్‌ చేసింది. గచ్చకాయలతో మరిన్ని ఆటలు ఆడిన వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

ఈ చెయ్యి చాలు సేవ చేయటానికి...


శరీరంలో అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి కూడా సేవ చేయలేని వారు చాలామందే ఉంటారు. 
శరీరం సహకరించకపోయినా, మనసు సేవ చేయమని చెబుతుంటే, సేవ చేయకుండా ఉండగలరా.
కర్ణాటక ఉడిపిలో ఈ పది సంవత్సరాల చిన్నారి సింధూరి మనసుకు వైకల్యం లేదు. 
సింధూరి ఆరో తరగతి చదువుతోంది.
భగవంతుడు ఆమెకు ఒక్క చెయ్యి మాత్రమే ఇచ్చాడు. 
రెండు చేతులు లేని వారి కంటె నేనే చాలా నయం అనుకుంది.
ఒక్క చేత్తోనే మిషన్‌ మీద మాస్కులు కుట్టటం ప్రారంభించి, తోటి స్నేహితులందరికీ అందచేస్తోంది. ‘‘స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ లో మా స్కూల్‌ తరఫున లక్ష మాస్కులు కుట్టి, ఎస్‌ఎస్‌ఎల్‌సి వాళ్లకి అందచేయాలి. నేను 15 మాస్కులు కుట్టాను. మొదట్లో నేను, నా నిస్సహాయతకు బాధపడ్డాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పింది’’ అంటూ తనకు తల్లి ఇచ్చిన ధైర్యం గురించి ఎంతో ఆనందంగా చెబుతుంది సింధూరి. 
వీరు కట్టిన మాస్కులను 12 తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందచేశారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారికి మాస్కులు తప్పనిసరి. సింధూరి చాలా తెలివైన పిల్ల అని, శ్రద్ధగా చదువుకుంటుందని ఆ పాఠశాల టీచర్లు సింధూరిని మెచ్చుకుంటారు. సింధూరి మౌంట్‌ రోజరీ ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది. 
కరోనా మహమ్మారి కారణంగా యువతలో ఉన్న ప్రతిభ బయటకు వస్తోంది. వీరంతా చాలా విలక్షణంగా వారి వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కొందరు మాస్కులు కుట్టి ఉచితంగా అందచేస్తుంటే, మరి కొందరు వారు దాచుకున్న డబ్బుల్ని పేదలకు ఉపయోగిస్తున్నారు.
ఏప్రిల్‌ నెలలో, 17 సంవత్సరాల ఒక దివ్యాంగుడు తను బహుమతిగా గెలుచుకున్న రెండు లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేశాడు. ఢిల్లీకి చెందిన మరో విద్యార్థి 3డి ప్రింటర్‌తో ఫేస్‌ షీల్డ్‌ తయారుచేశాడు. పదో తరగతి చదువుతున్న జరేబ్‌ వర్ధన్‌.. 100 ఫేస్‌ షీల్డులు తయారుచేసి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ్‌కి అందచేశాడు. 
యువతరమే దేశానికి బలం అన్న మాటలను ఈ యువత చేతలలో చూపుతున్నారు. బాధ్యతతో మెలగుతున్న ఈ యువతకు సెల్యూట్‌ చేయాల్సిందే.

Saturday, June 27, 2020

సంగీత యోగం


సంగీతానికి తలలు ఊపని ప్రాణి సృష్టిలో లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పాముల వరకు సంగీత మాధుర్యంలో ఓలలాడతారని శాస్త్రం చెబుతోంది. పసిపాప భూమి మీద పడి కేర్‌కేర్‌మంటూ ఏడుపు ప్రారంభించగానే సంగీత జ్ఞానం లేని తల్లి సైతం ఏదో ఒక జోల పాట పాడటానికి ప్రయత్నిస్తుంది. సాక్షాత్తు అన్నమయ్యే ఆ భగవంతుడికి ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ అంటూ జోలపాడాడు. పాటకు అంత శక్తి ఉంది. ఉద్యమాలన్నీ పాటల మీద నడిచి, ఉద్యమాలను ముందుకు నడిపాయి. 
ఇక జానపదులు ప్రతి పనికీ ఒక పాట పాడుతూనే ఉంటారు. వడ్లు దంచుతూ ఏకంగా రామాయణాన్నే పాడారు నాటితరం వారు. అలా రామాయణం స్త్రీలపాటల రూపంలో వచ్చింది. బండి నడుపుతూ పాట, పంట కోతలు కోస్తూ పాట, నూర్పుళ్లు, తూర్పారపోయడం, ధాన్యం బస్తాల్లోకి ఎత్తి, గాదెల్లో నింపడం... పని ఏదైనా సరే.. పాడుకుంటూ అలసటను మరచిపోతారు. రజకులు వస్త్రాలను ఉతుకుతూ, ‘ఉష్‌..ఉష్‌’ అంటూ ఒక రాగాన్ని ఆలపిస్తారు. బరువులు ఎత్తేవారు ‘హైసా, హైసా’ అంటూ వారికి తోచినది పాడుతూ, బరువు ఎత్తటం వల్ల కలిగే అలసటను మరచిపోతారు. 
వివాహాలలో వియ్యపురాలిని ఆటపట్టిస్తూ, ‘వియ్యపురాలా ఓ వయ్యారి భామా నీ ఒయ్యారములేలనే’ అంటూ వేడుకగా పాడుకుంటారు. బావగారిని ఆటపట్టిస్తూ మరదలు, ‘ఓహోహో బావగారు ఎప్పుడొచ్చారు, ఈ చిల్లు చెంబులో నీళ్లున్నాయి కాళ్లు కడుక్కోండి’ అంటూ పాడుతుంది. ఏ పనిలోనైనా పాట ఒక ఆశ్వాసన ఇస్తుంది. 
శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. ప్రస్తుతం అందరం మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. సినిమా పాటలైతే ‘పాట చాలా మెలోడియస్‌గా ఉన్నాయి’ అంటాం. అవే మనసుకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగించే రాగాలు. ఒక పక్కన కరోనా మహమ్మారి గురించి అందరిలోనూ ఏదో తెలియని భయం బయలుదేరింది. అలజడితో ఉన్న మనసుకు సాంత్వన కావాలనిపిస్తు్తంది. ఇటువంటి సమయంలోనూ సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం.
సామ రాగం (సరిమపదస... సదపమగరిస)
ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళ నయనా’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. మనకు బాగా సరిచితమైన ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా శంకరాభరణంలోని సదాశివబ్రహ్మం రచించిన ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే. 
2. మలయమారుతం.. (సరిగపదనిస.. సనిదపగరిస)
ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనసుకు ఆహ్లాదం కలగించమని భగవంతుడిని కీర్తించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు.
3. మోహన రాగం (సరిగపదస.. సదపగరిస)
‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాటించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో స్వరాలను ఇముడ్చుకుని, మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్‌’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’.
4. హిందోళ (సగమదనిస.. సనిదమగస)
ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే.
5. వలజి (సగపదనిస.. సనిదపగస)
ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా/తనువు మనసు ఊగితూగి/ఒక మైకం కలిగేనులే/ఈ మహిమ నీదేనులే/ప్రేమ తీరు ఇంతేనులే.. ’, ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్‌ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాటలు ఈ రాగంలో స్వరపరిచినవే.
6. మధ్యమావతి (సరిమపనిస.. సనిపమరిస)
ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ, లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు.

మ‌న‌సుకి ప్ర‌శాంతంగా ఉంటుంది
 
కొన్ని రాగాలు మనసుకు ఉల్లాసం కలిగించడనికి కారణం స్వరస్థానాల మధ్య దూరం ఉండటమే. సంగీతం సప్తస్వర సమ్మిళితం. కాని ఈ రాగాలలో కేవలం ఐదు స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం కొన్ని స్వరస్థానాల కలయిక వల్ల ఆ మాధుర్యం వస్తుంది. ‘సరిగమపదని’ అనే స్థానాలలో రి అక్షరం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. గ రెండు రకాలుగా ఉంటుంది. అంటే స పక్కన మొదటి రి కాకుండా రెండో రి వస్తే అప్పుడు వాటి కలయిక కారణంగా పాటకు మాధుర్యం వస్తుంది. స పక్కన మొదటి రి, గ పక్కన మొదటి మ వస్తే అవి వీరోచిత రాగాలుగా వినిపిస్తాయి. దూరం ఉండాలి కాని, దూరంగా ఉండకూడదు. అటువంటివి ఈ రాగాలన్నీ. ఈ రాగాలు వింటే మానసిక ప్రశాంతత వస్తుంది. 
– మోదుమూడి సుధాకర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. 

-------------------------------------------------

మ‌నఃస్థితికి అనుగుణంగా రాగాలు..

మానసిక ఆరోగ్యం కోసం ఎక్కువ శక్తివంతంగా ఉండే రాగాలను వినిపిస్తాం. సంతోషం కోసం హంసధ్వ‌ని రాగాన్ని వినిపిస్తాం. కేదారగౌశ, ధీర శంకరాభరణం వంటి రాగాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అభోగి రాగం ప్రశాంతతను చేకూరుస్తుంది. అభేరి సంతోషాన్ని ఇస్తుంది. నేను రాగాల మీద పరిశోధన చేశాను. ఏ రాగం ఎటువంటి సమయంలో, ఏ విధంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా అవసరమైన వారికి మ్యూజిక్‌ థెరపీ చేస్తాను. 
– డాక్టర్‌ మీనాక్షి రవి, డైరెక్టర్, మీరా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీ, బెంగళూరు.
–––––––––––––––––––
– సంభాష‌ణ‌: వైజయంతి పురాణపండ

Friday, June 26, 2020

వాగ్దేవి శారద


నాటకం ఆవిడ ప్రాణం. సంగీత సాహిత్యాలు ఉచ్ఛ్వాసనిశ్వాసలు. ఒకసారి గొంతెత్తి రవీంద్రుని గీతాలు ఆలపిస్తే మరొకసారి దేవులపల్లి వారి కావ్యకన్యక అవుతారు. చలం, గోపీచంద్, బుచ్చిబాబు, తిలక్‌... రచయిత ఎవరయితేనే వారి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. పాత్ర చిన్నదా, పెద్దదా, పేరొస్తుందా, రాదా... ఈ తర్జనభర్జనలేవీ లేకుండా, నటిగా తన కర్తవ్యాన్ని సమర్థంగా పోషించి, పాత్రలో మమైకపోయి... పాత్రలకు శాశ్వతకీర్తి తెచ్చారు, తను తెచ్చుకున్నారు. తన విలక్షణ స్వరంతో రేడియో నాటక చరిత్రను మార్చేసిన వాగ్దేవి. ఆమె గొంతు విప్పితే కళ్లముందు పాత్ర ప్రత్యక్షమవుతుందే కాని రూపం గుర్తుకురాదు. తాము సృష్టించిన పాత్రలను ఆమె పోషిస్తేనే శాశ్వతంగా ఆ పాత్ర నిలబడిపోతుంది అనుకునేవారు రచయితలు. ఈడిపస్‌లో పాత్ర చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. పురూరవలో ఊర్వశిగా వేసి చలం మెప్పు పొందారు. బిర్లా ప్లానెటోరియంలో ఖగోళశాస్త్రాన్ని తన గళంతోనే వినిపించి అందరికీ విశ్వవీక్షణ భాగ్యం కలిపిస్తున్నారు. ఆమె రేడియో అనుభవాలు పుస్తకం విడుదల చేసిన సందర్భంగా శారదాశ్రీనివాసన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ... 
1. నాటకరంగ ప్రవేశం...
ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకునే కుటుంబం మాది. అతి కష్టం మీద మా ఇంటి దగ్గరున్న హిందీ విద్యాలయానికి పంపారు. అందులో చిర్రావూరి సుబ్రహ్మణ్యం (దక్షిణ భారత హిందీ ప్రచారసభ సంచాలకులు, ప్రస్తుతం కీ.శే.) గారు పనిచేసేవారు. ఆయన హిందీ, సంస్కృత భాషల్లో ఉద్దండులు. పిల్లలకు చదువు అవసరం అనే అంశం మీద ఆయన రచించిన ‘అమ్మ’ నాటకంలో నన్ను వేషం వెయ్యమన్నారు. నాటకం వేయడం అంటే ఏమిటో తెలియని నాచేత ఆయన బలలవంతంగా వేయించారు. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. ఆ నాటకం సక్సెస్‌ అయింది. అది  పూర్తయిన తరవాత సి.హెచ్‌. నరసింహారావుపంతులుగారు (రేడియో ఆర్టిస్ట్‌) నన్ను చూసి ‘ఈ అమ్మాయి ఎవరో గాని బాగా వేసింది, మంచి భవిష్యత్తు ఉంది’ అన్నారు. నేనసలు నాటకాలే వేయను కదా! మంచిభవిష్యత్తు ఉందని ఎలా అన్నారు? అసలు ఇదెలా సాధ్యం అవుతుంది? అని మనసులో అనుకున్నాను. ఆయన వాక్కు నిజం అవుతుందని ఆ రోజు అనుకోలేదు. 

2. రేడియోలో మొట్టమొదట ఎలా ప్రవేశించారు?
నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో, మా స్కూలు పిల్లలందరినీ రేడియోలో ఆడిషన్‌ టెస్ట్‌కి పిలిచారు. కొందరిని ఎంపికచేసి పంపారు. అక్కడికి వెళ్లాక మాట్లాడాలో అర్థం కాక భయపడ్డాను. అయితే చదవడానికి రూమ్‌లోకి వెళ్లాక ఇంక భయం వెయ్యలేదు. ఎందుకంటే లోపల నన్ను ఎవ్వరూ చూడరు. నా ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు. ఆ ధైర్యంతోనే చక్కగా చదివేశాను. అలా 1956 జనవరి 5న మొట్టమొదటగా ఒక హిందీ నాటకం వేసే అవకాశం వచ్చింది.


3. రేడియోలోకి ఎలా ప్రవేశించగలిగారు?
వేమూరి రాధాకృష్ణగారు (ప్రఖ్యాత రంగస్థల నటులు) నాలో ఉన్న ప్రతిభతను గుర్తించి, రేడియోకి ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ‘రేడియోలో నేను దేనికి పనికి వస్తాను. రేడియో అంటే మ్యూజిక్‌ మాత్రమే కదా!’ అన్నాను నవ్వుతూ. ఆయన నా మాటలను పక్కనపెట్టి,  పట్టుబట్టి రేడియోకి పంపారు. రేడియోలో పనిచేస్తున్న జనమంచి రామకృష్ణగారు నాలో ఉన్న కళను గుర్తించి చాలా అవకాశాలు ఇచ్చారు. అన్నిటినీ సద్వినియోగం చేసుకున్నాను. ఆల్‌రౌండ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాను.

4. మీరు ఎక్కువగా ఎటువంటి వేషాలు వేసేవారు?
రజనీ గారు ర చించిన ‘శతపత్రసుందరి’ సంగీత రూపకంలో వసంతుడిగా, ద్విజేంద్రలాల్‌ రాసిన ‘చంద్రగుప్త’ లో చంద్రగుప్తుడుగా వేశాను. వయసులో చిన్నదానినయినా పొడుగ్గా ఉండటం వల్ల అబ్బాయి పాత్రలు ఎక్కువగా వచ్చేవి. రజనీ గారు రచించిన ‘క్షీరసారగమథనం’ చేశాను. అయితే ఏ నాటకంలోనైనా సరే డైలాగులు బట్టీ పట్టలేనని ఎంతచెప్పినా, పట్టుబట్టి నేర్పించి మరీ నాతో వేయించేవారు. ఒక్కసారి వెనక్కిచూసుకుంటే ‘అన్ని వేషాలు ఎలా వేశానో!’ నాకే తెలియకుండా జరిగిపోయింది.


5. ఇన్ని నాటకాలలో అవకాశాలు వచ్చినందుకు మీకు ఎలా అనిపించింది...
నేను బడికి వెళ్లనందుకు బాధపడిన మాట వాస్తవం. అయితేనేం, అనుకోకుండా వచ్చిన అవకాశంతో నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్నాను. బహుశ ఇన్ని నాటకాలు చే యడానికి అదే కారణం అయి ఉంటుంది. రజనీ రచించిన గోదావరి రూపకంలో వేసిన గోదావరి పాత్రకు బహుమతి వచ్చింది. ఆ తరవాత పింగళి లక్ష్మీకాంతంగారి దగ్గరకు తీసుకెళ్లి, ‘ఈవిడ భాష బావుంది, సంస్కృత నాటకంలో వేయించవచ్చు’ అన్నారు. ‘నాకు సంస్కృతం రాదు, వేయను’ అని చెప్పినా కూడా నా మాట వినలేదు. నెలరోజుల పాటు రిహార్సల్స్‌ చేయించి నేర్పించారు. అప్పుడు వేసినదే ‘వత్సరాజు’ నాటకం. నా పద్ధతి చూసి పింగళివారు, నా వివరాలు అడిగారు. నేను చెప్పేసరికి, ‘‘నువ్వు మా గురువుగారి అమ్మాయివా,’’ అని ఆశ్చర్యపోయారు. (కాజ శివరామకృష్ణగారు మా పెదనాన్న. పింగళివారికి మా పెదనాన్న గురువుగారు).


6. మీరు నటించిన మొట్టమొదటి తెలుగు నాటకం ఏది?
రజనీగారు కర్ణుడికి సంబంధించిన కథ నాటకంగా చేయించారు. నాది కర్ణుడి భార్య పాత్ర. కుంతిగా నాగరత్నమ్మగారు (రేడియో నటి) వేశారు. అందులో నటిస్తున్నవారందరికీ అప్పటికే రంగస్థల అనుభవం ఉంది. నాకు మాత్రం మొదటి నాటకం. అయినా బెరుకు లేకుండా చేసి, అందరినీ మెప్పించాను. స్థానం నరసింహారావుగారి నాటకాలంటే ఎంతదూరమైనా వెళ్లి చూసే మా నాన్నగారు, నా నాటకాలు మాత్రం ఎప్పుడూ చూడలేదు.

7. లలితసంగీతం గురించిన వివరాలు...
లలితసంగీతం ముసునూరి వెంకటరమణమూర్తి గారి దగ్గర నేర్చుకుని, భక్తిరంజనిలో పాడాను. అలాగే మంగళంపల్లి బాలమురళిగారి ఇంటికి కూడా వెళ్లి కొన్నాళ్లు నేర్చుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్‌ ఆకాశవాణిలో డ్రామా ఆర్టిస్ట్‌ పోస్ట్‌ ఉందని చిత్తరంజన్‌గారు చెప్పారు. విజయవాడలో అప్పటికే నాగరత్నమ్మ, నండూరిసుబ్బారావు, రామమోహన్‌రావుగారు వంటి ఉద్దండులు ఉన్నారు. నాకు అక్కడ అవకాశం లేదు. అందుకే భాగ్యనగరానికి వెళ్లడానికి అంగీకరించి, 1959లో అక్కడ చేరాను.

8. సాంఘిక నాటకాలేనా... ఇతర నాటకాలలో కూడా వేశారా?
సంగీత నాటకాలలో కూడ చేశాను. గోపీచంద్‌ ‘మేఘసందేశం, మగువ మాంచాల’ లో వేశాను. ఆ తరవాత 1961లో కృష్ణశాస్త్రిగారి ‘శర్మిష్ఠ’ నాటకంలో దేవయానిగా నటించాను. ఆ పాత్ర చాలా చిన్నది. ఈ నాటకం విని పాకాల రాజమన్నార్‌ ‘నాటకం చాలా బాగా వచ్చింది, ముఖ్యంగా మొదటి మూడు పేజీలు’ అని ఒక ఉత్తరం కృష్ణశాస్త్రిగారికి రాశారు. ఆయన నాకు చూపించారు. బుచ్చిబాబుగారి ‘ఉత్తమ ఇల్లాలు’ అనే నాటకం ‘ఎంకి’ని దృష్టిలో ఉంచుకుని ఒక ఊహాగానం చేశారు. అందులో ఎంకి పాటలు నిరంతరం హమ్‌ చేస్తూండాలి. పాట కేవలం ఒక్క లైన్‌ మాత్రమే. అందులో ఎంకిగా వేశాను. ఆయన రాసిన సోక్రటీస్‌లో భార్య పాత్ర పోషించాను. కృష్ణశాస్త్రిగారు ‘బావొస్తే!’ అని 1960 లో సంక్రాంతి పండగకు రాశారు. బావగా గొల్లపూడి మారుతీరావు, కొత్త మరదలుగా నేను నటించాం.  ఇవేకాక చైనాకు వ్యతిరేకంగా రాసిన పాటలు పాడేటప్పుడు చైనాను తరుముతున్నట్టుగా  ఇమోషనల్‌గా పాడేవాళ్లం. అలాగే 1977లో ఉప్పెన సమయంలో ‘కన్నీటి కెరటాలు’ అనే శీర్షికన ‘జలప్రళయం’ పేరుతో సంగీత కార్యక్రమం చేశాం. 

9. ఠాగూర్‌ రచనలకు...
1960 లో టాగూర్‌ సెంటినరీ సెలబ్రేషన్స్‌... దేశంలోని అన్ని వైపుల నుంచి ఆర్టిస్టులు పాటలను పాటలను ట్రాన్స్‌లేట్‌ చేశారు. కవులు, పండితులు అందరూ రేడియోకి వచ్చారు. ఇంతమంది జనంతో పాడటమన్నది నా అదృష్టం. 

10. నవలలకు రేడియో అనుసరణ, సంగీతం...
రంగనాయకమ్మ ‘బలిపీఠం’ లో అరుణ, ద్వివేదుల విశాలాక్షి ‘మారిన విలువలు’, (సొంత ప్రొడక్షన్‌). ‘పురానా ఖిల్లా’ అని కలవటపు రామగోపాలరావు రాసినది, మొట్టమొదట స్వయంగా చేశాను. అందులో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కోసం నా దగ్గరున్న అన్ని రకాల టేపులను కలిపి గందరగోళం ఎఫెక్ట్‌ వచ్చేలా చేశాను.  అది బ్రాడ్‌కాస్ట్‌ అయిపోయింది. నాటకం విన్న అయ్యగారి వీరభద్రరావు (అప్పటి స్టేషన్‌ డైరెక్టరు) గారు,  ‘‘చాలా బావుంది, ఈ ఎఫెక్ట్‌ ఎలా వచ్చింది’’ అని అడిగారు. ఆ క్రెడిట్‌ చాలు నాకు. నేను నాటకాలు ప్రొడ్యూస్‌ చేసేటప్పుడు అవసరమైనచోట మాత్రమే మ్యూజిక్‌ ఇచ్చేదాన్ని. ఎక్కడ ఎలివేట్‌ చెయ్యాలో అక్కడ సంగీతాన్ని ఇచ్చేదాన్ని. సంగీతం లేకుండా డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉండాలనేది నా అభిప్రాయం. రేడియోలో నేనే మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్‌ని. రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి నన్ను బాగా ప్రోత్సహించారు.



11. కృష్ణశాస్త్రిగారి గురించి...
కృష్ణశాస్త్రిగారు తన స్క్రిప్ట్స్‌ అన్నీ నా చేతే చెప్పించారు.
‘సుబ్బమ్మవ్వ’ అని ఓ క్యారెక్టర్‌ని సృష్టించి, మోనో యాక్షన్‌ నా  చేత చేయించారు. నేను చదివిన విధానం చూసిన ఆయన చాలా సంతోషపడ్డారు.


12. రికార్డింగులంటే ...
అందరూ ఆకాశవాణి స్టూడియోలో ఎర్ర లైట్‌ చూస్తే భయపడతారు. కాని నాకు మాత్రం అది చూడగానే ఉత్సాహం వచ్చేది. అది నాకొక ఇన్‌స్పిరేషన్‌ ఇచ్చేది. అది చూడగానే గంభీరంగా మారిపోయి పాత్రలోకి ప్రవేశించేసేదాన్ని.


13. రేడియోలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు?
ఫ్యామిలీ ప్లానింగ్‌ నాటకాలు ప్రొడ్యూస్‌ చేశాను. రేడియో ఉత్తరాలు చదివాను. వేలకొద్దీ నాటకాలు వేశాను. గ్రామీణ, స్త్రీల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ కార్యక్రమం అన్నీ నిర్వహించాను. పసలేని నాటకాలను సైతం పండించాను. 

14. ఇతర నాటకాలు...
‘అమ్మకి ఆదివారం లేదా’ అనే రంగనాయకమ్మగారి నాటకం వేశాను. 
రాంభొట్ల కృష్ణమూర్తిగారు రచించిన ‘మధురవాణి’ అనే మోనోలాగ్‌ చదివాను.
నార్లచిరంజీవిగారు రాసిన ‘మహానిష్క్రమణం’ చేశాను.


15. నాటకాల నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా...?
నాటకాలలో కొన్ని జ్ఞానాన్ని ఇచ్చాయి. కొన్ని మనసుకు నచ్చాయి. 
బంగ్లాదేశ్‌ విభజన సమయంలో... కందుకూరి చిరంజీవి ‘సోనార్‌ బంగ్లా’ అని నాటకం రాశారు. అది చాలా బాగా వచ్చింది. కాని ప్రసారం కాలేదు. అది నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. నార్ల చిరంజీవిగారు ‘భాగ్యనగరం’ అని రాశారు. దాన్ని కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశాం. ఈయన రాసిందే ఒక టీన్‌ ఏజ్‌ అమ్మాయికి సంబంధించిన నాటకం వేశాం. ఇది రికార్డింగ్‌ కాకుండా ప్రత్యక్షంగా చేశాం. పేరు కూడా జ్ఞాపకం లేదు. అది నాకు నచ్చిన నాటకం. ఇందులో కుటుంబం అంతర్లీనంగా ఉండేలా చక్కగా రాశారు. దాని పేరు మర్చిపోయినా కూడా  దానిమీదొక ప్రేమ. ఇంకా... పొగమేడలు (ఇంగ్లీషు లవ్‌ స్టోరీ, బ్లడ్‌ క్యాన్సర్‌కి సంబంధించినది), నేరము – శిక్ష (క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌), యద్దనపూడి సులోచనారాణి సెక్రటరీ, విజేత, వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనుషులు’ (సొంత ప్రొడక్షన్‌), మునిమాణిక్యం ‘కాంతం కథలు’...

16. ఎక్కువ నటించింది ఎవరితో...
ఖైదీ నాటకంలో నండూరి విఠల్, నేను చేశాం. మా కాంబినేషన్‌కి మంచి పేరు. ఆయనతోనే
‘కాలకన్య’ సీరియల్‌ చేశాను. ఆయన రాసిన ‘సీతాపతి’ నాటకంలో యంగ్‌ కపుల్‌గా వేశాం. బెజవాడ గోపాలరెడ్డిగారు ఈ నాటకాన్ని మళ్లీ వెయ్యమన్నారు. ఇదేకాక ‘అశ్వఘోషుడు’ వేశాం. ఆ తరవాత ఒక ఎక్స్‌పరిమెంటల్‌ నాటకం వేశాం. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారిద్దరూ ఒకరితో ఒకరు చెప్పలేనంత ప్రేమను కనపరుచుకుంటారు. కాని మనసులో మాత్రం ‘వీడు ఎప్పుడు పోతాడా అని ఆవిడ, ఇది ఎప్పుడు పోతుందా’ అని అతను అనుకుంటారు మనసులో. 


17. మీకు పూర్తి సంతృప్తినిచ్చిన నాటకం...
తిలక్‌ రచించిన ‘సుప్తశిల’ నాకు పూర్తి సంతృప్తినిచ్చిన నాటకం. ఆయనదే ‘నల్లజర్ల రోడ్డు’ వేశాం. అయితే ఏ పాత్ర చేసినా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించేది. కాని ఈ నాటకంలో పాత్ర మాత్రం నాకు పూర్తి స్థాయి ఆనందాన్నిచ్చింది. 


18. మీరు చేసిన పి.వి.నరసింహారావుగారి రచన గురించిన విశేషాలు...
పి.వి.నరసింహారావు రచించిన ‘ఎవరు లక్ష్యపెడతారు’ (మరాఠీ మూలం) నాటకం చేశాం. అది నేను, విఠల్‌గారు రేడియోకి నాటకీకరణ చేసి, స్త్రీల కార్యక్రమంలో సీరియల్‌గా చేశాం. అందులో నేను బాల వితంతువుగా (మెయిన్‌ రోల్‌) చేశాను. నన్ను పి.వి. మెచ్చుకుంటూ నా గురించి మీటింగులో మాట్లాడారు. నాకు ఇంతకు మించిన అవార్డులు, రివార్డులు ఎందుకు? 1959లో గోరాశాస్త్రి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నాటకాన్ని సీరియల్‌గా వేశాం. ఇందులో నేను ఇందిర వేషం వేశాను. కొంతకాలం తరవాత దీనిని నవలా పఠనం చేశాను. అనుకోకుండా దీన్ని మూడుసార్లు చేశాను.

19. మీరు మరచిపోలేని సంఘటన... 
గ్రీకు నాటకం ‘ఇడిపస్‌’ని లక్కాకుల సుబ్బారావు ‘రాజా ఇడిపస్‌’ అని తెలుగులో రాశారు. ఆ నాటకం వేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్‌ అయ్యాను. అందులో నేను రాణి పాత్ర వేశాను. రాణి కుమారుణ్ని చంపేయమని రాజు ఆజ్ఞాపిస్తాడు. పిల్లవాణ్ని అడవిలో వదిలేస్తే ఎలాగూ జంతువులు ఆ పిల్లవాణ్ని తినేస్తాయి కదా అనుకుంటారు సైనికులు. దైవవశాత్తూ ఆ పిల్లవాడు అక్కడి అడవి మనుషులకు దొరుకుతాడు. వారు అతడిని పెంచి పెద్ద చేస్తారు. ఆ బాలుడు పెద్దవాడయ్యి అన్ని రాజ్యాలను జయిస్తూ, తల్లి ఉన్న రాజ్యం మీద దండెత్తి›దానిని కూడ జయిస్తాడు. జయించిన రాజ్యంలోని రాణివాసం కూడా వారి అధీనం లోకి వస్తుంది. వెంటనే రాణిని కూడ తన రాణివాసంలోకి తీసుకుంటాడు. ఇద్దరికీ తల్లీ కొడుకులని తెలీదు. అటువంటి సమయంలో కొడుకు తల్లి దగ్గర తప్పుడుగా ప్రవర్తిస్తాడు. అంతా జరిగిపోయాక తల్లికి అతడు తన కొడుకు అని తెలిసి వేదన భరించలేక చచ్చిపోతుంది. 
ఆ నాటకం వేసిన రోజు అర్ధరాత్రి మెలకువ వస్తే ఒళ్లు జలదరించింది. మానసికంగా చాలా బాధపడ్డాను. ఇది నాటకం కదా ఎందుకు ఆ ఇన్సిడెంట్‌ మర్చిపోను అనుకున్నాను. ఆ నాటకం వేశాక ఎందుకో నాకు దుఃఖం ఆగలేదు. నాటకం టేపులు చెరిపేయాలనుకున్నాను. కొన్ని రోజుల పాటు నేను నిద్రపోలేకపోయాను. చిరంజీవి గారి వెంట పడి దానిని చెరిపేయమని సాధించేశాను. నా పోరు పడలేక దానిని ఒక సంవత్సరం తరవాత తీసేశారు. అప్పటికి నా మనసు శాంతించింది. నిజానికి అందులో చాలా బాగా నటించానని అందరూ నన్ను మెచ్చుకున్నారు. అయితే ఆది చెరిపిన తరవాత ఎంత తప్పు చేశాను, ఇది నాటకమే కదా, ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను అనుకున్నాను. నాటకం వేస్తే నేను ఆ పాత్రలోకి ప్రవేశించేస్తాను. మా ఆర్టిస్ట్‌ల మనసులు ఎవరూ అర్థం చేసుకోలేరు. మేం సైకలాజికల్‌గా ఎన్ని బాధలు పడతామో అర్థం కాదు. పాత్రలకి ప్రాణం పోయాలని, మూర్తీభవింపచేయాలని అనుకున్నాను.


20. చలం గారి రచనల గురించి...
చలం గారి ‘పురూరవ’ చేశాం. జనమంచి రామకృష్ణగారు ఎడిట్‌ చేశారు. ఊర్వశి, పురూరవుడు రెండే పాత్రలు. సంగీతం మొత్తం చిత్తరంజన్‌ చేశారు. ఇది 1977లో చేశాం. నేను చాలా బాగా చేశానని చలం అభినందించారు. ఆ నాటకం విని ఆర్మీ మేజర్‌ జనరల్‌ పి.వెంకట్రామయ్యగారు మెచ్చుకున్నారు. ఒకసారి చలంగారి అమ్మాయి సౌరిస్‌ గారి దగ్గరకు వెళ్లినప్పుడు ఆవిడ ‘పురూరవ శారదేనా?’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకున్న నటనతనో ఆయనను మెప్పించాను. నాకు ఇదే పెద్ద అవార్డు.


21. ఇంకా మీరు చేసిన నాటకాలు గురించి...
ఆర్‌.వి.చలం ‘విరజాజి’, నార్లచిరంజీవిగారి ‘మహానిష్క్రమణం’ చేశాను. 
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన ‘శిలామురళి’ కోసం నన్ను విజయవాడ పిలిపించి చేయించారు. అది నేను వీరభద్రరావు (సుత్తి వీరభద్రరావు రేడియో నాటకాలలో హీరో పాత్రలు వేసేవారు) కలిసి చేశాం. ఈయన రాసినదే ‘తలుపు’ అని నేను రామం (ఎస్‌.బి.శ్రీరామ్మూర్తి)  కలిసి చదివాం. దానికి కలగ కృష్ణమోహన్‌ ప్రొడక్షన్‌. ఇదొక వేదాంతం తీసుకొచ్చింది. అది వింటే ఆత్మశాంతిలాంటిది కలుగుతుంది.


22. ఇప్పుడున్న ఇతర వ్యాపకాలు...
బిర్లా ప్లానెటోరియంలో ఇప్పటికీ నా కామెంటరీనే వేస్తున్నారు. ఇవి కాక ఎస్‌.ఐ.ఇ.టి. వాళ్ల పాఠాలకు  నా గొంతు ఇస్తున్నాను. నా గొంతులో శక్తి ఉన్నంత వరకు నేను నాటకాలలో నటిస్తూనే ఉంటాను.

డా.వైజయంతి పురాణ‌పండ‌

వాట్‌ యాన్‌ ఐడియా సర్‌ జీ!



మీరు ఎప్పుడైనా ఒక మంచి లగ్జరీ కారులో జాయ్‌ రైడ్‌ చేశారా! ఆ జాయ్‌ రైడ్‌ చేయటం కోసం మామడి పండ్లు కొన్నారా! కొనకపోతే ఆ అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోండి. 

దుబాయ్‌లో ఒక కంపెనీ మేనేజర్‌ మామిడి పళ్లను లంబోర్గినీ కారులో వినియోగదారులకు అందచేసి, వారితో ఒక చిన్న జాయ్‌ రైడ్‌ చేయిస్తున్నారు. యుఏఈలో ఈ సరదా రైడ్‌ జరుగుతున్న వీడియో ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. యుఏఈలో ఉన్న పాకిస్థానీ చైన్‌ సూపర్‌ మార్కెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముహమ్మద్‌ జహాన్‌జేబ్‌ మామిడిపండ్లను తన సొంత ఆకుపచ్చరంగు లంబోర్గినీ కారులో డెలివర్‌ చేస్తున్నారు.

సరిగ్గా వారం క్రితం అంటే, జూన్‌ 18, 2020 నాడు ఈ కొత్త పనికి శ్రీకారం చుట్టారు జహాన్‌జేబ్‌. పాకిస్థానీ సూపర్‌మార్కెట్‌ ఫేస్‌బుక్‌  పేజీలో ‘న్యూ డెలివరీ వెహికిల్‌’ అంటూ, వారు చేస్తున్న కొత్త పని గురించి వివరించారు. ఆ పని తాలూకు ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్‌ చేశారు. ‘మా సరికొత్త లంబోర్గినీ కారులో మీకు పండ్లు అందచేసి, మీరు జాయ్‌ రైడ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నాం’ అంటూ నోరూరిస్తున్నారు. అయితే ఇందుకోసం భారత కరెన్సీలో 2059 రూపాయల ఖరీదు చేసే మామిడి పండ్లు తప్పనిసరిగా ఆర్డర్‌ చేయాలి. అయితేనేం, కోట్ల విలువ ఉన్న ఈ ఇటాలియన్‌ కారు కొనుక్కోవటం కంటె, ఒకసారి రెండు వేలు కట్టి, చిన్న రైడ్‌ చేస్తే చాలు అనుకుని, మామిడి పండ్ల కోసం ఎగబడుతున్నారు. 


ఇటువంటి కష్టకాలంలో ఆ మేనేజర్‌కి మంచి ఆలోచనే వచ్చింది. ఈ రైడ్‌ చేసినవారంతా, ఆ మేనేజర్‌ చిరునవ్వు గురించి ప్రశంసిస్తూ, వారి వారి వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. కేవలం ఈ రైyŠ  కోసమని రెండు మూడు సార్లు మామిడిపండ్లు ఆర్డర్లు చేస్తున్నామంటూ నెటిజెన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 

ఇంట్లోనే ఉంటాం.. ఇంటి కోసం సంపాదిస్తాం...

ఒక చేత్తో పిల్లల్ని ఎత్తుకుంటూ, మరో చేత్తో వంట చేస్తున్నారు. మూడో చేత్తో వ్యాపారం చేస్తున్నారు. ఈ మూడో చెయ్యి  ఎక్కడ నుంచి వచ్చింది.
అదే పిల్లల నుంచి వచ్చింది.
తమ పిల్లల కోసం చేసే ఆలోచన నుంచే మూడో చెయ్యి వచ్చింది. 
పదిమంది మామ్‌ఎంట్ర్‌ప్రెన్యూర్ల గురించి వాళ్ల మూడో చేయి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
వీరంతా పిల్లల్ని పెంచుతూ లక్షలు సంపాదిస్తున్నారు...
ఒక తల్లి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతుంది. చాలా కష్టం. చాలా ఏళ్లు ఎంతో ఓరిమిని సాధించాలి. రోజూ రకరకాల పనులు చేస్తుండాలి. ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ముందుకు వెళ్తేనే ఒక స్త్రీ మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతుంది.
మామ్‌ ప్రెన్యూర్స్‌ గురించి గూగుల్‌లో వెతికితే కొందరి పేర్లు వస్తాయి. వాళ్లు ఈ స్థాయికి ఎదగడానికి ఎంత కృషి చేశారో వాళ్ల గురించి చదివితే అర్థం అవుతుంది. ఇక్కడ పదిమంది బహుముఖ ప్రతిభ కలిగిన పది మంది మామ్‌ప్రెన్యూర్స్‌ గురించి ప్రస్తావించుకుందాం.
వీరిలో చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు.
1. గుంజాన్‌ లూమ్‌బా బబ్బర్‌ – శబరి
సంప్రదాయ దుస్తులు, ఇంటి అలంకరణకు ఉపకరించే వస్తువుల గురించి ఆలోచిస్తున్నారా, అయితే, వెంటనే శబరి వైపు ఒక్కసారి చూడండి. మూడు సంవత్సరాల క్రితం గుంజాన్‌ లూంబా బబ్బర్‌ ఇటువంటి వాటికి నాంది పలికారు. తన వ్యాపారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రారంభించారు. ‘‘నా వ్యాపారం చాలావరకు ఒకరి నుంచి ఒకరికి చేరడం ద్వారానే జరుగుతోంది. నా వ్యాపారం కోసమంటూ నాకేమీ ఒక వెబ్‌సైట్‌ కూడా లేదు’’ అంటారు గుంజాన్‌. తన వ్యాపారంలో ఇంచుమించు 70 శాతం వాట్సాప్‌ ద్వారానే నడుస్తోందట. మిగిలిన 30 శాతం ఫేస్‌బుక్‌ ద్వారా వెళ్తోంది అంటున్నారు గుంజాన్‌.

2. అభిలాష జైన్‌ – మార్వాడీ ఖానా
ఫేస్‌ బుక్‌ ద్వారా తన సొంత క్యాటరింగ్‌ బిజినెస్‌ ‘మార్వాడీ ఖానా’ పేరున ప్రారంభించారు లభిలాష. ఇందుకోసం ఒకే ఒక్క వాక్యాన్ని రాశారు అభిలాష.. ‘నేను రాజస్థానీ సంప్రదాయ వంటకం దాల్‌ బాటీ – చుర్మా ప్రతి ఆదివారం తయారుచేస్తున్నాను’ అని. ఆమెకు వెంటనే 40 ఆర్డర్లు వచ్చాయి. రోజూ ఉండే భోజనంతో పాటు, సంప్రదాయ స్నాక్స్, స్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, సమావేశాలు, పెళ్లిళ్ల వంటి సందర్భాలలో ఇవి సప్లయి చేస్తున్నారు. ఒంటరిగా ప్రారంభించిన అభిలాష, ఆర్డర్లు పెరగటంతో నలుగురు కలిసి ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. సొంత ఇంటి నుంచి తన వ్యాపారాన్ని 1000 అడుగుల కిచెన్‌లోకి అద్దె తీసుకుని మార్చుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఒంటరిగా వ్యాపారంలో విజయం సాధించగలరనడానికి నిదర్శనం అభిలాష.

3. చిను కాలా – రూబన్స్‌
ఈమె జీవితం పూలబాట కాదు. 15వ ఏటే ఇంటి నుంచి గెంటివేయబడింది. తన చేతిలో ఉన్న 300 రూపాయలతో జీవితం ప్రారంభించింది. పట్టుదలతో యాక్సెసరీస్‌ కంపెనీ ప్రారంభించింది. అంతకుముందు ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నించింది. ఇంటింటికీ వెళ్లి సేల్స్‌ గర్ట్‌గా కూడా పనిచేశారు చిను కాలా.  అన్నీ చూసిన తరవాత, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్థం అయ్యింది. అంతే నాలుగు సంవత్సరాల క్రితం రూబన్స్‌ ప్రారంభించి, ఇప్పుడు 56 లక్షల ఆదాయం సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. మరుసటి సంవత్సరమే ఈ ఆదాయం 3.5 కోట్లకు చేరుకుంది. కిందటి సంవత్సరం ఈ ఆదాయం 7.5 కోట్లకు చేరుకుంది.

4. నవదీప్‌ కౌర్‌ – ఆఘో
మా అమ్మాయికి మంచి బట్టలు ఇవ్వాలనే ఆలోచన నుంచి మామ్‌ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు నవదీప్‌ కౌర్‌. ‘మా అమ్మాయికి సింథటిక్‌ బట్టలు వేస్తుంటే, ఒళ్లంతా పొక్కులు, దురదలు రావటం మొదలైంది. అందువల్ల సహజ రంగులతో తయారైన నూలు వస్త్రాలు కొనటం ప్రారంభించాను. మధ్యమధ్యలో మాకు కావలసినవి దొరకకపోవటంతో, నేను స్వయంగా తయారుచేయాలని ఆలోచన చేశాను’ అంటున్న నవదీప్‌ కౌర్, స్వయంగా మార్కెట్‌లోకి ప్రవేశించారు. తను ప్రారంభించిన కంపెనీకి ‘అఘో’ అని పేరు పెట్టారు. ఈ పదానికి చంటిపిల్లలు నవ్వుతూ చేసే శబ్దం. ‘ఈ బట్టలు శరీరానికి హాయినిస్తాయి కనుక ఈ పేరే సరైనదని భావించాను’ అంటారు నవదీప్‌. ఈమె తయారుచేస్తున్న బట్టలు వేసుకున్న చంటిపిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. శరీరం కూడా మృదువుగా ఉంటోంది. నవదీప్‌ చేస్తున్న పని ద్వారా మరింత మంది తల్లులకు ఒక సందేశం పంపుతున్నారు. ‘ఇంటి నుంచి పని చేయండి తల్లులూ! నాకు ఇప్పుడు ఆర్డర్లు బాగా వస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉంటూ, ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాను. నేరుగా నేత కార్మికుల నుంచి క్లాత్‌ తీసుకువచ్చి, బట్టలు తయారుచేస్తున్నాను. ఇప్పుడు నా వల్ల కనీసం 500 మంది చేనేత కార్మికులు లాభం పొందుతున్నారు’ అంటూ ఆనందంగా చెబుతున్నారు ఈ మామ్‌ప్రెన్యూర్‌.

5. శృతి అజ్మేరా రెడ్డి – హ్యాపప్‌
పసి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కనీసం 95 శాతం కెమికల్స్‌తో నిండి ఉంటోందని ముఖ్యంగా అందులో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉండటం వల్ల, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని, తాను ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నారు. మార్కెట్‌లో దొరుకుతున్న పిల్లల ఆహార పదార్థాల మీద విస్తృతంగా పరిశోధన చేసి, రెండు సంవత్సరాల క్రితం హ్యాపప్‌ అనే స్టార్టప్‌ వారు అందచేస్తున్న పోషకాహార మిశ్రమాల గురించి తెలుసుకున్నారు. ఇందులో పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌... ఏవీ ఉండవు. ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు వీటిని ఇంటి దగ్గర చేసుకునేంత సమయం ఉండదు. అదేవిధంగా పెద్దవారికి కూడా పోషకాహారం అవసరం. అందుకే అన్ని వయసులవారికీ కావలసిన పోషకాలను ముఖ్యంగా పన్నెండు రకాల చిరుధాన్యాలను తయారుచేసి, అమ్ముతున్నారు శృతి అజ్మేరా రెడ్డి 

6. ఉప్మా కపూర్‌ – టీల్‌ అండ్‌ టెర్రా
ఉప్మాకపూర్‌ సింగిల్‌ మదర్‌. ఆమెకు తగినం ప్రోత్సాహం లభించలేదు. కాని తన కొడుకు నుంచి కావలసినంత శక్తి వచ్చింది. కొడుకు దాచుకున్న డబ్బులు తీసి, అమ్మకు ఇచ్చి, టీల్‌ అండ్‌ టెర్రా కంపెనీ పెట్టడానికి కారకుడయ్యాడు. స్నేహితుల సహకారంతో 7.5 లక్షల మూలధనంతో ఎంతో నమ్మకంతో కంపెనీ ప్రారంభించారు ఉప్మా కపూర్‌. కేవలం రెండు సంవత్సరాలలోనే ఆ కంపెనీ ఆదాయం 2.24 కోట్లకు చేరుకుంది. సంప్రదాయ ఆయుర్వేదం ఆధారంగా సహజ సౌందర్య సాధనాలు తయారుచేయంటం ప్రారంభించారు ఉప్మా కపూర్‌. ఇందులో ఉల్లి రసం, ఆముదంతో తయారైన తల నూనె కూడా ఉన్నాయి. 500 రూపాయల నుంచి ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. 

7. మోనివసా నార్కే – ఆర్‌యుఆర్‌ గ్రీన్‌లైఫ్‌
ఈ మామ్‌ఎంట్ర్‌ప్రెన్యూర కూడా తన కుమార్తె అవసరాల కోసం చేస్తున్న పరిశోధనతో, వ్యాపారవేత్తగా మారారు. ‘మా అమ్మాయికి తరచూ దగ్గు, ఫిట్స్‌ వస్తుండేది. నాకు చాలా దిగులుగా ఉండేది. మా పాపకు నాలుగేళ్ల వయసులో ఈ అనారోగ్యం మొదలైంది. నేను ఎటువంటి వైద్యం చేయించకూడదనుకునానను. సమస్యను నేను పరిష్కరించుకోవాలనుకున్నాను.’ అంటారు. ‘రెడ్యూసింగ్, రీయూజింగ్, రీసైక్లింగ్‌’ అనే లక్ష్యంతో  తన వ్యాపారం ప్రారంభించారు. ఇందులో 30 లక్షల మందికి ఈ విషయం మీద అవగాహన కల్పించి, వర్క్‌షాపులు ప్రారంభించారు. ఇప్పుడు మోనిషా ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు. 

8. ప్రియాంక దామ్‌ గంటూలీ – చిత్రన్‌
ప్రియాంక ఆన్‌లైన్‌ హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ చీరలు, యాక్సెసరీస్‌ మొబైల్‌ ఫోన్‌ ద్వారా అందచేస్తున్నారు. ఈ వ్యాపారం ఆర్కుట్‌ ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కాలక్షేపం కోసం ఈ పని ప్రారంభించారు. అదే ఆ తరవాత వ్యాపారంగా మారిపోయింది. వాట్సాప్‌ ద్వారా తన చీరల వ్యాపారం చక్కగా నడుపుతున్నారు. ‘‘ప్రతిరోజూ వ్యాపారం కోసం ఊళ్లు తిరగటం వల్ల బాగా అలసిపోయేదాన్ని. వాట్సాప్‌ వచ్చాక నా కష్టాలన్నీ గట్టెక్కాయి. కొత్త స్టాక్‌వచ్చినప్పుడల్లా ఆ ఫొటోలు మా వీవర్స్‌ నాకు వాట్సాప్‌ చేస్తారు. వాటిలో నుంచి నాకు కావలసినవి నేను ఎంచుకుంటాను. వాళ్లు నాకు కొరియర్‌ చేస్తారు. నేను వాళ్లకి వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను.. అంటారు.

9. సుమాన్‌ సూద్‌ – పచ్చళ్లు... 
62 సంవత్సరాల సుమన్‌ సూద్‌ ఢిల్లీలో ఉంటారు. ఆవిడక వంట, పచ్చళ్లు అంటే బాగా ఇష్టం. ఈ ఇష్టమే వ్యాపారంగా మారుతుందని ఆవిడ ఎన్నడూ అనుకోలేదు. ‘‘మా ఇంటికి ఇరుగుపొరుగు వారు ఏదో ఒక కారణంగా వస్తుండేవారు. వాళ్లు నా పచ్చళ్ల రుచి చూసి, వాళ్లకి ఆలివ్‌ ఆయిల్‌తో చేసిన పచ్చళ్లు కావాలని అడిగేవారు. కొందరేమో బాగా స్పైసీగా కావాలని అడగటం మొదలుపెట్టారు. ఐదు సంవత్సరాల క్రితం నేను మా అమ్మాయితో కలిసి ఈ వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నేను 60 రకాల పచ్చళ్లు అందరికీ అందచేస్తున్నాను. సుమారు 25 వేల కిలోల పచ్చడి చేస్తున్నాం. ఈ వ్యాపారం ద్వారా నెలకు కనీసం 50 వేల ఆదాయం వస్తోంది అంటున్నారు ఈమె. 

10. శిల్పి శర్మ బేడీ – ఇండీ ప్రాజెక్ట్‌ స్టోర్‌ (ఐపీయస్‌)
అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు, శరీరానికి హాయి కలిగించే వస్త్రాలు తయారుచేస్తున్నారు శిల్పి. నాలుగు సంవత్సరాల క్రితం తనకు పాప పుట్టినప్పుడు, పిల్లలకు సౌకర్యం కలిగించే సంప్రదాయ వస్త్రాలు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది. తన స్నేహితురాలు సత్య నాగరాజన్‌తో కలిసి వ్యాపారం ప్రారంభించారు. ‘‘మేం సొంతంగా వ్యాపారసంస్థ ప్రారంభించటం కంటె, ఇబ్బందుల్లో ఉన్న చేనేతవారిని బలోపేతం చేసి, మాకు కావలసినవి తయారుచేయించుకోవటం నయమనిపించింది. చిన్నచిన్న వారి నుంచి రకరకాల వస్త్రాలు కొనుగోలు చే సి, మాకు కావలసిన విధంగా డిజైన్‌ చేయించి, వస్త్రాలు తయారుచేస్తున్నాం’అంటున్నారు. 
-------------------------------------

Thursday, June 18, 2020

నాన్నా! నీకు మేమిచ్చే బ‌హుమ‌తి


నాన్నా! 
ఇలా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు స‌మాధానం చెప్ప‌వ‌ని మాకు తెలుసు.అయినా నిన్ను పిల‌వ‌కుండా ఎలా ఉండ‌గ‌లం నాన్నా! నీ ర‌క్తం పంచి మాకు జ‌న్మ‌నిచ్చావు. మా ఇద్ద‌రినీ రెండు క‌ళ్ల‌లా చూసుకుంటూ, కంటిపాప‌ల్లా కాపాడుతున్నావు. 
ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు కాపాడ‌తారు నాన్నా...
అని నిన్ను మేం ప్ర‌శ్నించం. నీ ర‌క్తాన్ని భ‌ర‌త‌మాత‌కు పంచ‌టం కోస‌మే క‌దా నువ్వు సైన్యంలోకి వెళ్లావు.
చైనా వారితో వీరోచితంగా పోరాడావు.
ర‌క్తం చిందించావు.
భ‌ర‌త‌మాత ఒడిలోకి చేరిపోయావు.
మేం ... నాన్నా! అని పిలిచినా ప‌ల‌క‌ని నువ్వు, నిన్ను నోరారా భ‌ర‌త‌మాత‌, నాన్నా! నా కోసం పోరాడావా, నా ద‌గ్గ‌ర‌కు రా... అని పిల‌వ‌గానే ఆ త‌ల్లి ఒడి చేరావు. 











నువ్వు స్వార్థ‌ప‌రుడివి నాన్నా. నీ ర‌క్తంలో దేశ‌భ‌క్తి అనే స్వార్థం నిండి ఉంది.
ఇంత చిన్న పిల్ల‌ల్ని మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి అక్క‌డ‌కు ఇంత తొంద‌ర‌గా వెళ్లిపోతావా.
రోజూ మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఎత్తుకుని ఆడిస్తారు..
మాకు బొమ్మ‌లు, చాకొలేట్లు, కొత్త బ‌ట్ట‌లు...
అన్నీ ఎవ‌రు తెస్తారు.
మేం ఏడిస్తే, మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఓదారుస్తారు..
ఇటువంటి మాట‌లు నిన్ను అడిగితే మేం ఒక వీర‌జ‌వాను పిల్ల‌లం ఎలా అవుతాం నాన్నా!
ఇవి ఎవ‌రిని అడిగినా తెస్తారు.
కాని ఎవ్వ‌రూ ఇవ్వ‌లేనిది, నువ్వు మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగేది స్వ‌చ్ఛ‌మైన తండ్రి ప్రేమ‌.
నువ్వు దేశం కోసం మ‌మ్మ‌ల్ని ఇక్క‌డ విడిచి బోర్డ‌ర్‌కి వెళ్లినా, రోజూ నిన్ను త‌ల‌చుకుంటూ...
మా నాన్న‌ను చూసి, భార‌త‌దేశం గ‌ర్విస్తోంది..
అనుకుంటున్నాం.



నీ గురించే కాదు నాన్నా, నీలాగే ఎంతోమంది దేశం కోసం ర‌క్తం ధార‌పోశారు. 
వాళ్ల పిల్ల‌లు కూడా మాలాగే అనుకుంటూ ఉంటారు.
దేశ‌భ‌క్తుడి పిల్ల‌లుగా పుట్టే అదృష్టం ఎంత‌మందికి ద‌క్కుతుంది నాన్నా.
మాలాంటి కొంద‌రికి మాత్ర‌మే అందే ఆనందం ఇది.
ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ నువ్వే ఉన్నావు.
అంద‌రూ నిన్ను చూస్తున్నారు.
నీ గురించే మాట్లాడుకుంటున్నారు. 
క‌ల్న‌ల్ సంతోష్ పిల్ల‌లు అనే మ‌ర‌పురాని కానుక మాకు ఇచ్చావు నాన్నా.
ఇంత‌కంటె మాకు వేరే ఏ బ‌హుమ‌తీ అక్క‌ర్లేదు.
నిజానికి ఎప్పుడూ మాకే బ‌హుమ‌తులు ఇచ్చే నువ్వు, ఇప్పుడు దేశానికి పెద్ద బ‌హుమ‌తి ఇచ్చావు.
నాలుగు రోజుల క్రితం వ‌ర‌కు మా ఇద్ద‌రి ఆలోచ‌న వేరేగా ఉంది. 
జూన్ 21న ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా నీకు ఎన్నో బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని మేమిద్ద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు.
నీకు కొన్న బ‌హుమ‌తులు నీకే ఇస్తాం. 
నువ్వు అమ‌రుడివి నాన్నా.
నువ్వు మాతో ఎప్పుడూ దేశం గురించి మాట్లాడుతూనే ఉంటావు నాన్నా.
మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి ఏంటో తెలుసా.
మేం కూడా నీలాగే భార‌త సైన్యంలో చేరి వీరోచితంగా పోరాటం చేసి, భ‌ర‌త‌మాత‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం.
ఇదే మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి నాన్నా.
ఈ బ‌హుమ‌తి నీకు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం.
జైహింద్ నాన్నా
(సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌)
- వైజ‌యంతి పురాణ‌పండ‌

న‌మ‌స్కార్‌

ఫోన్ రింగ్ అవుతుంది. ట్రింగ్ ట్రింగ్ అని కాదు... ఏదో ఒక పాట కాదు.. ఏదో ఒక మాట కాదు.. మ‌రి ఏం వ‌స్తుంది. న‌మ‌స్కార్‌, క‌రోనా వైర‌స్ యా కోవిడ్ - 19 సే ఆజ్ పూరా దేశ్ ల‌డ్ ర‌హా హై... అంటూ ఇంగ్లీషు, హిందీల‌లో వ‌చ్చిన త‌ర‌వాతే ఫోన్ క‌నెక్ట్ అవుతుంది. సుమారు మూడు నెల‌లుగా ఏ ఫోన్ డ‌య‌ల్ చేసినా, కంపెనీ సంబంధం లేకుండా దేశ‌వ్యాప్తంగా ఇదే కాల‌ర్‌ట్యూన్ అయిపోయింది. మొద‌ట్లో అంద‌రికీ హిందీ లేదా ఇంగ్లీషు భాష‌ల‌లోనే వ‌చ్చేది. ఆ త‌ర‌వాత ప్రాంతీయ భాష‌ల‌లో మొద‌లైంది. ఆ గొంతు ఎవ‌రిదో తెలియ‌దు కానీ, ఆ మాట‌లు విన్నాక మ‌న‌సు క‌రోనా భ‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆ మాట‌ల మాంత్రికురాలు ఈ మధ్య‌నే అంద‌రికీ క‌నిపించింది. ఆమే ఢ‌ల్లీకి చెందిన జ‌స్లీన్ భ‌ల్లా.. -------------- ఆ గొంతు ఇంత‌కుముందే అంద‌రికీ సుప‌రిచితం. ఒక ప్ర‌యివేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అనౌన్స్‌మెంట్‌, భార‌త‌దేశంలోని ఒక పెద్ద టెలికం సంస్థ‌కు, ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో రైలులో అనౌన్స్‌మెంట్లతో అంద‌రికీ ఈ గొంతు ఇప్ప‌టికే తెలుసు. ఇప్పుడు క‌రోనా కాల‌ర్ ట్యూన్‌తో ఇంటింటికీ చేరింది ఈ గొంతు. జ‌స్లీన్ భ‌ల్లా సుమారు ప‌ది సంవ‌త్స‌రాలుగా వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టుగా ఉన్నారు. ఇప్పుడు క‌రోనా గురించి అవ‌గాహ‌న క‌లిగింఏ సందేశం ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇండియ‌న్ ప్రెస్‌వారు ఆమెకు సంబంధించిన స‌మాచారాన్ని సోష‌ల్ మీడియాలో వెద‌కి పట్టుకున్నారు. ఆమె గొంతు గురించి... సూప‌ర్బ్‌, స్పిఫింగ్‌... అంటూ పొగుడుతున్నారు. ఆమె ఆడియో క్లిపింగుల‌కి టిక్‌టాక్ వీడియోలు కూడా త‌యారుచేస్తున్నారు. ఈ విష‌యం గురించి ఆమె... నేను కేవ‌లం నా ఉద్యోగ‌ధ‌ర్మం నిర్వ‌ర్తిస్తున్నాను. నేనెవ‌రో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కాని ఒక టీవీ వారు చేసిన ఇంట‌ర్వ్యూ బాగా వైర‌ల్ కావ‌లటంతో, నా జీవితంలో చాలా మార్ప‌లు వ‌చ్చాయి... అంటున్నారు. ఇండియ‌న్ ప్రెస్‌వారు ఆమెకు సంబంధించిన స‌మాచారాన్ని సోష‌ల్ మీడియాలో వెద‌కి పట్టుకున్నారు. ఆమె గొంతు గురించి... సూప‌ర్బ్‌, స్పిఫింగ్‌... అంటూ పొగుడుతున్నారు. ఆమె ఆడియో క్లిపింగుల‌కి టిక్‌టాక్ వీడియోలు కూడా త‌యారుచేస్తున్నారు. ఈ విష‌యం గురించి ఆమె... నేను కేవ‌లం నా ఉద్యోగ‌ధ‌ర్మం నిర్వ‌ర్తిస్తున్నాను. నేనెవ‌రో ఎవ్వ‌రికీ తెలియ‌దు. కాని ఒక టీవీ వారు చేసిన ఇంట‌ర్వ్యూ బాగా వైర‌ల్ కావ‌లటంతో, నా జీవితంలో చాలా మార్ప‌లు వ‌చ్చాయి... అంటున్నారు. చాలామంది డ‌బ్బింగ్ క‌ళాకారుల‌లాగే, వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్టులు కూడా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌రు. ఎందుకంటే మా మాట‌ల‌కు మా ముఖాలు అవ‌స‌రం లేదు. క‌రోనా కార‌ణంగా భ‌య‌ప‌డుతున్న‌వారంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ప్ర‌భుత్వం విధి. ఆ విధిని త‌న గొంతు ద్వారా నిర్వ‌ర్తిస్తున్నానంటారు భ‌ల్లా. ఈ సందేశం ద్వారా అంద‌రికీ చేర‌వ‌య్యానంటారు ఈమె. త‌న‌కు వ‌చ్చిన గుర్తింపు త‌న‌కు చాలా ఆనందం క‌లిగిస్తోంద‌ని, కాని క‌రోనా వాయ‌స్ అనే టాగ్‌ని మాత్రం ఇష్ట‌ప‌డ‌లేక‌పోతున్నానంటారు భ‌ల్లా. ఇలా అవ‌కాశం వ‌చ్చింది... మార్చి నెల‌లో ఒక స్టూడియో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ నుంచి ఆ ఫోన్‌. అర్జెంటుగా ఒక మెసేజ్ రికార్డు చేసి పంపాలి అని చెప్పారు. అది 30 సెక‌న్ల సందేశం అని మా ప్రొడ్యూస‌ర్ చెప్పారు. ఈ సందేశాన్ని ఎంతో మృదువుగా, స్నేహ‌పూర్వ‌కంగా ఉండాలి అని కూడా మా ప్రొడ్యూస‌ర్ ఫోన్‌లో చెప్పారు. క‌రోనా వ్యాధి అప్ప‌డు ప్రారంభ‌ద‌శ‌లో ఉంది. అంద‌రినీ ఇంటి ద‌గ్గ‌రే క్షేమంగా ఉండ‌మ‌ని చెబుతున్నారు. అప్ప‌డు ... న‌మ‌స్కార్‌, క‌రోనా వైర‌స్ యా కోవిడ్ - 19 సే ఆజ్ పూరా దేశ్ ల‌డ్ ర‌హాహై... ద ఎంటైర్ కంట్రీ ఈజ్ ఫైటింగ్ అగైనెస్ట్ క‌రోనా వైర‌స్‌... స్టే హోమ్ స్టే సేఫ్‌... అంటూ ముగుస్తుంది. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇల్లు క‌ద‌ల‌వ‌ద్ద‌ని సందేశం పంపింది ప్ర‌భుత్వం. అలాగే బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ ధ‌రించ‌మ‌ని, చేతుల‌ను త‌ర‌చుగా స‌బ్బుతో క‌డుక్కోమ‌ని, భౌతిక దూరం పాటించ‌మ‌ని... వీటి వ‌ల్ల క‌రోనాను నివారించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. నాకు కూడా తెలియ‌దు.. హిందీ, ఇంగ్లీషు భాష‌ల‌లో రికార్డుఎ చేయ‌మ‌న్నారు. ఒక్కో ఆడియో చేయ‌టానికి నాలుగైదు టేకులు తీసుకున్నాను. పూర్తి చేసి పంపేశాను. ఇంక ఆ విష‌యం మ‌ర్చిపోయాను. రెండు రోజుల త‌ర‌వాత బంధువులు, స్నేహితులు నాకు ఫోన్ చేసి... మేం ఫోన్ చేయ‌గానే నీ గొంతు వ‌స్తోంది... అని చెప్ప‌టం మొద‌లుపెట్టారు అని సంతోషంగా చెబుతున్నారు భ‌ల్లా. ఈ రికార్డింగు చేసిన‌ప్పుడు, దీనిని ఎక్క‌డ ఉప‌యోగిస్తారో, ఎందుకు చేస్తున్నారో కూడా భ‌ల్లాకు తెలియ‌ద‌ట‌. టెలికాం సంస్థ‌ల‌ను, వారి కాల‌ర్ ట్యూన్లు తొల‌గించి, క‌రోనా వాయిస్‌ను కాల‌ర్‌ట్యూన్‌గా పెట్ట‌మ‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దానితో భ‌ల్లా గొంతు ప‌దేప‌దే వినిపించ‌టం మొద‌లైంది. ప్ర‌స్త‌తం మ‌రో రెండు సందేశాల‌ను భ‌ల్లా గొంతులో రికార్డు చేశారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు, మిగ‌తా ఫ్రంట్ లైన్ వారియ‌ర్లు ప్ర‌జ‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా పోరాటం రోగుల మీద కాదు, వ్యాధి నిర్మూల‌న కోసం మేం కృషి చేస్తున్నాం... అనే సందేశాన్ని అందించాలి. ఈ సందేశం చ‌దివేట‌ప్పుడు నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. నేను ఆ సందేశాన్ని కూడా ఎంతో అందంగా, అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకునేలా చ‌దివాను. బాక్స్‌ నాది నేనే... నేను ఎవ‌రికి ఫోన్ చేసినా, ముందు 30 సెక‌న్ల పాటు నా గొంతు నేను విన‌టం స‌ర‌దాగా అనిపిస్తుంది. చేతులు క‌డుక్కో, మాస్కు ధ‌రించు, చేతుల‌ను శానిటైజ్ చేసుకో అంటూ నాకు నేనే చెప్పుకోవ‌టం భ‌లేగా అనిపిస్తుంది. ప్ర‌తివారూ భ‌యం నుంచి సాధార‌ణ స్థితిలోకి రావ‌టానికి తియ్య‌టి మాత్ర చాలా అవ‌స‌రం. అటువంటి తియ్య‌టి మాత్ర‌ను నా గొంతు ద్వారా అంద‌రికీ అందించే అవ‌కాశం రావ‌టం నిజంగా నా అదృష్ట‌మే. జ‌స్లీన్ భ‌ల్లా

Thursday, June 4, 2020

ఇంటి భోజనం పెట్టాలి..

టెక్నాలజీని ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. చెడు జరుగుతోంది కదా అనుకుని, టెక్నాలజీ వాడకం మానేస్తే, మంచి కూడా జరగదు. ఇటీవల టిక్‌టాక్‌ వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ‘టిక్‌టాక్‌ కేవలం వినోదానికే అనుకుంటే పొరపాటే’ అంటున్నారు పంజాబ్‌ పోలీస్‌ అజీబ్‌ సింగ్‌. తెలంగాణకు చెందిన ఆర్‌ వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో మార్చి నెలలో జరిగిన సంభాషణ టిక్‌టాక్‌ను అజిబ్‌ సింగ్‌ షేర్‌ చేశారు. కరోనా కారణంగా దురదృష్టం వెంటాడుతున్నవారికి ఎంతో కొంత సహాయం చేయమంటూ ఈ వీడియో షేర్‌ చేశారు. కాని ఇది అతడి జీవితాన్నే మార్చేసింది. రెండు సంవత్సరాల క్రితం కుటుంబానికి దూరమయిన వెంకటేశ్వర్లుకి వినలేడు, మాట్లాడలేడు. 2018లో వెంకటేశ్వర్లు అనుకోని కారణాల వల్ల లూథియానాలో ఉండిపోయాడు. అజిబ్‌ సింగ్‌ వీడియో షేర్‌ చేయటంతో, వెంకటే శ్వర్లు స్నేహితుడు ఒకరు గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పంజాబ్‌ పోలీసులను సంప్రదించారు. అలా ఆ టిక్‌టాక్‌ వీడియో రెండు సంవత్సరాల క్రితం విడిపోయిన కుటుంబాన్ని ఒక్కటి చేసింది. అజీబ్‌ సింగ్, లూథియానాలోని ఒక ఫ్లైఓవర్‌ కింద, వెంకటేశ్వర్లుకి అన్నం పెట్టేవాడు. మాటలురాని వెంకటేశ్వర్లు తన చేతుల చేతలతోనే పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘మా నాన్నను చూడగానే ఆనందంతో నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి’ అన్నారు వెంకటేశ్వర్లు కుమారుడు ఆర్‌. పెద్దిరాజు. ‘2018లో కూలి పని కోసం ఒక ట్రక్‌ ఎక్కాడు మా నాయన. అందులోనే నిద్రపోయాడు. ఆ ట్రక్‌ డ్రైవర్‌ మార్గ మధ్యంలో దింపేశాడు. కొత్త ప్రదేశం కావటంతో ఏంచేయాలో అర్థం కాలేదుట మా నాన్నకి.. మరో ట్రక్‌ డ్రైవర్‌ని బతిమాలి ఆ ట్రక్‌ ఎక్కాడట. అతడు లూథియానాలో వదిలేశాడట. తెలంగాణ పోలీసుల ద్వారా మా నాన్న కోసం గాలించినా, ప్రయత్నం లేకపోయింది. ఇప్పుడు ఈ పోలీసు షేర్‌ చేసిన వీడియోతో నాయన గురించి తెలుసుకోగలిగాం’’ అంటున్న పెద్దిరాజు,. ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ అనుమతితో లూథియానా చేరుకుని, తండ్రిని తీసుకుని క్షేమంగా స్వగ్రామం చేరుకున్నాడు. ‘‘మా నాన్నకు ఇంటి భోజనం తినిపించాలి’ అంటూ బరువెక్కిన గుండెతో చెబుతున్నాడు పెద్దిరాజు. –––––––––––––––––––––––––––––––

<అమ్మా! నాతో ఆడవా!

రైల్వే స్టేషన్‌లోని ఆ దృశ్యం చూసినవారందరికీ కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. గుండె తడికాని వారు లేరు. మనసు చెదరని వారు లేరు. బీహార్‌ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో కనిపించింది ఈ దృశ్యం. ఒక చంటిపిల్లవాడు తల్లి శవం మీద కప్పిన దుప్పటి తీస్తూ, అందులో తన తలను ఉంచుతూ అమ్మతో దోబూచులాడటం మొదలుపెట్టాడు. అది చూసిన వారందరికీ ఆ పసిపిల్లవాడు అమాయకంగా ఆడుతున్నాడని మూగగా రోదించారు. రెండు సంవత్సరాల పసిపిల్లవాడికి తల్లి ఇక నిద్ర నుంచి లేవదని, తనతో దోబూచులాట ఆడదని తెలియదు. నాలుగైదు సార్లు అలా దుప్పటి లాగితే లేచి తనతో ఆడుతుందనే అనుకుంటున్నాడేమో. అమాయకంగా లాగుతూనే ఉన్నాడు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. కరోనా లాక్‌డౌన్‌ తరవాత బీహార్‌కు వచ్చిన వలస కార్మికులలో 23 సంవత్సరాల ఆ తల్లి మరణించింది. ఆ విషయం తెలియని పిల్లవాడు, తల్లి మీద కప్పిన దుప్పటితో ఆడుకోవటం చూసి, ఆ పసిబాలుడి భవిష్యత్తు ఏమిటో అర్థం కాక, అచేతనంగా నిలబడిపోయారు అక్కడివారంతా. తల్లి ఎంతసేపటికీ లేచి తనతో ఆడకపోవటం వల్ల, ఆ పిల్లవాడు గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఎండ, ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా ఆ తల్లి చనిపోయింది. 23 సంవత్సరాల ఆ యువతి గుజరాత్‌ నుంచి ఆదివారం నాడు ప్రత్యేక రైలులో బయలుదేరింది. సోమవారం నాడు బీహార్‌ ముజఫర్‌పూర్‌ స్టేషన్‌లో దిగింది. ప్రయాణంలో తగినంత ఆహారం, మంచినీరు అందుబాటులో లేకపోవటం వల్ల, ఆమెకు అనారోగ్యం చేసింది. ముజఫర్‌పూర్‌లో రైలు దిగుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ పసిబిడ్డకు తల్లి లేని లోటును ఎవరు తీర్చగలరు. లాక్‌డౌ¯Œ కారణంగా కూలీలలకు పనులు పోయాయి. వలస కార్మికులంతా వారి వారి గ్రామాలకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ప్రయాణ సాధనాలు లేకపోవటం చాలామంది కాలినడకనే ప్రయాణం ప్రారంభించారు. చాలామంది కార్మికులు రోడ్డు ప్రమాదాలు, ఆకలి, అలసట వంటి వాటితో మరణించారు. ఎలాగైనా ఇల్లు చేరటమే వారి లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రాణాలు కోల్పోతారని వారు భావించలేదేమో. ఈ తల్లి కూడా ఆహారం, నీరు లభ్యం కాక తాను మరణిస్తే, తన బిడ్డకు దిక్కెవరు అని ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఆ పసి బిడ్డకు దిక్కెవరు. రైళ్లు ఎక్కటం కోసం పెద్దపెద్ద క్యూలలో నిలబడటం, టికెట్ల కోసం నిరీక్షించటం, స్క్రీనింగ్‌ కోసం వేచి ఉండటం... వీటి వల్ల వలస కార్మికులు విలువైన, తిరిగిరాని వారి జీవితాలను కోల్పోతున్నారు. ఇటువంటి వారు ఇంకెంతమందో!!!