Thursday, June 18, 2020

నాన్నా! నీకు మేమిచ్చే బ‌హుమ‌తి


నాన్నా! 
ఇలా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు స‌మాధానం చెప్ప‌వ‌ని మాకు తెలుసు.అయినా నిన్ను పిల‌వ‌కుండా ఎలా ఉండ‌గ‌లం నాన్నా! నీ ర‌క్తం పంచి మాకు జ‌న్మ‌నిచ్చావు. మా ఇద్ద‌రినీ రెండు క‌ళ్ల‌లా చూసుకుంటూ, కంటిపాప‌ల్లా కాపాడుతున్నావు. 
ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు కాపాడ‌తారు నాన్నా...
అని నిన్ను మేం ప్ర‌శ్నించం. నీ ర‌క్తాన్ని భ‌ర‌త‌మాత‌కు పంచ‌టం కోస‌మే క‌దా నువ్వు సైన్యంలోకి వెళ్లావు.
చైనా వారితో వీరోచితంగా పోరాడావు.
ర‌క్తం చిందించావు.
భ‌ర‌త‌మాత ఒడిలోకి చేరిపోయావు.
మేం ... నాన్నా! అని పిలిచినా ప‌ల‌క‌ని నువ్వు, నిన్ను నోరారా భ‌ర‌త‌మాత‌, నాన్నా! నా కోసం పోరాడావా, నా ద‌గ్గ‌ర‌కు రా... అని పిల‌వ‌గానే ఆ త‌ల్లి ఒడి చేరావు. 











నువ్వు స్వార్థ‌ప‌రుడివి నాన్నా. నీ ర‌క్తంలో దేశ‌భ‌క్తి అనే స్వార్థం నిండి ఉంది.
ఇంత చిన్న పిల్ల‌ల్ని మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి అక్క‌డ‌కు ఇంత తొంద‌ర‌గా వెళ్లిపోతావా.
రోజూ మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఎత్తుకుని ఆడిస్తారు..
మాకు బొమ్మ‌లు, చాకొలేట్లు, కొత్త బ‌ట్ట‌లు...
అన్నీ ఎవ‌రు తెస్తారు.
మేం ఏడిస్తే, మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఓదారుస్తారు..
ఇటువంటి మాట‌లు నిన్ను అడిగితే మేం ఒక వీర‌జ‌వాను పిల్ల‌లం ఎలా అవుతాం నాన్నా!
ఇవి ఎవ‌రిని అడిగినా తెస్తారు.
కాని ఎవ్వ‌రూ ఇవ్వ‌లేనిది, నువ్వు మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగేది స్వ‌చ్ఛ‌మైన తండ్రి ప్రేమ‌.
నువ్వు దేశం కోసం మ‌మ్మ‌ల్ని ఇక్క‌డ విడిచి బోర్డ‌ర్‌కి వెళ్లినా, రోజూ నిన్ను త‌ల‌చుకుంటూ...
మా నాన్న‌ను చూసి, భార‌త‌దేశం గ‌ర్విస్తోంది..
అనుకుంటున్నాం.



నీ గురించే కాదు నాన్నా, నీలాగే ఎంతోమంది దేశం కోసం ర‌క్తం ధార‌పోశారు. 
వాళ్ల పిల్ల‌లు కూడా మాలాగే అనుకుంటూ ఉంటారు.
దేశ‌భ‌క్తుడి పిల్ల‌లుగా పుట్టే అదృష్టం ఎంత‌మందికి ద‌క్కుతుంది నాన్నా.
మాలాంటి కొంద‌రికి మాత్ర‌మే అందే ఆనందం ఇది.
ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ నువ్వే ఉన్నావు.
అంద‌రూ నిన్ను చూస్తున్నారు.
నీ గురించే మాట్లాడుకుంటున్నారు. 
క‌ల్న‌ల్ సంతోష్ పిల్ల‌లు అనే మ‌ర‌పురాని కానుక మాకు ఇచ్చావు నాన్నా.
ఇంత‌కంటె మాకు వేరే ఏ బ‌హుమ‌తీ అక్క‌ర్లేదు.
నిజానికి ఎప్పుడూ మాకే బ‌హుమ‌తులు ఇచ్చే నువ్వు, ఇప్పుడు దేశానికి పెద్ద బ‌హుమ‌తి ఇచ్చావు.
నాలుగు రోజుల క్రితం వ‌ర‌కు మా ఇద్ద‌రి ఆలోచ‌న వేరేగా ఉంది. 
జూన్ 21న ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా నీకు ఎన్నో బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని మేమిద్ద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు.
నీకు కొన్న బ‌హుమ‌తులు నీకే ఇస్తాం. 
నువ్వు అమ‌రుడివి నాన్నా.
నువ్వు మాతో ఎప్పుడూ దేశం గురించి మాట్లాడుతూనే ఉంటావు నాన్నా.
మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి ఏంటో తెలుసా.
మేం కూడా నీలాగే భార‌త సైన్యంలో చేరి వీరోచితంగా పోరాటం చేసి, భ‌ర‌త‌మాత‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం.
ఇదే మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి నాన్నా.
ఈ బ‌హుమ‌తి నీకు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం.
జైహింద్ నాన్నా
(సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌)
- వైజ‌యంతి పురాణ‌పండ‌

No comments:

Post a Comment