Thursday, June 4, 2020

ఇంటి భోజనం పెట్టాలి..

టెక్నాలజీని ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. చెడు జరుగుతోంది కదా అనుకుని, టెక్నాలజీ వాడకం మానేస్తే, మంచి కూడా జరగదు. ఇటీవల టిక్‌టాక్‌ వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ‘టిక్‌టాక్‌ కేవలం వినోదానికే అనుకుంటే పొరపాటే’ అంటున్నారు పంజాబ్‌ పోలీస్‌ అజీబ్‌ సింగ్‌. తెలంగాణకు చెందిన ఆర్‌ వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో మార్చి నెలలో జరిగిన సంభాషణ టిక్‌టాక్‌ను అజిబ్‌ సింగ్‌ షేర్‌ చేశారు. కరోనా కారణంగా దురదృష్టం వెంటాడుతున్నవారికి ఎంతో కొంత సహాయం చేయమంటూ ఈ వీడియో షేర్‌ చేశారు. కాని ఇది అతడి జీవితాన్నే మార్చేసింది. రెండు సంవత్సరాల క్రితం కుటుంబానికి దూరమయిన వెంకటేశ్వర్లుకి వినలేడు, మాట్లాడలేడు. 2018లో వెంకటేశ్వర్లు అనుకోని కారణాల వల్ల లూథియానాలో ఉండిపోయాడు. అజిబ్‌ సింగ్‌ వీడియో షేర్‌ చేయటంతో, వెంకటే శ్వర్లు స్నేహితుడు ఒకరు గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పంజాబ్‌ పోలీసులను సంప్రదించారు. అలా ఆ టిక్‌టాక్‌ వీడియో రెండు సంవత్సరాల క్రితం విడిపోయిన కుటుంబాన్ని ఒక్కటి చేసింది. అజీబ్‌ సింగ్, లూథియానాలోని ఒక ఫ్లైఓవర్‌ కింద, వెంకటేశ్వర్లుకి అన్నం పెట్టేవాడు. మాటలురాని వెంకటేశ్వర్లు తన చేతుల చేతలతోనే పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘‘మా నాన్నను చూడగానే ఆనందంతో నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి’ అన్నారు వెంకటేశ్వర్లు కుమారుడు ఆర్‌. పెద్దిరాజు. ‘2018లో కూలి పని కోసం ఒక ట్రక్‌ ఎక్కాడు మా నాయన. అందులోనే నిద్రపోయాడు. ఆ ట్రక్‌ డ్రైవర్‌ మార్గ మధ్యంలో దింపేశాడు. కొత్త ప్రదేశం కావటంతో ఏంచేయాలో అర్థం కాలేదుట మా నాన్నకి.. మరో ట్రక్‌ డ్రైవర్‌ని బతిమాలి ఆ ట్రక్‌ ఎక్కాడట. అతడు లూథియానాలో వదిలేశాడట. తెలంగాణ పోలీసుల ద్వారా మా నాన్న కోసం గాలించినా, ప్రయత్నం లేకపోయింది. ఇప్పుడు ఈ పోలీసు షేర్‌ చేసిన వీడియోతో నాయన గురించి తెలుసుకోగలిగాం’’ అంటున్న పెద్దిరాజు,. ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ అనుమతితో లూథియానా చేరుకుని, తండ్రిని తీసుకుని క్షేమంగా స్వగ్రామం చేరుకున్నాడు. ‘‘మా నాన్నకు ఇంటి భోజనం తినిపించాలి’ అంటూ బరువెక్కిన గుండెతో చెబుతున్నాడు పెద్దిరాజు. –––––––––––––––––––––––––––––––

No comments:

Post a Comment