Thursday, June 4, 2020

Pappan Singh

వారు నా వారు.. కరోనా కారణంగా కూలి పనులు లేక ఎవరి గ్రామాలకు వారు తరలి పోతున్నారు వలస కార్మికులు. సైకిల్‌ మీద, కాలి నడకన, ఏదో ఒక వాహనం... ఎలా కుదిరితే అలా, వేల కొలదీ కిలో మీటర్లు ప్రయాణించి... స్వస్థలాలకు చేరుకుంటున్నారు వీరంతా. కాని ఈ పది మంది కార్మికులు మాత్రం చల్లగా విమానంలో ప్రయాణించి, గమ్యం చేరుకున్నారు. పాపన్‌ సింగ్‌ అనే పుట్టగొడుగుల వ్యాపారి ఢిల్లీలోని తిగిపూర్‌ గ్రామంలో ఉంటున్నారు. తన దగ్గర పనిచేస్తున్న బీహారీ వలస కూలీల కోసం అక్షరాలా 70000 రూపాయలు వెచ్చించి, విమానంలో వారి ఇళ్లకు సంతోషంగా సాగనంపారు. ఇంతేకాదు, రెండు నెలలుగా ఈ పదిమందికీ కూడు, గూడు కూడా ఉచితంగా ఏర్పాటుచేశారు. లఖ్విందర్‌ రామ్‌ సుమారు రెండు దశాబ్దాలుగా పాపన్‌ సింగ్‌ దగ్గర పనిచేస్తున్నాడు. ఇంతకాలం తనకు నమ్మినబంటుగా పనిచేస్తున్న ఆయనను ఆరోగ్యంగా ఇంటికి పంపాలనుకున్నారు పాపన్‌ సింగ్‌. రామ్‌తో పాటు మొత్తం పదిమందినీ తన సొంత ఖర్చులతో పంపారు. మొట్టమొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందంటున్నాడు లఖ్విందర్‌ రామ్‌. ‘‘నా జీవితంలో నేను విమానం ఎక్కుతాను అనుకోలేదు. నా సంతోషాన్ని వ్యక్తపరచటానికి నా దగ్గర మాటలు లేవు. విమానం ఎక్కే ముందు కొద్దిగా భయం వేసింది’’ అన్నారు తన కుమారుడితో కలిసి ప్రయాణించిన లఖ్విందర్‌ సింగ్‌. ‘‘నా దగ్గర ఇంతకాలం నమ్మకంగా పనిచేస్తున్న వీరిని వారి గ్రామాలకు క్షేమంగా పంపలేకపోతే, జీవితాంతం నేను బాధ పడుతుండాలి. అందుకనే వారిని విమానంలో పంపటానికి నిశ్చయించుకున్నాను. వారు నా కుటుంబీకుల వంటి వారు. వారు విమానం దిగి, క్షేమంగా ఇల్లు చేరామని చెప్పేవరకూ నాకు భయంభయంగానే ఉంది’ అన్నారు పాపన్‌ సింగ్‌. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఈ విమానం బయలుదేరింది. వారందరికీ కరోనా స్క్రీనింగ్‌ పూర్తి చేసి, అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్లు కూడా అందచేశారు. ఈ కూలీల వల్లే పాపన్‌ సింగ్‌ ఏటా 12 లక్షలు సంపాదిస్తున్నానని, వారిని ప్రేమగా చూడటం తన బాధ్యత అంటున్న పాపన్‌ సింగ్‌ వంటి వారికి చేతులెత్తి నమస్కరించవలసిందే. ––––––––––––––––––––––––––––––

No comments:

Post a Comment