Thursday, June 4, 2020

చిన్నప్పుడే చెప్పండి

ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు పన్నెండు సంవత్సరాలు దాటిన తరవాత పుష్పవతి అవుతారు. ఇది సృష్టి ధర్మం. సర్వసాధారణం. అయితే భారతదేశంలో రజస్వల అయిన మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉంటోందంటున్నారు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ నీరజ్‌ గేరా. ప్రతి నెల పీరియడ్స్‌లో ఉన్నవారిని అపవిత్రులుగా చూడటం ఎక్కువ. ఆ సమయంలో వారిని పుణ్యకార్యాలు, పూజలు, వ్రతాలు జరిగే ప్రదేశాలకు రానీయరు. దేవాలయాలలోకి ప్రవేశం నిషేధం. కొన్ని ప్రాంతాలలో వారిని వంట గదిలోకి రానియ్యకుండా దూరంగా ఉంచుతారు. వరల్డ్‌ మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే (మే 28) సందర్భంగా, నీరజ్‌ గేరా ‘సేక్రెడ్‌ స్టెయిన్స్‌’ పేరుతో కొన్ని ఫొటోలు తీసి ప్రదర్శించారు. సర్వసాధారణంగా ఆడ పిల్లలకు రజస్వల గురించిన అవగాహన ఉండదు. 71 శాతం మందికి వారు పుష్పవతి అయ్యేవరకు అదేమిటో కూడా తెలియదు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఈ విషయంలో అవగాహన కల్పించటం లేదు. అందువల్ల ఆడపిల్లల్లో భయం, ఆందోళన ఎక్కువగా ఉంటోంది. ఇదే కాదు, ఆ సమయంలో ఆడపిల్లలకు నాప్‌కిన్స్‌ ఉపయోగించటం మీద కూడా అవగాహం ఉండటం లేదు. ఆ సమయంలో వచ్చే నొప్పి కారణంగా మానసికంగా కుంగిపోతున్నారు. ప్రస ఈ సమయంలో పరిశుభ్రంగా ఉండటానికి వినియోగించే వస్తువులు అవసరాలే కాని, విలాసం కాదని యాక్టివిస్టులు చేసిన ఉద్యమం కారణంగా నాప్‌కిన్స్‌ మీద వేసిన 12 శాతం పన్నును తీసివేసింది భారత ప్రభుత్వం. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని 355 మిలియన్ల మహిళలల్లో కేవలం 36 శాతం మంది మాత్రమే శానిటరీ నాప్‌కిన్లు ఉపయోగిస్తున్నారు. మిగిలినవారంతా పాత వస్త్రాలు, పొట్టు, బూడిద, ఆకులు, మట్టి వంటి ప్రమాదకరమైన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా మహిళల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో, పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రంగా ఉండేటందుకు ఉపయోగించే వస్తువుల ఉత్పత్తి తగ్గిపోయింది. అందువల్ల నాప్‌కిన్స్‌ అందుబాటులో ఉండట్లేదు. మరొక అధ్యయనం ప్రకారం 21 సంవత్సరాల కంటె తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలు న్యూస్‌పేపర్లు, టాయిలెట్‌ పేపర్లు, సాక్సు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తు్తతం సోషల్‌ మీడియాను అన్ని విషయాలకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చాలామంది ఆడపిల్లలు వారు పీరియడ్‌స సమయంలో పడుతున్న బాధలను అందులో పంచుకోవటం వల్ల, ‘ఇది అందరికీ సహజమే’ అని తెలుసుకుని, కొంతవరకు భయాన్ని పొగొట్టుకుంటున్నారు. అయితే ఇటువంటి విషయాలను పంచుకున్న వారికి ట్రోల్‌ చేస్తున్నారు. అటువంటి వారికి ఆడపిల్లలు పడే బాధ అర్థం కాదు. సోషల్‌ మీడియా చాలా పవర్‌ఫుల్‌ మీడియా కనుక దాని ద్వారానే అందరికీ సమాచారం అతి త్వరగా చేరుతుంది.. అంటున్నారు నీరజ్‌ గేరా. భారతదేశంలో చాలామంది పీరియడ్స్‌ సమయంలో, నాప్‌కిన్స్‌ కొనే వాడే ఆర్థిక స్తోమతు కూడా లేదు. ఆర్థిక సహాయం చేయమని తల్లిదండ్రులు అడగలేకపోతారు. వారికి వచ్చే చాలీచాలని జీతాలతో కడుపు నింపుకోవటమే కష్టం. ఇక నాప్‌కిన్స్‌ ఎలా కొనగలరు అంటున్నారు నీరజ్‌ గేరా. ప్రతి సంవత్సరం 23 మిలియన్ల మంది ఆడపిల్లలు పీరియడ్స్‌ కారణంగా చదువు మానేస్తున్నారు. ఇందుకు ముఖ్యకారణం పరిశుభ్రమైన టాయిలెట్స్‌ లేకపోవటం, నాప్‌కిన్స్‌ లభ్యం కాకపోవటం మాత్రమే కాదు, బట్టల మీద మరకలు పడితే, అది చూసి స్నేహితులు గేలి చేస్తారనేది కూడా ఒక కారణం. చాలామంది మహిళలు పీరియడ్స్‌ను అశుభ్రంగా భావిస్తారు. వారికి ఎన్నో నిషేధాలు విధిస్తారు. పీరియడ్స్‌ అనేది కేవలం ఒక బయలాజికల్‌ ప్రాసెస్‌ మాత్రమే అని తెలుసుకోవాలి. వారిని ఎప్పటిలాగే చూడాలి అంటున్నారు నీరజ్‌ గేరా.

No comments:

Post a Comment