Friday, June 26, 2020

ఇంట్లోనే ఉంటాం.. ఇంటి కోసం సంపాదిస్తాం...

ఒక చేత్తో పిల్లల్ని ఎత్తుకుంటూ, మరో చేత్తో వంట చేస్తున్నారు. మూడో చేత్తో వ్యాపారం చేస్తున్నారు. ఈ మూడో చెయ్యి  ఎక్కడ నుంచి వచ్చింది.
అదే పిల్లల నుంచి వచ్చింది.
తమ పిల్లల కోసం చేసే ఆలోచన నుంచే మూడో చెయ్యి వచ్చింది. 
పదిమంది మామ్‌ఎంట్ర్‌ప్రెన్యూర్ల గురించి వాళ్ల మూడో చేయి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
వీరంతా పిల్లల్ని పెంచుతూ లక్షలు సంపాదిస్తున్నారు...
ఒక తల్లి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతుంది. చాలా కష్టం. చాలా ఏళ్లు ఎంతో ఓరిమిని సాధించాలి. రోజూ రకరకాల పనులు చేస్తుండాలి. ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ముందుకు వెళ్తేనే ఒక స్త్రీ మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతుంది.
మామ్‌ ప్రెన్యూర్స్‌ గురించి గూగుల్‌లో వెతికితే కొందరి పేర్లు వస్తాయి. వాళ్లు ఈ స్థాయికి ఎదగడానికి ఎంత కృషి చేశారో వాళ్ల గురించి చదివితే అర్థం అవుతుంది. ఇక్కడ పదిమంది బహుముఖ ప్రతిభ కలిగిన పది మంది మామ్‌ప్రెన్యూర్స్‌ గురించి ప్రస్తావించుకుందాం.
వీరిలో చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు.
1. గుంజాన్‌ లూమ్‌బా బబ్బర్‌ – శబరి
సంప్రదాయ దుస్తులు, ఇంటి అలంకరణకు ఉపకరించే వస్తువుల గురించి ఆలోచిస్తున్నారా, అయితే, వెంటనే శబరి వైపు ఒక్కసారి చూడండి. మూడు సంవత్సరాల క్రితం గుంజాన్‌ లూంబా బబ్బర్‌ ఇటువంటి వాటికి నాంది పలికారు. తన వ్యాపారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రారంభించారు. ‘‘నా వ్యాపారం చాలావరకు ఒకరి నుంచి ఒకరికి చేరడం ద్వారానే జరుగుతోంది. నా వ్యాపారం కోసమంటూ నాకేమీ ఒక వెబ్‌సైట్‌ కూడా లేదు’’ అంటారు గుంజాన్‌. తన వ్యాపారంలో ఇంచుమించు 70 శాతం వాట్సాప్‌ ద్వారానే నడుస్తోందట. మిగిలిన 30 శాతం ఫేస్‌బుక్‌ ద్వారా వెళ్తోంది అంటున్నారు గుంజాన్‌.

2. అభిలాష జైన్‌ – మార్వాడీ ఖానా
ఫేస్‌ బుక్‌ ద్వారా తన సొంత క్యాటరింగ్‌ బిజినెస్‌ ‘మార్వాడీ ఖానా’ పేరున ప్రారంభించారు లభిలాష. ఇందుకోసం ఒకే ఒక్క వాక్యాన్ని రాశారు అభిలాష.. ‘నేను రాజస్థానీ సంప్రదాయ వంటకం దాల్‌ బాటీ – చుర్మా ప్రతి ఆదివారం తయారుచేస్తున్నాను’ అని. ఆమెకు వెంటనే 40 ఆర్డర్లు వచ్చాయి. రోజూ ఉండే భోజనంతో పాటు, సంప్రదాయ స్నాక్స్, స్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, సమావేశాలు, పెళ్లిళ్ల వంటి సందర్భాలలో ఇవి సప్లయి చేస్తున్నారు. ఒంటరిగా ప్రారంభించిన అభిలాష, ఆర్డర్లు పెరగటంతో నలుగురు కలిసి ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. సొంత ఇంటి నుంచి తన వ్యాపారాన్ని 1000 అడుగుల కిచెన్‌లోకి అద్దె తీసుకుని మార్చుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఒంటరిగా వ్యాపారంలో విజయం సాధించగలరనడానికి నిదర్శనం అభిలాష.

3. చిను కాలా – రూబన్స్‌
ఈమె జీవితం పూలబాట కాదు. 15వ ఏటే ఇంటి నుంచి గెంటివేయబడింది. తన చేతిలో ఉన్న 300 రూపాయలతో జీవితం ప్రారంభించింది. పట్టుదలతో యాక్సెసరీస్‌ కంపెనీ ప్రారంభించింది. అంతకుముందు ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నించింది. ఇంటింటికీ వెళ్లి సేల్స్‌ గర్ట్‌గా కూడా పనిచేశారు చిను కాలా.  అన్నీ చూసిన తరవాత, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్థం అయ్యింది. అంతే నాలుగు సంవత్సరాల క్రితం రూబన్స్‌ ప్రారంభించి, ఇప్పుడు 56 లక్షల ఆదాయం సంపాదించుకునే స్థాయికి ఎదిగారు. మరుసటి సంవత్సరమే ఈ ఆదాయం 3.5 కోట్లకు చేరుకుంది. కిందటి సంవత్సరం ఈ ఆదాయం 7.5 కోట్లకు చేరుకుంది.

4. నవదీప్‌ కౌర్‌ – ఆఘో
మా అమ్మాయికి మంచి బట్టలు ఇవ్వాలనే ఆలోచన నుంచి మామ్‌ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు నవదీప్‌ కౌర్‌. ‘మా అమ్మాయికి సింథటిక్‌ బట్టలు వేస్తుంటే, ఒళ్లంతా పొక్కులు, దురదలు రావటం మొదలైంది. అందువల్ల సహజ రంగులతో తయారైన నూలు వస్త్రాలు కొనటం ప్రారంభించాను. మధ్యమధ్యలో మాకు కావలసినవి దొరకకపోవటంతో, నేను స్వయంగా తయారుచేయాలని ఆలోచన చేశాను’ అంటున్న నవదీప్‌ కౌర్, స్వయంగా మార్కెట్‌లోకి ప్రవేశించారు. తను ప్రారంభించిన కంపెనీకి ‘అఘో’ అని పేరు పెట్టారు. ఈ పదానికి చంటిపిల్లలు నవ్వుతూ చేసే శబ్దం. ‘ఈ బట్టలు శరీరానికి హాయినిస్తాయి కనుక ఈ పేరే సరైనదని భావించాను’ అంటారు నవదీప్‌. ఈమె తయారుచేస్తున్న బట్టలు వేసుకున్న చంటిపిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. శరీరం కూడా మృదువుగా ఉంటోంది. నవదీప్‌ చేస్తున్న పని ద్వారా మరింత మంది తల్లులకు ఒక సందేశం పంపుతున్నారు. ‘ఇంటి నుంచి పని చేయండి తల్లులూ! నాకు ఇప్పుడు ఆర్డర్లు బాగా వస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉంటూ, ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాను. నేరుగా నేత కార్మికుల నుంచి క్లాత్‌ తీసుకువచ్చి, బట్టలు తయారుచేస్తున్నాను. ఇప్పుడు నా వల్ల కనీసం 500 మంది చేనేత కార్మికులు లాభం పొందుతున్నారు’ అంటూ ఆనందంగా చెబుతున్నారు ఈ మామ్‌ప్రెన్యూర్‌.

5. శృతి అజ్మేరా రెడ్డి – హ్యాపప్‌
పసి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కనీసం 95 శాతం కెమికల్స్‌తో నిండి ఉంటోందని ముఖ్యంగా అందులో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉండటం వల్ల, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని, తాను ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నారు. మార్కెట్‌లో దొరుకుతున్న పిల్లల ఆహార పదార్థాల మీద విస్తృతంగా పరిశోధన చేసి, రెండు సంవత్సరాల క్రితం హ్యాపప్‌ అనే స్టార్టప్‌ వారు అందచేస్తున్న పోషకాహార మిశ్రమాల గురించి తెలుసుకున్నారు. ఇందులో పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌... ఏవీ ఉండవు. ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు వీటిని ఇంటి దగ్గర చేసుకునేంత సమయం ఉండదు. అదేవిధంగా పెద్దవారికి కూడా పోషకాహారం అవసరం. అందుకే అన్ని వయసులవారికీ కావలసిన పోషకాలను ముఖ్యంగా పన్నెండు రకాల చిరుధాన్యాలను తయారుచేసి, అమ్ముతున్నారు శృతి అజ్మేరా రెడ్డి 

6. ఉప్మా కపూర్‌ – టీల్‌ అండ్‌ టెర్రా
ఉప్మాకపూర్‌ సింగిల్‌ మదర్‌. ఆమెకు తగినం ప్రోత్సాహం లభించలేదు. కాని తన కొడుకు నుంచి కావలసినంత శక్తి వచ్చింది. కొడుకు దాచుకున్న డబ్బులు తీసి, అమ్మకు ఇచ్చి, టీల్‌ అండ్‌ టెర్రా కంపెనీ పెట్టడానికి కారకుడయ్యాడు. స్నేహితుల సహకారంతో 7.5 లక్షల మూలధనంతో ఎంతో నమ్మకంతో కంపెనీ ప్రారంభించారు ఉప్మా కపూర్‌. కేవలం రెండు సంవత్సరాలలోనే ఆ కంపెనీ ఆదాయం 2.24 కోట్లకు చేరుకుంది. సంప్రదాయ ఆయుర్వేదం ఆధారంగా సహజ సౌందర్య సాధనాలు తయారుచేయంటం ప్రారంభించారు ఉప్మా కపూర్‌. ఇందులో ఉల్లి రసం, ఆముదంతో తయారైన తల నూనె కూడా ఉన్నాయి. 500 రూపాయల నుంచి ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. 

7. మోనివసా నార్కే – ఆర్‌యుఆర్‌ గ్రీన్‌లైఫ్‌
ఈ మామ్‌ఎంట్ర్‌ప్రెన్యూర కూడా తన కుమార్తె అవసరాల కోసం చేస్తున్న పరిశోధనతో, వ్యాపారవేత్తగా మారారు. ‘మా అమ్మాయికి తరచూ దగ్గు, ఫిట్స్‌ వస్తుండేది. నాకు చాలా దిగులుగా ఉండేది. మా పాపకు నాలుగేళ్ల వయసులో ఈ అనారోగ్యం మొదలైంది. నేను ఎటువంటి వైద్యం చేయించకూడదనుకునానను. సమస్యను నేను పరిష్కరించుకోవాలనుకున్నాను.’ అంటారు. ‘రెడ్యూసింగ్, రీయూజింగ్, రీసైక్లింగ్‌’ అనే లక్ష్యంతో  తన వ్యాపారం ప్రారంభించారు. ఇందులో 30 లక్షల మందికి ఈ విషయం మీద అవగాహన కల్పించి, వర్క్‌షాపులు ప్రారంభించారు. ఇప్పుడు మోనిషా ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు. 

8. ప్రియాంక దామ్‌ గంటూలీ – చిత్రన్‌
ప్రియాంక ఆన్‌లైన్‌ హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ చీరలు, యాక్సెసరీస్‌ మొబైల్‌ ఫోన్‌ ద్వారా అందచేస్తున్నారు. ఈ వ్యాపారం ఆర్కుట్‌ ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కాలక్షేపం కోసం ఈ పని ప్రారంభించారు. అదే ఆ తరవాత వ్యాపారంగా మారిపోయింది. వాట్సాప్‌ ద్వారా తన చీరల వ్యాపారం చక్కగా నడుపుతున్నారు. ‘‘ప్రతిరోజూ వ్యాపారం కోసం ఊళ్లు తిరగటం వల్ల బాగా అలసిపోయేదాన్ని. వాట్సాప్‌ వచ్చాక నా కష్టాలన్నీ గట్టెక్కాయి. కొత్త స్టాక్‌వచ్చినప్పుడల్లా ఆ ఫొటోలు మా వీవర్స్‌ నాకు వాట్సాప్‌ చేస్తారు. వాటిలో నుంచి నాకు కావలసినవి నేను ఎంచుకుంటాను. వాళ్లు నాకు కొరియర్‌ చేస్తారు. నేను వాళ్లకి వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను.. అంటారు.

9. సుమాన్‌ సూద్‌ – పచ్చళ్లు... 
62 సంవత్సరాల సుమన్‌ సూద్‌ ఢిల్లీలో ఉంటారు. ఆవిడక వంట, పచ్చళ్లు అంటే బాగా ఇష్టం. ఈ ఇష్టమే వ్యాపారంగా మారుతుందని ఆవిడ ఎన్నడూ అనుకోలేదు. ‘‘మా ఇంటికి ఇరుగుపొరుగు వారు ఏదో ఒక కారణంగా వస్తుండేవారు. వాళ్లు నా పచ్చళ్ల రుచి చూసి, వాళ్లకి ఆలివ్‌ ఆయిల్‌తో చేసిన పచ్చళ్లు కావాలని అడిగేవారు. కొందరేమో బాగా స్పైసీగా కావాలని అడగటం మొదలుపెట్టారు. ఐదు సంవత్సరాల క్రితం నేను మా అమ్మాయితో కలిసి ఈ వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నేను 60 రకాల పచ్చళ్లు అందరికీ అందచేస్తున్నాను. సుమారు 25 వేల కిలోల పచ్చడి చేస్తున్నాం. ఈ వ్యాపారం ద్వారా నెలకు కనీసం 50 వేల ఆదాయం వస్తోంది అంటున్నారు ఈమె. 

10. శిల్పి శర్మ బేడీ – ఇండీ ప్రాజెక్ట్‌ స్టోర్‌ (ఐపీయస్‌)
అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు, శరీరానికి హాయి కలిగించే వస్త్రాలు తయారుచేస్తున్నారు శిల్పి. నాలుగు సంవత్సరాల క్రితం తనకు పాప పుట్టినప్పుడు, పిల్లలకు సౌకర్యం కలిగించే సంప్రదాయ వస్త్రాలు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది. తన స్నేహితురాలు సత్య నాగరాజన్‌తో కలిసి వ్యాపారం ప్రారంభించారు. ‘‘మేం సొంతంగా వ్యాపారసంస్థ ప్రారంభించటం కంటె, ఇబ్బందుల్లో ఉన్న చేనేతవారిని బలోపేతం చేసి, మాకు కావలసినవి తయారుచేయించుకోవటం నయమనిపించింది. చిన్నచిన్న వారి నుంచి రకరకాల వస్త్రాలు కొనుగోలు చే సి, మాకు కావలసిన విధంగా డిజైన్‌ చేయించి, వస్త్రాలు తయారుచేస్తున్నాం’అంటున్నారు. 
-------------------------------------

No comments:

Post a Comment