Thursday, June 4, 2020

గుప్తా అండ్‌ డాటర్స్‌

గుప్తా అండ్‌ డాటర్స్‌.. గుప్తా అండ్‌ సన్స్‌ లాంటిదే గుప్తా అండ్‌ డాటర్స్‌. ‘‘నేను నా స్టోర్‌కి స్త్రీ సాధికారత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాను’’ అంటున్నారు మనోజ్‌ కుమార్‌ గుప్తా అనే పంజాబీ వ్యాపారవేత్త. చాలాకాలంగా వ్యాపారసంస్థల పేర్లలో సన్స్, బ్రదర్స్, ఫాదర్స్‌ అనే పదం కంపెనీ పేరు చివరన వచ్చి చేరటం తెలిసిందే. తరతరాలుగా ఈ విధంగా జరుగుతూనే ఉంది. పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోందనడానికి ఇదొక నిదర్శనం. ఈ సంకెళ్లను తెంచాలనుకున్నారు పంజాబ్‌ లూథియానాకు చెందిన మనోజ్‌ కుమార్‌ గుప్తా అనే వ్యాపారి. ఆయన ఆశయానికి అందరూ ముచ్చటపడుతున్నారు. అభినందిస్తున్నారు. ఒక సొంత ఫార్మసీ ప్రారంభించి, దానికి గుప్తా అండ్‌ డాటర్స్‌ అని పేరు పెట్టారు తన కూతురు అకాంశను అందులో భాగస్వామ్యం చేస్తూ. 54 సంవత్సరాల మనోజ్‌ కుమార్‌ గుప్తా 2017లో ఒక బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌గా వ్యాపార జీవితం ప్రారంభించారు. తన రెండో వెంచర్‌గా ఒక ఫార్మసీ ప్రారంభించాలనుకున్నారు. పేరు కోసం తర్జనభర్జన పడ్డారు. ‘‘ఏ పేరు పెట్టాలా అని విపరీతంగా ఆలోచన ప్రారంభించాను. మన దేశప్రధాని ‘బేటీ బచావ్, బేటీ పఢావ్‌’ నినాదం మనసులో స్ఫురించింది. అంతే, ఆ వ్యాపారానికి కూతురు పేరుమీదుగా ఉండేలా పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాను. అదే విషయాన్ని నా భార్య, పిల్లలతో పంచుకున్నాను. వారు సంతోషించారు. కొందరు నా ఆశయాన్ని విమర్శించినప్పటికీ, నేను నా భార్య మాటకు విలువ ఇచ్చాను. నా స్టోర్‌కి లింగ వివక్ష లేకుండా ఉండేలా స్త్రీ సాధికారతను చూపేలా పేరు పెట్టటానికే నిర్ణయించుకున్నాను’ అంటారు ఎంతో పట్టుదలగా ఉన్న మనోజ్‌ కుమార్‌ గుప్తా. అనుకున్న వెంటనే బోర్డు సిద్ధం చేశారు. కంపెనీకి తగిలించేశారు. అమన్‌ కశ్యప్‌ అనే మెడికల్‌ ప్రొఫెషనల్‌ ఈ బోర్డును తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ ట్వీట్‌కి వెంటనే ఆరువేల లైకులు, వేలకొలదీ ట్వీట్లు వచ్చాయి. చాలామంది ఈ ట్వీట్‌ను షేర్‌ చేశారు. గుప్తా సిల్లలు అకాంశ, రోషన్‌లు తమ తల్లిదండ్రుల నిర్ణయానికి ఎంతో గర్వపడుతున్నారు. ఎప్పుడూ ఉండే ‘అండ్‌ సన్స్‌’ కి భిన్నంగా ఆలోచించినందుకు సంతోషంగా ఉన్నారు. రోషన్‌ ఎంబిఏ, అకాంశ న్యాయశాస్త్రం చదువుతున్నారు. ‘‘మా చెల్లి అకాంశ కంటె నేను పెద్దవాడిని అయినా కానీ మా చిన్నతనం నుంచి మా ఇద్దరినీ స్నేహంగా ఉండమని చెప్పేవారు నాన్నగారు’’ అంటారు రోషన్‌. ఈ కంపెనీ ఇప్పుడు పేదవారికి ఉచితంగా మందులు అందచేస్తోంది. ‘‘లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా కొన్న ధరకే మందులు అందచేస్తున్నాం. కోవిడ్‌ 19 మహమ్మారితో అందరూ ఆదాయం కోల్పోయారు. వారు మందులకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయలేకపోతున్నారు. అందువల్ల వారి కోసం తక్కువ ధరలకే అందిస్తున్నాం. అంటున్నారు రోషన్‌.

No comments:

Post a Comment