Thursday, June 4, 2020

<అమ్మా! నాతో ఆడవా!

రైల్వే స్టేషన్‌లోని ఆ దృశ్యం చూసినవారందరికీ కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. గుండె తడికాని వారు లేరు. మనసు చెదరని వారు లేరు. బీహార్‌ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో కనిపించింది ఈ దృశ్యం. ఒక చంటిపిల్లవాడు తల్లి శవం మీద కప్పిన దుప్పటి తీస్తూ, అందులో తన తలను ఉంచుతూ అమ్మతో దోబూచులాడటం మొదలుపెట్టాడు. అది చూసిన వారందరికీ ఆ పసిపిల్లవాడు అమాయకంగా ఆడుతున్నాడని మూగగా రోదించారు. రెండు సంవత్సరాల పసిపిల్లవాడికి తల్లి ఇక నిద్ర నుంచి లేవదని, తనతో దోబూచులాట ఆడదని తెలియదు. నాలుగైదు సార్లు అలా దుప్పటి లాగితే లేచి తనతో ఆడుతుందనే అనుకుంటున్నాడేమో. అమాయకంగా లాగుతూనే ఉన్నాడు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. కరోనా లాక్‌డౌన్‌ తరవాత బీహార్‌కు వచ్చిన వలస కార్మికులలో 23 సంవత్సరాల ఆ తల్లి మరణించింది. ఆ విషయం తెలియని పిల్లవాడు, తల్లి మీద కప్పిన దుప్పటితో ఆడుకోవటం చూసి, ఆ పసిబాలుడి భవిష్యత్తు ఏమిటో అర్థం కాక, అచేతనంగా నిలబడిపోయారు అక్కడివారంతా. తల్లి ఎంతసేపటికీ లేచి తనతో ఆడకపోవటం వల్ల, ఆ పిల్లవాడు గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఎండ, ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా ఆ తల్లి చనిపోయింది. 23 సంవత్సరాల ఆ యువతి గుజరాత్‌ నుంచి ఆదివారం నాడు ప్రత్యేక రైలులో బయలుదేరింది. సోమవారం నాడు బీహార్‌ ముజఫర్‌పూర్‌ స్టేషన్‌లో దిగింది. ప్రయాణంలో తగినంత ఆహారం, మంచినీరు అందుబాటులో లేకపోవటం వల్ల, ఆమెకు అనారోగ్యం చేసింది. ముజఫర్‌పూర్‌లో రైలు దిగుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ పసిబిడ్డకు తల్లి లేని లోటును ఎవరు తీర్చగలరు. లాక్‌డౌ¯Œ కారణంగా కూలీలలకు పనులు పోయాయి. వలస కార్మికులంతా వారి వారి గ్రామాలకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ప్రయాణ సాధనాలు లేకపోవటం చాలామంది కాలినడకనే ప్రయాణం ప్రారంభించారు. చాలామంది కార్మికులు రోడ్డు ప్రమాదాలు, ఆకలి, అలసట వంటి వాటితో మరణించారు. ఎలాగైనా ఇల్లు చేరటమే వారి లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రాణాలు కోల్పోతారని వారు భావించలేదేమో. ఈ తల్లి కూడా ఆహారం, నీరు లభ్యం కాక తాను మరణిస్తే, తన బిడ్డకు దిక్కెవరు అని ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఆ పసి బిడ్డకు దిక్కెవరు. రైళ్లు ఎక్కటం కోసం పెద్దపెద్ద క్యూలలో నిలబడటం, టికెట్ల కోసం నిరీక్షించటం, స్క్రీనింగ్‌ కోసం వేచి ఉండటం... వీటి వల్ల వలస కార్మికులు విలువైన, తిరిగిరాని వారి జీవితాలను కోల్పోతున్నారు. ఇటువంటి వారు ఇంకెంతమందో!!!

No comments:

Post a Comment